అనుభవాలన్నింటికి అక్షరాల తొడుగులు తొడగడం నా వరకూ నాకు అసాధ్యమైన పనే! అయినా ఎందుకీ తాపత్రయం అంటే, ఆ అనుభవాలకు సంబంధించిన అన్ని విశేషాలనూ కావలనుకున్నప్పుడల్లా తరచి చూసుకోవడానికి; మళ్ళీ మళ్ళీ జ్ఞాపకాల జారుడుబల్లనెక్కి, గతమనే ఇసుక తిన్నెల్లోకి తుళ్ళింతలతో జారిపడుతూ, జీవితం నన్నెంతలా సంతోషపెట్టిందో గుర్తు చేసుకుని, మరింతగా ఆమెను ప్రేమించడానికి!
మనం కాలంతో పాటు పరుగులు తీస్తూ తీరాలను దాటుకుంటూ ఎంత ముందుకు వచ్చేసినా, తొలి అడుగులు కొన్ని ఆ ఇసుక తిన్నెల్లో గాఢ ముద్రలు వేసే తీరతాయి. వర్షం వెలసిన మర్నాడు రెమ్మ రెమ్మకీ లాల పోసే చినుకులంత స్వచ్ఛంగా మనసులో నిలిచిపోతాయ్!
మొట్టమొదటి సారి కాలేజీకి వెళ్ళడం, ఉద్యోగంలో చేరిన మొదటి రోజు, మొదటి జీతం అందుకున్న రోజు, మొదటి సారి విదేశంలో అడుగిడిన రోజు, తొలి ప్రేమ, తొలి ముద్దు..నిజానికి సౌందర్యమంతా ఆ కొత్తదనానిదేనేమో కదూ!
" I like beginnings..because they are so full of promises...
I like beginnings because i know,there is always more to come....."
ఎప్పుడో ఎక్కడో చదివి నేను దాచిపెట్టుకున్న ఈ వాక్యాలతో ఏకీభవించని వారు బహుశా ఎవ్వరూ ఉండరేమో! నచ్చినా, నచ్చకపోయినా ఆ జ్ఞాపకాలు మర్చిపోవడం మాత్రం దుర్లభమని అందరూ ఒప్పుకునే తీరాలి. అలాంటి ఒక జ్ఞాపకం గురించి...రెల్లు పూల పానుపు అకస్మాత్తుగా ప్రత్యక్షమై వెన్నెల తరకలు దానిపై పరుచుకోవడాన్నితొలిసారిగా "విన్న" రోజుల గురించి......
ఇంజనీరింగ్ ఫైనల్ సెమిస్టర్ - లైవ్ ప్రోజక్ట్ కోసం ముచ్చట పడ్డామేమో, తిరిగీ తిరిగీ కాళ్ళు పడిపోయేవి. ఇంకో పక్క పరీక్షలు గట్రా మామూలే -
ఖాళీగా కొన్నాళ్ళు ఇంట్లో ఉందామనే ఆశ కూడా మనసులోకి రానీకుండా అమ్మ చిన్నప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల, పరీక్షలైపోతున్నాయన్న సంతోషం కన్నా, ఉద్యోగం రాకపోతే నా పని గోవిందా అన్న భయమే ఎక్కువగా ఉండేది.
ఆ భయమూ, నా బద్దకమూ 24 గంటలూ చేతిలో చెయ్యేసుకుని జంటగా ఉండడం వల్ల, ఎప్పుడూ దేవుడిని బెదిరించడంతోటే నా చదువు మొదలెట్టేదాన్ని. "దేవుడా, నిన్ను నమ్మాలంటే నువ్వు నాకు నెల రోజుల్లో మంచి ఉద్యోగం ఇప్పించేయాలంతే" - ఇలాగన్నమాట! అయితే ఇలాగే గతంలో ఇంటర్లో ఒకసారి బెదిరించినప్పుడు దేవుడికి బాగ ఖోపం రావడంతో అది కాస్తా బెడిసికొట్టింది. ఈ అలకలూ అవీ మనకి బొత్తిగా అచ్చి రావన్న తెలివితేటలు నాలో కలిగి, ఇంజనీరింగ్‌లో బుద్ధిగా మొక్కుల్లోకి దిగిపోయాను.
