అహోబిలం-యాత్రా విశేషాలు

"కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? "

అంటూ "ఎందెందు వెదకి చూసిన అందందె కలడు విష్ణువ"ని అచంచల విశ్వాసంతో పలికిన అచ్యుతపద శరణాగతుడైన ప్రహ్లాదుని వాక్కును సత్యం చేసేందుకు స్థంభం నుండి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నరహరిగా ఉద్భవించిన మహోత్కృష్ట ప్రదేశం "అహోబిలం".

విచ్చుకున్న తామరలతో శోభిల్లే కొలనులు, సూరీడు తొంగి చూసేందుకు కాస్తంతైనా అనుమతివ్వని అమలిన అడవి అందాలు, నున్నటి గులకరాళ్ళ మీద జారిపోయే అడుగులతో ప్రయాణాలు, దారంతా వినిపించే జలపాతాల గుసగుసలు, భవనాశిని జల్లుల్లో చలిగిలిగింతలు, మరెక్కడా కనపడని కొన్ని వింత పూవులు, లతలు, దూరంగా ఎక్కడి నుండో వినిపించే హరి నామ స్మరణలు, ఎటుపక్కకు చూసినా కనువిందు చేసే లేత ఆకుపచ్చ రంగులు, వాటి చుట్టూరా రెక్కలు విదుల్చుకుంటూ తిరిగే రంగురంగుల సీతాకోకచిలుకలు, శ్రావణ భాద్రపదాల్లో విరివిగా కురిసిన వర్షాలకు పూచిన కొండమల్లెలు పంచే పరిమళాలు, ఎత్తైన పర్వత శిఖర అంచుల మీద, కలవరపెట్టేంత లోతైన లోయను కళ్ళు విప్పార్చుకుంటూ చూస్తుంటే సొంతమయ్యే అనుభవాలు, అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగు జారితే స్వర్గమే నన్న అపరిచితుల మాటలకు అప్రయత్నంగానే నవ్వులతో బదులిస్తూ సాగే నడకలు, అన్నింటి కంటే ముఖ్యంగా, మనస్సు అనుక్షణం ఆశపడే అద్భుతమైన మౌన ప్రపంచం.........- - స్వర్గలోకాల దారులను వర్ణిస్తున్నా అనుకుంటున్నారా...ఊహూ..అహోబిలం ప్రకృతి సౌందర్యాన్ని నా కళ్ళతో మీకూ చూపిస్తున్నానంతే!


స్వయంవక్త క్షేత్రంగా, నవ నరసింహులు కొలు తీరిన పరమ పవిత్ర పుణ్య స్థలంగా, ఈ ప్రాంతం గురించి చాలా మంది వినే ఉంటారు. ఎన్నాళ్ళుగానో వాయిదా పడుతున్న నా ప్రయాణం, అనుకోకుండా ఇటీవలే సాధ్యపడింది. మాటలకందని అనుభవం! అయినా సరే, ఆ ప్రాంతం గురించి నాకు తెలీని, ఎన్నడూ వినని ఎన్నో విషయాలు నేర్చుకున్న ఉత్సాహంతో, అవి పంచుకునేందుకో చిరు ప్రయత్నం.

అహోబిలం దాకా సరాసరి వెళ్ళేందుకు కుదరకపోవడంతో, బెంగళూరు-నంద్యాల- ఆళ్ళగడ్డ-అహోబిలం వెళ్ళాము. ఈ నంద్యాల-అహోబిలం రహదారిలో కారు ప్రయాణమైతే మహా మంచిది. చక్కగా వానలు పడుతున్న రోజుల్లో వెళ్ళామేమో ఎటు చూసినా ఆకుపచ్చని పొలాలు; ఏ ఆకాశహర్మ్యాలు లేవు కనుక, మీ కళ్ళు కొలిచినంత,కొలవగలిగినంత మేరా మీదే! ఆవలి ఒడ్డున భూమ్యాకాశాలు కలిసే వరకూ అడ్డేమీ లేకుండా కనపడుతుంది. మహానగరాల్లో నివసిస్తూ రోజువారీ పనుల్లో సతమైపోతూ, ఎప్పుడైనా బుద్ధి పుట్టి బయటకు వచ్చినా నాలుగు దిక్కుల్లోనూ కాపు కాస్తున్నట్టుండే అపార్ట్‌మెంట్‌లు రాక్షసంగా నవ్వితే చిన్నబుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళకి, ఇక్కడి ప్రకృతి కావలసినంత సంతోషాన్ని కానుకిస్తుంది.

