మురళీ ప్రణయగాథ

"ముర్లీ, ప్లీజ్! నన్ను అర్థం చేసుకో; ఐ రియల్లీ లవ్ యు."

చెవులు మూసేసుకున్నాడు మురళి.

"కనీసం నా మాట వినడం కూడా ఇష్టం లేదా నీకు?" రోషంతో అడిగింది రమ్య.

" నా పేరును చంపేస్తుంటే చెవులప్పగించుకుని వినడం నా వల్ల కాదు"

" హబ్బా!!!! నాకు కొన్ని పదాలు పలకవు, అది కూడా పెద్ద నేరమేనా, అసలు ఆ వంక పెట్టుకుని పెల్లే వద్దనడం ...ఇట్ ఈజ్ జస్ట్ నాట్ ఫెయిర్"

"రమ్యా, ప్లీజ్, నువ్వు "పెల్లి" "మురలి" అనడం మాకపోతే - మన పెళ్ళి సంగతి వదిలెయ్, నీతో మాట్లాడటం కూడా మానేద్దామనుకుంటున్నాను.

" అంటే నాలుగేళ్ళ పరిచయం, కలిసి తిరగడం, అన్నీ మర్చిపోదామా?"

" ఊ..."

"ఏమైంది నీకు, ఇంత మొండిగా తయారయ్యావు, నీకు తెల్సు కదా, నేను చదువు కోసం ఇక్కడికి వచ్చిన దాన్ని. వచ్చి దాదాపు సెవన్ యియర్స్ అవుతోంది. నేను మాట్లాడేది వాల్లకి అర్థం అవ్వాలి అంటే, మాట తీరు దానంతట అదే మారిపోతుంది. దానికి నేనేం చెయ్యను? "

"ప్రయత్నం."

" కమాన్!!"

" రమ్యా, నేను ఇక్కడికి వచ్చిన నాలుగేళ్ళలోనూ, కనీసం నా పేరైనా సరిగ్గా పిలవమని నిన్ను ఎన్నో సార్లు అడిగాను. నువ్వు వినలేదు. మాటకి ముందో సారి 'హనీ ' వెనకోసారి 'హనీ'. నువ్వు ప్రయత్నం చేసిందెప్పుడసలు? మొన్న సెమినార్‌కి స్టాంఫోర్డ్ వెళ్ళి, అక్కడి నుండి కృష్ణ శాస్త్రి విరహ గీతం తెలుగులో టైప్ చేసి పంపిస్తే, వెంటనే కాల్ చేసి, అర్థం ఏమిటో చెప్పమన్నావ్! "

"అఫ్కోర్స్! నాకు మరి అర్థం కాలేదు"

"కాస్తందుకో, దరఖాస్తందుకో...ప్రేమ దరఖాస్తందుకో; ముద్దులతోనే ముద్దరలేసే...- అని ఆ రోజు నేను కూని రాగాలు తీసినప్పుడు ఏం చేసావు?"


"మధ్యలోనే ఆపి దరఖాస్తు అంటే ఏమిటని అడిగాను.గుర్తుంది. నీకు కోపం వచ్చి వెళ్ళిపోయావనీ గుర్తుంది. మరి నువ్వసలు ఆ పాటే ఎందుకు పాడాలి...'Nothing gonna change my love for you' అనో లేదంటే ' I count the minutes, I count the seconds till you are here by my side again' అనో పాడితే నేనూ అందుకునేదాన్ని కదా!"

" సరిగ్గా నేను చెప్తోందీ అదే! అనుక్షణం నన్ను నేను మార్చుకోవాలి. లేకపోతే మన మధ్య రొమాన్స్ బతికే మార్గమే లేదు."

"ఇప్పుడు నువ్వు నన్ను మార్చాలని చూడట్లేదా..ఓఁ నా మీద నేరాలు చెప్తున్నావ్?"  బుసలు కొట్టింది..అంతలోనే సర్దుకుని,

" I can share the tips to keep the romance alive" కొంటె నవ్వులు కొనితెచ్చుకుంటూ అంది రమ్య.

"నాట్ ఫన్నీ;రమ్యా, నాకు తెలుగు సాహిత్యం ప్రాణం. అలా అని నాక్కాబోయే భార్య అపర సరస్వతి కావాలని నేను ఆశపడలేదు. సంసార రథం సాగాలంటే ఇద్దరి అభిరుచులూ నూటికి నూరు శాతం కలిసి తీరాలనుకునే వెర్రి వాణ్ణి కాదు నేను. కానీ, నా భాషను నువ్విలా చంపేస్తుంటే, అర్థం లేని వివరణలిచ్చి తప్పించుకోవాలనుకుంటే, నా వల్ల కాదు. నా పేరును కూడా సరిగ్గా పలకాలనుకోని మొండి మోడరన్ అమ్మాయి నా జీవితాన్ని ఏం చేస్తుందా అనే అనుమానం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది."