ఫ్రెషర్స్ వరల్డ్ ను పగలూ రాత్రీ మొహమాట పడకుండా బట్టీ కొట్టి, ఏదో అదృష్టం నన్ను కౌగిలించుకోబట్టి, కాంపస్ సెలెక్షన్స్లో గట్టెక్కాను. 'హమ్మయ్యా' అనుకుంటూ హైదరాబాదు వచ్చి పడ్డాను.
కొత్త ఆఫీసు! కొత్త మనుషులు. మా కాలేజీ నుండి నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా సెలక్ట్ అయ్యారు. అందులో ఒకమ్మాయి నా ప్రాణ స్నేహితురాలు, హరిత. చదువుకునేటప్పుడు ఒకరి ఇంట్లో ఒకరం రోజుల తరబడి ఉండగలిగినంత స్నేహం కావడంతో, కలిసి వేరే ఊరు రావడం, మళ్ళీ కలిసి ఉద్యోగం చేయడం...భలే సరదాగా ఉండేది.
ఇంటి మీద బెంగా, మొట్టమొదటి సారి ఇల్లు వదిలి వచ్చాక బలవంతంగా మనకి మనమే చేసుకోవాల్సిన పనులూ పక్కన పెడితే, ఆఫీసులో మాత్రం మహా తమాషాగా ఉండేది. "ఆఫీసంటే ఇలానా ఉంటుంది?" అని ఆశ్చర్యంగా కూడా ఉండేది. ఎందుకంటే,చేరీ చేరగానే ఏదో పని చేసెయ్యాలన్న తాపత్రయం మా అందరిదీ! ఆ ఆత్రాన్ని,ఆవేశాన్ని ఎవ్వరూ పెద్దగా అర్థం చేసుకున్నట్టే కనపడేవారు కాదు. సీనియర్లెవ్వరూ మమ్మల్ని పట్టించుకోకుండా సీరియస్‌గా పని చేసుకుపోతుండేవాళ్ళు. మేనేజర్ల సంగతి సరే సరి! మా మొహం చూసిన పాపాన కూడా పోలేదా మహానుభావుడు!
ఆ తర్వాత ఒకరోజు ఆయన చావు కబురు చల్లగా చెప్పారు. మాకొక ట్రైనింగ్ ఉండబోతోందనీ..అది పూర్తయ్యేదాకా మాకు పొరపాటున కూడా పని ఇవ్వరని, మేము కొన్నాళ్ళిలా బలవంతపు "బెంచ్" పిరియడ్ అనుభవించి తీరాలనీ! నాకైతే కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువ. చచ్చీ చెడీ అన్ని రౌండ్‌లు పరీక్షలు రాసి, కాలేజీ చదువు పూర్తయ్యాక గట్టిగా నెల రోజులు కూడా ఖాళీగా గడపకుండా వస్తే, మళ్ళీ పరీక్షలనడం ఎంత ఘోరం! ఇదేం అవమానం అని కాసేపు గింజుకున్నా, గత్యంతరం లేదు కాబట్టి దానికి అలవాటు పడాలన్న నిర్ణయానికి వచ్చాం అందరం.
మా కంప్యూటర్ వాళ్ళు( నేను, హరిత, రమ్య, తపస్వి, సౌజన్య , హర్ష, సత్య, సతీష్, వంశీ ) , ఇంకా ఎలెక్ట్రానిక్స్ వాళ్ళు ( రఘుమిత్ర, సంతోష్, ఆదిత్య,రాఘవేంద్ర, రాజశేఖర్, సుబ్బు (సుబ్రహ్మణ్యం), విద్య, రోహిణి ..) దాదాపు అందరం కలిసే ఉండేవాళ్ళం.