ముందే చెప్పినట్టు అహోబిలంలో నవ నరసింహ క్షేత్రాలున్నాయి. అన్నీ స్వయంవక్త క్షేత్రాలే కావడం, ప్రతి క్షేత్రంలో స్వామివారు ఒక్కో గ్రహానికి అధిపతిగా ఉండటం ఇక్కడి ప్రత్యేకతలు. దిగువ అహోబిలం(కొండ క్రింది భాగంలో)భార్గవ,ఛత్రవట,యోగానంద నరసింహులు, ఎగువ అహోబిలంలో(కొండ పైన) కారంజ, అహోబిల, మాలోల, క్రోడ, పావన, జ్వాలా నరసింహులు కొలువు తీరి ఉంటారు. ఒక్కో అవతారానికీ ఒక్కో కథ ఉంది. ఒక్కో దర్శనానికి, క్షేత్ర పురాణం ద్వారా నేను విన్న దాన్ని బట్టి, ఒక్కో విశేష ఫలం ఉంది.

దిగువ అహోబిలంలో పైన చెప్పినవి కాక, మొట్టమొదట మనకు కనపడే లక్ష్మీ నరసింహుని గుడిలో మాత్రం, విగ్రహ ప్రతిష్ట జరిగింది. దీనితో పాటు, భార్గవ, యోగానంద, ఛత్రవట క్షేత్రాలలో స్వామి శాంత స్వరూపులు.

భార్గవ నరసింహ స్వామి :

పూర్వం పరుశురాముడు ఇక్కడ తపస్సు చేసినప్పుడు భగవంతుడు ప్రసన్నుడై భక్తవత్సలుడిగా ప్రత్యక్షమైనప్పుడు, పరశురాముడు సంతృప్తి పడక, హిరణ్యకశిపుడిని చంపిన ఉగ్రనరసింహుని రూపంలో తనకు దర్శనమీయమని ప్రార్థిస్తాడు. అతని కోరిక తీర్చేందుకు అవతరించిన ప్రదేశం ఇది. హిరణ్య వథ చేస్తున్న స్వామి విగ్రహం కనపడుతుంది. దీనికి సుమారుగా ఒక వంద మెట్ల దాకా ఎక్కాల్సి ఉంటుంది. కష్టమేమీ ఉండదు. అహోబిలం నుండి ఇక్కడకు సరైన ప్రయాణ మార్గాలేమీ ఉండవు. నడచి లేదా అక్కడ దొరికే ఆటోలో వెళ్ళాల్సిందే. దాదాపు అడవిలో వెళ్ళినట్టే ఉంటుంది.

మెట్ల మొదట్లో ఒక పక్కగా కోనేరుంటుంది. పరుశురాముడు తవ్వాడని, ఐదడుగుల లోతు మాత్రమే ఉన్నా ఎన్నడూ ఎండిపోదనీ పూజారి చెప్పారు. కోనేటి నిండా తామరలే. అందంగా, కొన్ని పూర్తిగా విచ్చుకున్నవీ, కొన్ని ముడుచుకున్న మొగ్గలు, తామరకుల మీద తొంగి చూస్తున్న సూరీడికిరణాలు పడి మెరిసిపోతున్న నీటి ముత్యాలు...కాసేపైనా కూర్చోకుండా మిమ్మల్ని వెనుతిరిగి వెళ్ళనివ్వవు.

ఛత్రవట నరసింహ స్వామి :

పూర్వం స్వామి గొడుగులా ఉన్న వట వృక్షం కింద యోగ ముద్రలో ఉన్నప్పుడు, "హాహ" "హూహ్వ"(గైడ్‌లు ఆహా -ఊహ అని చెప్తున్నారు మరి)అనే గంధర్వ కన్యలు ఆకాశ మార్గాన వెళ్తూండగా వారి వాహనం ఈ ప్రాంతానికి చేరగానే ఆగిపోతుంది. అప్పుడు వారిక్కడ మహాశక్తి ఉందని గ్రహించి, స్వామిని చేరి, తమ గాన నృత్య కళలతో స్వామిని ప్రసన్నం చేసుకుంటారు. వామ హస్తంతో తాళం వేస్తూ, ప్రసన్నుడై ఉన్న విగ్రహాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ గుడి ప్రాంగణంలో మహత్తరమైన ప్రశాంతత కలుగుతుంది. అలాగే మాట కూడా సంగీతంలా, వీణా వాద్యంలా వినపడుతుంది. చుట్టూ మరేమీ లేకపోవడం వలనేమో.