" సీ! నేనూ ఆఖరు సారి అడుగుతున్నాను, నాకు రానివి, నేను చెయ్యలేనివి నా చేత బలవంతంగా చేయించాలని చూడకు. నాకు డామినషన్ అంటేనే నచ్చదు. నన్ను నన్నుగా ప్రేమించాలి నువ్వు. అది నీకు చేతకాదంటే, ఫైన్. విడిపోదాం!"

"ఆల్రైట్"

రమ్య కళ్ళు కన్నీటి కొలనులయ్యాయి.

" నువ్వు నా వాడివి కావు. ఎందుకిలా అయ్యవో నాకు తెలీడం లేదు. నన్ను ఈ నాలుగేళ్ళలోనూ కంటికి రెప్పలా చూసుకున్నావు. నా మీద లెక్కలేనంత ప్రేమను చూపించావు. అర్థరాత్రి పీడకల వచ్చిందని ఫోన్ చేస్తే, ఇరవై కిలోమీటర్ల దూరాన్ని నిముషాల్లో దాటి నా దగ్గరకు వచ్చావు. నీకు నా మీద ప్రేమ లేదంటే, నేను ఒప్పుకోను. ఏం చెయ్యాలి నేను, నీ పేరు సరిగ్గా పలకాలి అంతే కదా, ప్రయత్నిస్తాను. నిజంగా! తెలుగులో మాట్లాడాలి, అదీ చేస్తాను. కానీ, విడిపోదాం అనకు, ఇట్ హర్ట్స్. ఆ బాధ నేను భరించలేను"

"..."

"బదులైనా ఇవ్వు, అసలు నా మాటలు వింటున్నావా? నన్ను నమ్మవా?"

"..."

"ము ర ళీ..చూశావా, సరిగ్గా పలికాను ! నాకు పెళ్ళి అంటూ జరిగితే అది నీతోనే! ఇదుగో, పెళ్ళి కూడా బానే పలికాను కదా ఇప్పుడు. నువు లేకుండా నేను బతకలేను...అలా నమ్మలేనట్టుగా చూడకు. నాకు కోపం వస్తుంది"

ఎర్రబడ్డ ముక్కు తుడుచుకుంటూ, కన్నీటి చారికలను అర చేత్తో చెరిపేసే ప్రయత్నం చేస్తూ కాస్త గట్టిగా చెప్పింది.

అతనిలో చిన్న చిరునవ్వు.

"ఏంటా పిచ్చి నవ్వు?"

"అంత ప్రేమ నిజంగా ఉందా అని"

"ఉంది. ఎలా నమ్మించాలి నిన్ను" నీరసంగా, బాధగా లోగొంతుకలో అడిగింది మళ్ళీ.

"తెలుసా...నాకసలు మాటలు నమ్మే అలవాటే లేదు..." కళ్ళు మూసుకుని, కుర్చీలో వెనక్కు వాలిపోతూ, అర చేతులు పూర్తిగా ఆహ్వానంలా చాస్తూ అన్నాడు మురళి.
*********

27 comments:

  1. హాహాహా, భలే పలికేసింది ఈ రమ్య. బహుశా, పలికించింది ప్రేమే కాబోలు :)

    ReplyDelete
  2. చాలా బాగా రాశారు. ఏమైనా అంటే నన్నెవరూ బలవంతంగా ఏపనీ చేయించలేరు అనడమొకటి వచ్చు.
    ఇంతకీ కల్యాణం అని రాసే ఈనాడు పేపర్ వాళ్ళనేం చెయ్యాలండీ.

    ReplyDelete
  3. బావుందండి.మనసుకి హత్తుకుంది.

    ReplyDelete
  4. బాగా రాశారు.
    మురళీ బాధ చూస్తె నాకు చలం గారి "యోగ్యతా పత్రం" గుర్తుకు వస్తుంది.
    ---------------
    "ఎమిటి వొంతెన మీద నుంచుని చూస్తున్నావు?"
    "సంధ్య కేసి."
    "ఎవరు ఆమె?"
    అంటే ఏం మాట్లడగలిగాను?
    ----------------------

    ReplyDelete
  5. good one - అపభ్రంశపు ఉచ్చారణని కూడ ప్రేమ జయిస్తుందన్న మాట

    ReplyDelete
  6. మానస గారు, చాలా బాగుంది.