ఆ కంపనీలో, ఎవ్వరూ అడుగు పెట్టని ప్రాంతం ఒకటి ఉండేది- అది లైబ్రరీ. ఆ లైబ్రరీకి పాపం ఒక నోరు లేని లైబ్రేరియన్. ఈ పని లేని జనాలందరికీ రోజు గడిచే మార్గం చూపించింది ఈ లైబ్రరీయే అని మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా!
మేమంతా, రెండున్నర దాకా ..అంటే, కేటరర్స్ గిన్నెలు సర్దుకుని వెళ్ళిపోయే దాకా డైనింగ్ హాల్లో కూర్చుని, ఏదో ఒకరకంగా కాలక్షేపం చేసి మరో రెండు నిముషాల్లో మమ్మల్ని తరిమే వారెవరైనా వస్తారు అనిపించగానే, ఆ లైబ్రరీకి వెళ్ళిపోయే వాళ్ళం.
సరే, రొటీన్ ఆటలు బాగా బోరు కొట్టేస్తున్నాయని, ఒక రోజు పాటలు పాడాలని నిర్ణయించుకున్నాం.
కొందరు అహింసావాదులు తమ గాన కళా చాతుర్యంతో జనాలను చంపడం ఇష్టం లేక, 'మేము పాడలేము' అంటూ మర్యాదగా పక్కకి తప్పేసుకున్నారు. పాడాలనీ..పాడకూడదనీ సంశయంతో మగ్గిపోయే మా హరిత లాంటి వాళ్ళేమో, 'అసలైతే నేను పాడతాను..కాని..ఇప్పుడు...ఉహు..ఇంత మందిలో..నో నో..' అంటూ హడావుడి చేసారు :). యధావిధిగా హరిత సంగతి తెలీని మిగిలిన వాళ్ళు బతిమాలుకున్నాక, "జస్ట్ హమ్ చేస్తానంతే!" అని చెప్పి ఏదో పాడేసింది. ఆ పాట కనిపెట్టే ప్రయత్నాల్లో మిగిలిన వాళ్ళు ఉండగానే, "వెయిట్" చెయ్యడం అస్సలు ఇష్టం లేని , సుబ్రహ్మణ్యం తన పాట మొదలెట్టేసాడు...'మాయదారి మైసమ్మో ..మైసమ్మా...'అని (అది కూడా డప్పు కొట్టుకుంటూ..). మేము అందరూ ముందు ఉలిక్కిపడి, ఆ తర్వాత ఆ లైబ్రరియన్ ఎక్కడ పరుగెత్తుకు వస్తాడో అని చచ్చేట్టూ టెన్షన్ పడి, ఆ ఫ్లోని కంట్రోల్ చేసే వృధా ప్రయత్నాలేవో చేసాం. ఈ సుబ్రహ్మణ్యం ఆ తర్వాత జి. స.రి.గ.మ లాంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాడుతున్నాడు. రేడియో మిర్చి వాళ్ళు నిర్వహించిన మరో కార్యక్రమంలో కూడా హుషారు పాటలతో హోరెత్తించాడు.
నన్ను ఎవ్వరూ పాడమనకపోయినా, నేను ఏ మాత్రం నిరాశ చెందకుండా, హరిత, సుబ్బు పాడగా నాకేంటన్న ధైర్యంతో, ఎవ్వరికీ తెలీని, ఆడియో తప్ప సినిమా విడుదల కాని ఒక దేవా సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట పాడాను.
ఇక మిగిలింది మా రఘు మిత్ర. అందరినీ బాధ పెట్టకుండా ఏడిపించడం లో అతను ముందుండేవాడు. అతను పాడతాను అనగానే మేము కూడా పోటా పోటీగా ఏదో ఒకటి వెక్కిరించడానికి వంక దొరుకుతుందనే ఆశతో హుషారుగా ముందుకొచ్చాం. ఉన్నట్టుండి, పాట మొదలెట్టాడు..." రెల్లు పూల పానుపు పైన.." అంటూ.. నిజంగానే నేను ఆశ్చర్యపోయాను..ఆ రెల్లుపూల వానలో తడిసిపోయాను. పాటలంటే సినిమా పాటలే అని ఊహించుకునే అజ్ఞానం నాదప్పట్లో.