యోగానంద నరసింహ స్వామి :
హిరణ్యకశిప సంహారానంతరం, ప్రహ్లాదునకు యోగనీతిని, రాజనీతిని బోధించిన అవతారమిది. యోగముద్రలో ఉన్న స్వామి దర్శనమిస్తారిక్కడ. చిన్న గుడి. ఛత్రవట ఆలయంలోనూ, ఇక్కడా పూజారులు ఒక్కరే ఉండడం చేత, ఒకేరోజు వెంటవెంటనే దర్శనాలవ్వడం కష్టం. ఛత్రవటం దాటి ఇక్కడకు రావాలి కాబట్టి, ఆ దారిలో వెళ్ళే ఎవ్వరికైనా ఓ మాట చెప్తే, అయ్యవార్లు వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంది.

దీని పక్కనే, నవగ్రహ-నవనరసింహ ఆలయం ఉంది. తొమ్మిది క్షేత్రాలనూ దర్శించుకునే అవకాశం లేని వారు, ఇక్కడికి తప్పకుండా వెళ్ళండి. అన్ని అవతారాలు, వాటితో ముడిపడి ఉన్న గ్రహాల విగ్రహాలతో, ఈ ఆలయం బాగుంటుంది.

కారంజ నరసింహ స్వామి :
Karanja Narasimha swami

నాకు విపరీతంగా నచ్చిన ప్రాంతం ఇది. వంపులు తిరిగిన కొండచిలువ లాంటి రోడు మార్గం మీద ప్రయాణించి ఇక్కడకు రాగానే, సుందర తపోవనానికి వచ్చినట్టు ఉంటుంది. ఆలయం చుట్టూ బోలెడు ఖాళీ స్థలం. అంతా తులసి మొక్కలు. కొండ చరియ విరిగి పడుతుందా అన్నట్టుండే ప్రాతంలో ఉంటుంది.

ఆంజనేయ స్వామి ఇక్కడి కారంజ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసినప్పుడు నరసింహ స్వామి ప్రత్యక్షం కాగా, ఆయన నా శ్రీరామచంద్ర ప్రభువు తప్ప వేరెవ్వరూ నాకక్కర్లేదని మొండికేస్తారట. అప్పుడు, అన్నీ తానే అని చాటేందుకు, ఒక చేత్తో విల్లు, ఒక చేత్తో శంఖంతో, నుదుటన త్రినేత్రంతో స్వామి దర్శనమిచ్చి కరుణించారని స్థలపురాణం. ఆ మూర్తే గర్భ గుడిలో ఉండేది. ఆ విల్లు, శంఖం, త్రినేత్రం చాలా స్పష్టంగా కనపడతాయి. "అన్ని నీవనుచు.." అన్న పదాలు అప్రయత్నంగా పెదవుల మీద నాట్యమాడుతుంటే, జోడించిన చేతులతో కళ్ళు మూతలు పడతాయంటే అబద్ధం కాదు. దర్శనభాగ్యానికే మనసు పరవశించిపోతుందంటే అతిశయోక్తి కానే కాదు.

అహోబిల నరసింహ స్వామి :

'అహో' అంటే ఆశ్చర్యం. బిలం అంటే గుహ. ఆశ్చర్యకరమైన గుహలో ఉండే స్వామి కనుక అహోబిల నరసింహ స్వామి అంటారని ఒక కథ. రాక్షస సంహారంతో పలువిథ బాధల నుండి విముక్తులైన దేవతలందరూ కలిసి, మహాబలవంతుడని స్వామిని వేన్నోళ్ళ పొగడడం చేత "అహోబలుడ"య్యాడని మరొక కథనం.

కారంజ ఆలయం నుండి ఇక్కడికి ఒక పది పదిహేను నిముషాల నడక. నడిస్తేనే అసలు మజా! కోతులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.

పేరుకు తగ్గట్టే పూర్తిగా గుహలోనే స్వామి దర్శనమయ్యేది. కొంచం యాదగిరి గుట్టను గుర్తు తెచ్చింది నాకైతే. మహా ఉగ్రరూపం, ఎవ్వరి వల్లా శాంతం పొందని నరసింహ అవతారం, ప్రహ్లాదుడి ప్రార్థనలకు మాత్రమే చలించి, శాంతించాక, ఈ గుహలో స్థిరపడిందని చెప్తారు. బయట భవనాశిని కనపడుతుంది. అక్కడ స్నానం చేసి దర్శనం చేసుకుంటే సమస్త పాప క్షయం జరుగుతుందని ఓ నమ్మకం.