    ఇది చదివిన తరవాత నాకో సందేహం పట్టుకుంది. నా తెలుగులో ఎన్ని తప్పులున్తాయో అని

    ReplyDelete
  7. ఓ కామెంటెనకాల పడి నేనొస్తే...
    పూర్తిచేసే వరకూ నన్నొదల్లేదీ పోస్టు.

    చాలా చాలా బావుంది మానస గారూ.

    @పక్కింటబ్బాయి గారూ.. మీరేమీ ఫీలవకపోతే చిన్న మాట... కళ్యాణం సరైన పదం కాదండీ. కల్యాణం అన్నదే కరెక్ట్.

    ReplyDelete
  8. బాగుందండీ.. మంచి పాయింట్ చెప్పారు..

    ReplyDelete
  9. బావుంది.వారంలో నాలుగు టపాలు వ్రాసేశారే.పని వత్తిడిలో పడి చూడలేదు.కాస్తందుకో పాట 'రెండు రెళ్ళ ఆరు' సినిమాలోంచి అనుకుంటాను

    ReplyDelete
  10. @భాస్కర్ : నిన్న చెప్పిన మాటే మళ్ళీ - పలికెడు వాడెవ్వడు, పలికించు వాడెవ్వడు..అంతా విష్ణు మాయ :) .థాంక్స్.
    @పవన్ సంతోష్ - ధన్యవాదాలు. మీరు కల్యాణం -కళ్యాణం గురించి ప్రశ్నలు లేవనెత్తి పెద్ద చిక్కే తెచ్చి పెట్టారు. ఇది నాకూ అనుమానమే. సుప్రసిద్ధమైన కొన్ని తెలుగు సినిమాల్లో కల్యాణం అని రాయడమే చూశాన్నేను. కానీ, వాడుకలో ఎప్పుడూ 'కళ్యాణం' అనే పలికినట్టు గుర్తు. అంతర్జాలంలో ఒకటి రెండు సార్లు దీని గురించిన ప్రశ్నలు వచ్చినా, ప్రతిసారీ వాదన అర్థాంతరంగా ముగిసిందనే చెప్పాలి. మీరు దేని ఆథారంగా 'కల్యాణం' తప్పంటున్నారో కాస్త వివరించగలరా?

    ReplyDelete
  11. @శైలబాల గారూ: ధన్యవాదాలండి.
    @క్రిష్ : కృతజ్ఞతలండీ. చలం మార్కు హాస్యం అది. ఎన్ని సార్లు చదివినా చమక్కుమని మెరిసి ఒక నవ్వు మనకి కానుకిచ్చి వెళ్ళిపోతుందది.
    @కొత్తపాళీ గారూ: అంతేనండి. మీ కలంపేరుని పదిలంగా కాపడుతుంది కూడా! :)
    @వంశీ గారూ : తప్పులుంటే దిద్దుకుంటూ సాగిపోవడమే! ఆ ఎఱుక ఉంటే అదే చాలు ఎదగడానికైనా, నేర్చుకోవడానికైనా! మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  12. @గీతిక గారూ: హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ఆత్మీయ స్పందనకు. పవన్ గారినడిగిన ప్రశ్నే మీకూనూ : 'కల్యాణం' అనేదే సరి అయినదని చెప్పడంలో ఆథారమేమితో కాస్త వివరించగలరా, అనుమానాలున్న చాలా మంది నివృత్తి చేసుకుంటారు.
    @వేణూ గారూ: ధన్యవాదాలు. మీ పేరు విషయంలోనూ జాగ్రత్త సుమా! :)
    @లోకేష్ శ్రీకంత్ గారూ : అవునండి. ఈ వారం మనసు రాయడం మీద కాస్త మోజెక్కువ చూపిస్తేనూ... :). రెండు రెళ్ళు ఆరు అవునో కాదో గుర్తు లేదు కానీ, ఖచ్చితంగా జంధ్యాల గారి సినిమా. వేటూరి రచన. పాట అద్భుతంగా ఉంటుంది - వింటే వెంటాడుతుంది కూడానూ. మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  13. మానస, గీతిక గార్లకు,
    సంస్కృతంలో ల అక్షరం మాత్రమే ఉంది. తెలుగులో ల, ళ కూడా ఉన్నాయి. కల్యాణం అనే పదం సంస్కృత పదం. సంస్కృత ఉచ్చారణలోనూ, వ్రాతలోనూ కల్యాణమే. కానీ తద్భవంగా తెలుగులోకి వచ్చేప్పుడు కళ్యాణమైంది. కనుక తెలుగులో కళ్యాణమనే పలుకుతాం అలానే రాస్తాం కూడా. కానీ కొందరు సంస్కృతంపై ప్రేమ ఎక్కువ ఉన్నవారూ, మరికొందరు ళ కారం గ్రాంధికమూ, ల కారం వ్యావహారికమూ అనుకునేవారూ(ఈనాడు వారు ఈ కోవకు చెందుతారు) కల్యాణం అని రాస్తారు. అది సరికాదని నా అభిప్రాయం.
    ఒక ఉదాహరణ చెప్పుకుంటే అర్ధమౌతుంది మనం తెలుగులో కళ అంటున్న పదం సంస్కృతంలో కల((ఫైన్ ఆర్ట్)సంస్కృతంలో ళ కారం లేదు కనుక)) మరి తెలుగులో కల అంటామా? కల అని వేరే పదం ఉంది కనుక ఐతే ఎన్ని పదాలకు నానార్ధాలు లేవు. మరి కళ్యాణం పైనే ఎందుకీ వివక్ష.