"ఏ సినిమాలోది ఈ పాట" ఆ అబ్బాయి పాట పాడడం అయిపోగానే చప్పట్లు కొడుతూ అడిగాను.
'లలిత గీతం మానసా.., సినిమా పాట కాదు" నవ్వుతూ చెప్పాడు ఆ అబ్బాయి.
ఆ తర్వత "టీ" టైం అవ్వడంతో, మేము అందరం ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేసాం.
ఆ పాట మాత్రం చాల కాలం నన్ను వెన్నాడింది..అంత హాయి గొలిపే పాటలను అంత సామాన్యంగా మర్చిపోలేం. అనుకోకుండా నేను ఇంకో మంచి ఆఫర్ రావడంతో, ఆ కంపెనీని వదిలేసి వచ్చేసాను.
మొన్నా మధ్య అక్క హైదరాబాదు వచ్చినప్పుడు, కోటి విశాలాంధ్రలో ఏవో పుస్తకాలు కొనాలని నన్ను కూడా తీసుకెళ్ళింది. అక్కడ పుస్తకాలు తిరగేస్తుంటే, కృష్ణ శాస్త్రి సాహిత్యం- 4 కనపడింది. రాత్రి అక్క పిల్లలు కరుణించి నిద్రపోయాక - పరాగ్గా ఈ పుస్తకం పట్టుకుని పేజీలు తిప్పుతుంటే, "రెల్లు పూల పానుపు.." కనపడింది. మళ్లీ అదే వాన... రెల్లు పూల పానుపు పైన వెన్నెల వాన. ఇది కృష్ణశాస్త్రి గారు కురిపించిన జల్లు అని తెలిసి పట్టరాని ఆనందం కలిగింది. ( మరి అప్పటి దాకా నాకు ఆ ముక్క తెలీదు కదా..)
పాట సాహిత్యం ఇదీ :
" రెల్లు పూల పానుపు పైనా
జల్లు జల్లులుగా - ఎవరో
చల్లినా రమ్మా! వెన్నెల చల్లినా రమ్మా!
కరిగే పాల కడవల పైన
నురుగు నురుగులుగా -
మరిగే రాధా మనసూ పైన
తరకా తరకలుగా - ఎవరో
పరచీనారమ్మ! వెన్నెల పరచీనా రమ్మా!
కడిమి తోపుల నడిమి బారుల
ఇసుక బైళుల మిసిమి దారుల
రాసీ రాసులుగా - ఎవరో
పోసీనా రమ్మా - వెన్నెల పోసీనా రమ్మ! "
పాట నెట్లో దొరుకుందేమో నాకు తెలీదు. ఒక వేళ ఉన్నా మొదటి సారి కలిగినంత ఆనందం కలుగుతుందో లేదో అసలే తెలీదు. నాకు ఆ జ్ఞాపకాలే మధురాతి మధురం! కేవలం అదొక్కటే కాదు,
జీవితంలో ప్రతి క్షణాన్నీ, దానిలోని కొత్తదన్నాన్నీ ఆస్వాదించే ప్రయత్నం చేస్తే, ప్రతి అనుభవాన్ని భద్రంగా దాచుకోవాలనిపించేంత గొప్పగా మలచుకోగలిగితే, సంతోషం తప్పకుండా మనని వెదుక్కుంటూ వస్తుంది. ఆపై చిరునవ్వులన్నీ విడిచి పోనని మారాం చేసే చంటి పాపలై మనని చుట్టుకుపోతాయి.
Really, the secret is as simple as this -
"Joy is what happens to us when we allow ourselves to recognize how good things really are!"