గుడిలోపల, మధ్యలో, ఇనుప కంచెలా ఒకటి కనపడుతుంది. ఆ ప్రాంతంలో ప్రతాప రుద్ర రాజులూ, విజయనగర రాజులు దాచిన అపారనిథులున్నాయని అక్కడి భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతం అంతా ప్రభుత్వ అధికారంలో లేదు కనుక, తవ్వకాలూ గట్రా ఏం లేవని గైడ్ చెప్పారు.

క్రోడ నరసింహస్వామి :

ఇది వరాహావతారం. హిరణ్యాక్షుడు భూదేవిని రాక్షస చర్యలతో హింసిస్తున్నపుడు, అతని బారి నుండి భూదేవిని రక్షించి, భుజాలపైకెత్తుకున్న కథ మనకు తెలిసిందే. ఇక్కడి విగ్రహంలో భీకరంగా ఉన్న వరాహాన్నీ, భుజాలపైనున్న భూదేవినీ చూడగలం. ఇదీ స్వయంవక్త క్షేత్రమే కావడం విశేషం.

అహోబిలం గుడి నుండి ఇక్కడకు వచ్చే దారి అద్భుతంగా ఉంటుంది. నీళ్లల్లోనూ, రాళ్ళల్ల్లోనూ నడక. మనకు కొండ మొదట్లోనే పెద్ద పెద్ద పొడవైన వెదురు కఱ్ఱలు ఊతానికి ఇస్తారు. మనిషికి రెండు. తీసుకునేటప్పుడు నేను భలే మొహమాటపడిపోయాను. చిన్నపిల్లని నాకిస్తాడేమిటీ, ఈ మాత్రం నడవలేనని వాళ్ళ ఉద్దేశమా అని. కానీ ఆ కర్రలు భలే అక్కరకొచ్చాయి. ఆ రాళ్ళు రప్పల్లో చెప్పుల్లేని నడక కాస్తైనా సుఖంగా సాగిందంటే వాటి చలవే. రెండు పేద్ద పేద్ద కొండల మధ్యలో, తుళ్ళుతూ కిందపడుతున్న భవనాశిని నీళ్ళల్లో తడుస్తూ, ఆ జలపాతపు సంగీతం వింటూ, వెలుగు చీకట్లు దాగుడుమూతలాడుతుంటే మంత్రముగ్థులమైపోతూ కొండ ఎక్కడం - అదో ప్రత్యేకమైన లోకమే నిజంగా!

జ్వాలా నరసింహ స్వామి :

అహోబిలానికి వచ్చే ఎనబై శాతం మంది, జ్వాలా నరసింహ స్వామి దాకా రాలేరుట. ఆ దారి అలాంటిది. చాలా ఎత్తున ఉంటుంది. అక్కడక్కడా కొన్ని మెట్లుంటాయి కానీ, మొత్తానికి ఎగుడుదిగుడుల్లో కాలినడకే ఎక్కువ. దారి చదునుగా ఉండే సమస్యే లేదు. కోతుల బెడద ఉండనే ఉంది. నల్లమల అడవుల అందాలను సంపూర్ణంగా చూడలనుకునే వారు ఇక్కడి దాకా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అడుగు జారిందా, చేతులు చాచి ఆహ్వానించే లోయ ఓవైపు, కొసలు తేలినట్టుండే నల్ల రాయి కొండ ఒకవైపు, మూడో దిక్కులో అడవి, నాలుగో దిక్కులో కళ్ళకు విందిచ్చే భవనాశిని జలపాతం. వేదాద్రి పర్వతం చివర్లో భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు అతి సన్నటి దారి ఒకటి ఉంది; తలలు పూర్తిగా వంచి, ఆ కొండ దారిలో వెళ్తుంటే, రెండో పక్క కొండ పైనుండి విపరీతమైన వేగంతో కిందపడే భవనాశిని ఎదురవుతుంది ఒక చోట. అక్కడ ఆ జల్లుల్లో తడిసి తీరాల్సిందే. అసలే దాదాపు పర్వతం పైదాక వచ్చేసి ఉంటామేమో, వణికించే చలి గాలులు ఒళ్లంతా చుడుతుంటే, దానికి తోడు ఈ చన్నీటి స్నానం!