    ReplyDelete
  14. పక్కింటబ్బాయి (ఇల్లు మారాడు): మీ తర్కం బాగుందండి. అయితే ఓ ఆలోచన.. కల అనే వేరే మాటొకటి ఉంది కాబట్టి, కళ స్థిరపడింది. కానీ కల్యాణం అనే వేరే మాట లేదు కాబట్టి తెలుగులోనూ కల్యాణమే అయిందేమో..?

    నేనూ కళ్యాణమే సరైనదనుకునేవాణ్ణి. బూదరాజు రాధాకృష్ణ గారు "మాటలూ మార్పులూ" పుస్తకంలో కల్యాణమే సరైనదన్నట్టుగా రాసినది చదివాక, మార్చుకున్నాను. బ్రౌణ్యంలో మాత్రం రెండు మాటలూ ఉన్నాయి.

    ReplyDelete
  15. పవన్ గారూ, వివరణకు ధన్యవాదాలు.
    చదువరి గారూ: మీరు ఈ కింది సైట్^లో నడిపిన చర్చలో మీకేదైనా సమాధానం దొరికిందా? అయిన పక్షంలో దానిని పంచుకోగలరు. అక్కడే మీరు ఇచ్చిన లింక్ పనిచెయ్యడం లేదు. కుదిరితే సవరణతో కూడిన కొత్త లింక్ ఇస్తారా?
    http://diversityintelugu.blogspot.com/2007/04/blog-post_08.html
    నేను కూడా బూదరాజుగారి పుస్తకాన్ని ప్రామాణికంగా భావించేదాన్ని.కానీ, కొన్ని పదాల విషయంలో గందరగోళం ఉంటూనే ఉంది. ఇదే అంశం మీద కొన్నాళ్ళ క్రితం కొత్తపాళీగారి బ్లాగ్‌లో కూడా చర్చ నడిచింది. ఆ లింక్ కింద ఇస్తున్నాను.
    http://kottapali.blogspot.com/2011/04/5.html

    ReplyDelete
  16. మానస గారూ, ఆయన ఆ సైటును మూసేసారండి. అప్పటివరకూ ఉన్న కంటెంటు ఏమైందో తెలీదు. కొత్తపాళీ గారి బ్లాగులో జరిగిన చర్చను ఇప్పుడే చూసాను.

    ReplyDelete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. తెలుగు వేరే భాష సంస్కృతం వేరే భాష. తెలుగుకో ళకారం, దాన్ని వాడేందుకు కొన్ని పదాలూ ఉండగా సంస్కృతంలా రాయడమెందుకండీ. నేనీ విషయాన్ని కొందరు పండితులతో పాటూ కూడా చర్చించానండీ. మరి వాళ్లు కూడా కళ్యాణమే కరెక్టన్నారు మరి.

    ReplyDelete
  19. @ మానస గారు: బాగా చెప్పారు.
    @ALL: నా తోడి వాళ్ళతొ "వసార", "జుగుప్స" లాంటి మాటలు వాడితెనే "అంటే?" అంటున్నారు. ఇక "కళ్యాణం" లేక "కల్యాణం" తేడ సరే సరి. మాటలు వాడుకలొ లేకపొతె త్వరగా అంతరించి పొతాయి.
    :నా ఇంగ్లీషు మీడియం తెలుగులొ తప్పులు వుంట్టె సరిచెసిన వారికి ధన్యవాదాలు.