అలా పది అడుగులు వేసాక "రక్త గుండం" కనపడుతుంది. హిరణ్యకశిపుడిని వజ్ర నఖాలతో చీల్చి చంపిన తరువాత, ఆ రక్తపు చేతులను స్వామి ఈ గుండంలో కడిగారట.

దాని పక్కనే జ్వాలా నరసింహ స్వామి దర్శనం అవుతుంది. ఇది నిజానికి హిరణ్యకశిపుడి కోట ద్వారం. బ్రహ్మ నుండి అతను పొందిన వరం ప్రకారం - మనిషీ, జంతువూ కాకుండా నారసింహుని రూపంలో, పగలూ-రాత్రీ కాని సంధ్యకాలంలో, ప్రాణం ఉన్నవీ లేనివీ అని తేల్చరాని నఖాలతో, ఇంటి లోపలా-బయటా కాక గుమ్మంలో, భూమిపైనో-ఆకాశంలోనో కాక తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. జ్వాలా నరసింహ స్వామి దర్శనమిచ్చేది అదే ప్రదేశంలో. తొడల మీద హిరణ్యకశిపుడు, పాదాల వద్ద ప్రహ్లాదుడు, మెడలో ప్రేగులు, మహోగ్ర రూపంలో ఉన్న మూర్తిని చూడగానే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తనను మనసా వాచా స్మరించి అర్చించిన ఒక భక్తుడిని కరుణించడానికి, కాపాడటానికి అవతరించిన శ్రీహరిని కళ్ళారా చూసి భక్తితో ప్రణమిల్లాలనిపిస్తుంది. ఇక్కడ విశేషమేమిటంటే, స్వామిని శాంతపరచడానికే ఆకాశ గంగ ఇక్కడికి దిగి వచ్చిందని చెప్తారు. అదే భవనాశిని.గుహ పై భాగం నుండి, సరీగ్గా స్వామి అభిషేకం జరుగుతున్నట్టే నీటి చుక్కలు పడుతూ ఉంటాయి. అది నిర్విరామంగా జరిగే ప్రక్రియ. ఏడాది పొడుగునా, ఏనాడూ ఆగకుండా, బొట్టుబొట్టుగా, ఆ ధార స్వామికి అభిషేకం చేస్తూనే ఉంటుంది.
బయటకు రాగానే గ్లాసులతో పానకం ఇస్తారు. ఎంత అడిగినా కాదనరు. పరమ పావన ప్రదేశంలో మనసు చెమరిస్తే, పానకపు చుక్కలతో అందాకా మండిపోయిన గొంతు కూడా చల్లబడుతుంది. ఇహ అక్కడి నుండి మన ప్రయాణం "మాలోల నరసింహ స్వామి" దగ్గరికి.

మాలోల నరసింహ స్వామి :

"మా" అంటే లక్ష్మీ దేవి. లోల అంటే ప్రియుడు. లక్ష్మీ దేవికి ప్రియుడై, లక్ష్మీ వల్లభుడై, శాంతరూపంలో ప్రసన్నుడై ఉన్న స్వామి దర్శనమవుతుంది ఇక్కడ. నరసింహ అవతారంలో స్వామి "చెంచు లక్ష్మి" అనబడే అడవితల్లి ముద్దు బిడ్డని పరిణయమాడారనీ, అది తెలిసి అలక బూనిన అమ్మవారు వైకుంఠం నుండి ఇక్కడకు వచ్చారని, అప్పుడు స్వామి ఇక్కడే అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని స్థలపురాణం. లక్ష్మీ సమేతుడై, అమ్మవారిని గాఢాలింగనం చేసుకున్నట్లుండే మూర్తిని దర్శించుకోవచ్చు.

ఈ ఆవరణ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానాలకి బాగా అనుకూలం. బోలెడన్ని పూలమొక్కలతో, నిండా విరబూసిన రకరకాల పూలతో, దగ్గరికి వెళ్తూండగానే మనసు హాయిగా అయిపోతుంది. మేమిక్కడ ఉన్నప్పుడు ఎవరో భజన సంఘం వారు బృందంగా దర్శనానికి వచ్చారు. అందరూ కలిసి కన్నడలో, కొన్ని తెలుగులో పాటలు పాడారు. అలా అందరం కలిసి పాడుతుంటే నిజంగానే "మదినొకటే హరినామ మంత్రమది చాలదా..తగు వేంకటేశు కీర్తనమొకటి చాలదా ..." అనిపించింది.

పావన నరసింహస్వామి :

చెంచులక్ష్మి సమేతుడైన నరసింహ స్వామి ఉన్నదిక్కడే. ఈ స్వామిని దర్శించుకుంటే చాలా శుభాలు జరుగుతాయనీ, పాపలు పోతాయనీ భక్త జన విశ్వాసం. ఇక్కడికి నడచి వెళ్ళడం మాత్రం చాలా కష్టం. కింద నుండి జీపులు ఉంటాయి. వాటిలో వెళ్ళడం కొంచం సులభం. కుదుపులు ఎక్కువగా ఉంటాయి, కొండదారి కాబట్టి.

చెంచులక్ష్మి అడవిజాతి స్త్రీ కనుక, ఆమె కోసం చుట్టుపక్కల ఊళ్ళ నుండి వచ్చి మరీ ప్రతి శనివారం గుడిబయట బలులిచ్చే సాంప్రదాయం ఈనాటికీ ఉందట. మంచి కోలాహలంగా ఉంటుందని చెప్పారు. నాకైతే చూసే అవకాశం రాలేదు.

క్రోడ నుండి జ్వాలా నరసింహుని దగ్గ్రకు వెళ్తున్నప్పుడు, కొండ మధ్యలో ఒక చోటు నుండి ఉగ్రస్థంభం కనపడుతుంది.

" ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, .......... వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్థంభము నుండి ఆవిర్భవించినది ఇక్కడే. వెళ్ళడానికి బోలెడు బలం, ఓపిక, అవసరమైతే వానరుల్లా చేతులతో నడవగలిగిన ప్రావీణ్యం కావాలన్నారు. నాకు అన్ని ఉన్నాయి కానీ, సమయం సరిపోలేదు.

"చదవనివాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ "

అంటూ చండామార్కుల వారికి అప్పజెప్పిన తండ్రి హిరణ్యకశిపుని మాట శిరోధార్యంగా భావించి, పరమ భాగవతుడు ప్రహ్లాదుడు విద్యాభ్యాసము చేసిన "ప్రహ్లాద బడి" మరొక దర్శనీయమైన ప్రదేశము. ఇది కూడా నేను చూళ్ళేకపోయాను.

"పునః దర్శన ప్రాప్తిరస్తు" అని ప్రతి చోటా దీవించిన అయ్యగార్ల ఆశీర్వచనం ఫలించి, మళ్ళీ నవ నరసింహ క్షేత్రంలో అడుగిడగల్గిన భాగ్యం కలిగితే, వాటి విశేషాలతో మరో సారి కలుస్తాను. అందాకా వీటిని అసంపూర్ణంగా వదిలేస్తున్న బాధను దిగమింగుతూ .. :) 

23 comments:

  1. yes i also had an opportunity to have darshan of lord 5 yrs back. my experience with swamy was deferent.

    ReplyDelete
  2. మన ఆంధ్రదేశంలో నారసిమ్హ క్షేత్రాలు ఎక్కువగా ఉండటానికి కారణం బహుశా ప్రహ్లాద చరిత్ర ఇక్కడే జరిగి ఉంటుందని అనిపిస్తుంది.వర్షాకాలం తర్వాత ఆ అడవులన్నీ ఎంతో మనోహరంగా ఉంటాయి.అక్కడి చెంచు వాళ్ళు స్వామిని బావ అంటారు.చెంచులక్ష్మి వారి ఆడపడుచు కదా.

    ReplyDelete
  3. మీ స్పందన బాగా వ్రాసారు. చాలా బాగుంది. ఇప్పుడు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని చెప్పగా విన్నాను. పచ్చని కొందల్లొ..లోయల్లో.. జలపాతాల జల్లుల్లొ భక్తి భావనలో మునిగిన మీకు అనుభూతుల ప్రాప్తం. అక్షరాలలో ..దర్శించిన మాకు కనిపించింది. ధన్యవాదములు ....

    ReplyDelete
  4. ఆ ప్రాంతాన్నంతా కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. నాకయితే మళ్ళీ దర్శనం చేసుకున్నట్టనిపించింది. నల్లమల అందాలు వర్ణించలేనివి అనుభవ పూర్వకముగా తెలియవలసినదే. అక్కడున్న వృక్ష సంపద కూడా ఎక్కువే అక్కడ దొరికినన్ని రకాలు ఇంకెక్కడా దొరకవు.