    ReplyDelete
  20. "దేశ భాష లందు తెలుగు లెస్స"
    -Sri Krishnadevaraya

    ReplyDelete
  21. ಮಾನಸ ಗಾರೂ,
    ಪ್ರೇಮ ಗುರಿಂಚಿ ದಾನಿ ಮೌಲಿಕ ತತ್ವಾನ್ನಿ ಗುರಿಂಚೀ ಇಂತ ಚಕ್ಕಗಾ ಚೆಪ್ಪಿನ ಕಥ ನೇನು ಇಂತ ವರಕೂ ಚದವಲೇದು. ಇದಿ ನಿಜಂಗಾ ಚಾಲಾ ಗೊಪ್ಪ ಪ್ರಯತ್ನಂ. ತೆಲುಗಂತ ತಿಯ್ಯನಿ ಭಾಷ .., ತೆಲುಗೇ.ಇಂತ ಚಕ್ಕಗಾ ರಾಸಿನ ಈ ಕಥನಿ ಮೀರು ಏ ಪತ್ರಿಕಕಿ ಪಂಪಿನಾ ಕಳ್ಳು ಮೂಸುಕುನಿ ವೇಸೇವಾರು. ಅಪ್ಪುಡು ಮರಿಂತ ಎಕ್ಕುವಮಂದಿ ಚೂಸೇವಾರು. ಮೀ ಕಥ ಎಂತಬಾಗುಂದೋ ಆ ಕಥ ಚಿವರ ಮೀರು ರಾಸಿನ ಸೂಚನ ಅಂತಕಂಟೆ ಬಾಗುಂದಿ.

    ReplyDelete
  22. నిజమే. చాలా కష్టం గా ఉంటుంది.. 'ళ' ని 'ల' గా పలుకుతుంటే వినటానికి.. కానీ ఈ మధ్య ఇలాగ అందరూ అంటుంటే.. మనం సెన్సిటివ్ గా ఉంటే కష్టం అని అర్థమయింది. టీవీ పెడితే చాలు ౭౦% ఆంగ్ల పదాల మధ్య 'బాద, నీల్లు, వెల్లాలి, బగవంతుడు, మల్లీ మల్లీ,..' లాంటి పదాలు దొర్లుతూ .. :)

    ReplyDelete
  23. @కృష్ణప్రియగారూ : అక్షర సత్యం! అలవాటయిపోతుందేమో అన్న భయంతో నేను టి.వి చూడడం మానేసి చాలా రోజులైంది.
    :(

    ReplyDelete
  24. నాకు కూడా 20 ఏళ్ళు వచ్చేవరకు 'ళ' అక్షరం పలకడం రాదు...మా అమ్మ తెలుగు భాషను అలా మాట్లాడకూడదు అని నన్ను తిట్టి తిట్టి ...నాకు 'ళ' పలకడం అలవాటు చేసింది...ఆ జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తుచేశారు

    ReplyDelete
  25. ఈ‌ కథా, దీనిమీద జరిగిన చర్చా అనే రెండూ కూడా నాకు ఆనందం‌ కలిగించాయి. నా దృష్టికి వచ్చినప్పుడు నాకు వీలైనప్పుడల్లా తెలుగుభాషలో నవీనుల అక్షరదోషాలను గురించి సున్నితంగా సరిజేసి తెలియజెప్పుతూనే ఉన్నాను. ఈ‌ కథారూపంగా చేసిన ప్రయత్నం చాలా హర్షణీయం. కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడినట్లు ప్రస్తుతం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ తెలుగుపలుకుబడినీ, భాషాస్వరూపాన్నీ యథాశక్తిగా ధ్వంసంచేసేస్తున్నాయి. కన్నడిగులకూ తమిళులకూ ఉన్న భాషాభిమానంలో మన తెలుగువాళ్ళకి వెయ్యోవంతు కూడా ఉన్నట్లు కనబడదు.

    ReplyDelete
  26. కృష్ణగారూ,
    శ్యామలీయం గారూ, ..ధన్యవాదాలు. మీ స్పందనలను చూసి ఈ పాత టపా చాన్నాళ్ళ తరువాత మళ్ళీ ఈ రోజే చూశాను. :)

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...