    ReplyDelete
  5. నేను రెండు సార్లు వెళ్ళానండీ...ఎగువ అహోబిలానికి,దిగువ అహోబిలానికి. ఈ నావనారసిమ్హ క్షేత్రాలు చూడాలని నా ఆశ. ప్చ్! కుదరట్లేదు :(

    ReplyDelete
  6. @కమనీయం - నిజమేనండి. ప్రహ్లాదుడు, నరసింహుడు అక్కడే ఒకప్పుడు ఉన్నారనే భావనే అపురూపంగా అనిపిస్తుంది. నరసింహ క్షేత్రాలన్నీ అడవుల్లోనూ, అంతగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లోనూ ఉండటం మరో విశేషం.
    @ రసజ్ఞ గారూ : మీరన్నది అక్షర సత్యం! నల్లమల అడవుల అందాలు కళ్ళారా చూడవలసినవే కానీ, చదివితే అనుభవించగలిగినవి కావు.మీకు మరో సారి స్వామివారినీ, ఆ ప్రాంత అందాలను గుర్తు చేయడంలో సఫలీకృతురాలినయ్యానన్నమాట! చాలా సంతోషం. మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. @ వనజ వనమాలి గారూ : మీ స్పందనకు ధన్యవాదాలు.మీరిప్పటి దాకా వెళ్ళి ఉండకపోతే, వీలైతే ప్లాన్ చేయండి. తప్పక దర్శించవలసిన ప్రదేశం.
    ఇందు : దర్శనాలతో ఇబ్బంది అయిందా? సమ్యం సరిపోకా? చాలా మందికి గుళ్ళల్లో పూజారులు ఉండక , దర్శనాలన్నీ అవ్వవని విన్నాను. గైడ్‌లు తోడుంటే, ఇలాంటివి బాగా చెప్తారు. ఈ సారి వెళ్ళినప్పుడు, ఆ కబుర్లన్నీ పంచుకోవడం మర్చిపోకండి.:)

    ReplyDelete
  8. మానస గారూ... అద్భుతం కన్నా పైన పదమేదైనా ఉంటే దయచేసి చెప్పండి. ప్రతీ సారీ, మీ రచనలకి సరిపడే వ్యాఖ్యని పెట్టాలని వస్తాను. కానీ అంతవరకూ అందుకోలేక ఏదో అలా పెట్టేసి వెళ్లిపోతాను.

    అహోబిలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. మీరు నమ్ముతారో లేదో తెలీదు కానీ, మీ టపా చదివిన క్షణం నుండి నాకు వీలైనంత తొందరగా అహోబిలం వెళ్లాలని మనసు ఉరకలేస్తూ ఉంది.

    ReplyDelete
  9. మానస గారు, చాల బాగుంది.దానితో పటు ఫోటోలు కూడా జత చేస్తే ఇంకా బాగుండేది...

    ReplyDelete
  10. మీ మాటల చాతుర్యంతో అహోబిల ప్రకృతి సౌందర్యాలను మా కళ్ళలోకి నింపేశారు. భక్తి శ్రద్ద వర్ణనతో ఆ నవ నరసింహ క్షేత్రాలను దర్శింపజేశారు.

    అహోబిల విశేషాలు చదువ్తుంటే నేనెప్పుడు వెళ్తానా అని ఉంది. నరసిహ్మానుగ్రహం ఎప్పుడు కలిగితే అప్పుడని వదిలేయక త్వరలో వెళ్ళొచ్చే ప్రయత్నం చెయ్యాలి.

    మొదలుపెట్టడమే మత్తేభముతోనా? ఎక్కడైనా మత్తేభానికి తాత్పర్యముంటుందనుకున్నాను. తాత్పర్యందేముందిలేండి, ఉగ్ర నరసింహుని క్షేత్రాన్నంతా కళ్ళతో నింపుకొచ్చి ఇక్కడందించేశారు. వీడియోలో చూసినా ఇన్ని విశేషాలు తెలిసేవి కాదు.

    ReplyDelete
  11. wow.. Best travel article i have read so far.. Ippati varaku chaalaa articles chadivaa kaani, truely this is the best one.. Kallaku kattinattu cheppatam ante idenemo..

    ReplyDelete
  12. i really dont know if that place itself is as beautiful as you have described...but while reading your article, place around me itself transformed into a bed of greenery and i could hear the water flow and birds chirping..truly it felt like heaven..
    not everyone has the heart to look nature so close and very few of them have the art to put it back in words..
    Soni

    ReplyDelete
  13. మీ అనుభూతుల్ని అపురూపంగా అక్షరాల్లోపెట్టి అందరికీ ఆనందాన్ని కలిగించారు. మీకు పునఃదర్శన ప్రాప్తి కలిగి మరలా మంచి వివరాలు అందించాలని కోరుకుంటున్నా.

    ReplyDelete
  14. @Soni Polimera,
    //not everyone has the heart to look nature so close and very few of them have the art to put it back in words..//

    I agree with you :)

    ReplyDelete
  15. ಮಾನಸ ಗಾರೂ,
    ಮಮ್ಮಲ್ನೀ ಮೀತೋಬಾಟು ಅಹೋಬಿಲಂ ತೀಸುಕುಪೋಯಾರು. ಮೀ ಉಟಂಕಿಂಪುಲು, ಭಾಗವತ ಪದ್ಯಾಲೂ ಚಾಲಾ ಸಂದರ್ಭೋಚಿತಂಗಾ ಉನ್ನಾಯಿ. ಅನ್ನಿಟಿಕಂಟೆ ಮುಖ್ಯಂಗಾ ಮೀ ತೆಲುಗು ತೆಲುಗಂತ ತಿಯ್ಯಗಾ ವುಂದಿ.

    ReplyDelete
  16. అపర్ణా.. :). వెంటనే వెళ్ళి, ఈ సారి మీ వర్ణ్నాతో మాకు దర్శనం అయ్యేట్టు చేయండి మరి!
    మీ అభినందనలకి హృదయపూర్వక కృతజ్ఞతలు.
    లక్ష్మీనరేష్ గారూ : తప్పకుండా! కాస్త గడువిప్పించండి, మంచివి చూసి మిత్రులందరితో పంచుకుంటాను. ధన్యవాదాలు.
    భాస్కర్ గారూ: బోలెడు థాంక్స్. మీరు చెప్పిన లక్ష్మీ నరసింహాలయానికే నా తరువాతి ప్రయాణం. మీరూ, ఆశా కలిసి అహోబిలం వెళ్ళి అందమైన అనుభూతులు మూటగట్టుకుని తిరిగి రావాలని అభిలషిస్తూ...

    ReplyDelete
  17. Dear Soni: and only few can get connected to what the writer was actually trying to convey..and you are one among them. Thanks alot for the wonderful feedback. It's indeed a beautiful place to visit and travelling amidst forest and waterfalls is a lifetime experience. Plan to visit the place sometime.

    ReplyDelete
  18. @ మురళీ గారూ : మీ వాక్కు ఫలించాలని నేను కూడా ఆశపడుతూ - నెనర్లు.
    @అజ్ఞాత : తెలుగంత తియ్యగా ఉందంటూ కన్నడలో చెప్పడమేమిటో నాకర్థం కాలేదు.Thanks anyways :)

    ReplyDelete
  19. ప్రకృతికి ఫొటోలు తియ్యడానికి ఎక్కడికైనా వెళ్తుంటాను. శ్రీకాకుళం నుంచి నంద్యాలకి డైరెక్ట్ ట్రైన్‌లు ఉన్నాయి. నంద్యాల నుంచి అహోబిలానికి బస్సులు ఉన్నాయా?

    ReplyDelete
  20. ప్రవీణ్ గారూ : నంద్యాల నుండి అహోబిలానికి నేరుగా ఎక్కువ బస్సులున్నట్టు లేవు. మీరు నంద్యాల నుండి ఆళ్ళగడ్డ వెళ్ళారంటే, అక్కడి నుండి కావలసినన్ని ఉంటాయి.

    ReplyDelete
  21. Very detailed and informative article. chakkani Telugu vaaDaaru. varNanalO manchi chaaturyam kanipistOndi.

    BTW, I read this in Google reader and thought this is Avineni's article. When I was about to comment, I saw Avineni's comment and then realized it is you! So madhumanasam is your blog, not Bhaskar's! My mistake all these days!

    ReplyDelete
  22. Manasaa! Ahobilam Yatra viseshalu chala bagunnai. Nakun kooda choodalanipistundi. Kallaku kattinattlu varnicharu. Thank you.

    Maroka vishyam : Malli okasari Veturigari gurinchi ante ayana patala gurinchi rayandi. He is a very great scholar in telugu cine poetry. This is my opinion.

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...