రహస్యముగా....


మొండితనం మన ప్రమేయం లేకుండా మాటలతో కలబడితే
అల్లరి అలక హద్దులు చెరుపుకు కోపపు ముసుగుల జొరబడితే
రాతిరంతా తలలొంచిన నక్షత్రాల మౌనపు గుసగుసలే తప్ప
మనసులు ఊసులాడుకోవని - అప్పుడు ఊపిరాడదనీ తెలీదు.

కంటికి కనపడని గోడలేవో అడుగడుక్కీ అడ్డు పడుతున్నప్పుడు
తప్పొప్పుల తక్కెడ ముద్దాయిని చేసి తల దించమన్నప్పుడు
చుబుకాన్నెత్తి నుదిటిని తడిమిన నీ వెచ్చటి చేతి స్పర్శలో
అనురాగమొకింత తగ్గినట్లుండడం భ్రమేనేమో తెలీదు

కలవరం సద్దుమణిగి - కంటి ఎరుపులోని కోపాలు కరిగి
తపించే వెర్రి హృదయపు బెంగ బాధగా భారంగా మారినపుడు..
నవ్వులు పూయని శూన్యంలో..వెలుతురు సోకని లోకంలో
మళ్ళీ నిను చేరేందుకు నిరీక్షించాలో అన్వేషించాలో తెలీదు.


అదృష్టం వరమిచ్చి ఏ గుమ్మంలోనో ఎదురెదురు నిల్చినపుడు
విచ్చీ విచ్చని  పెదవుల కళ్ళూ కన్నుల పెదవులూ
అహాలనూ అపోహలనూ కరిగించే అమృతవర్షమే కురిపించినపుడు


నే మునివేళ్ళపై నిలబడేదెందుకో నీ పెదవులకు తెలుసు.
సిగ్గిలి జాబిలి మబ్బుల దాగుతుందని చీకటి రాతిరికీ తెలుసు.

రేయంతా సాగిన రహస్యపు జాగారాల్లో పరవశించిన క్షణాల్లో
కిటికి పక్క పారిజాత వృక్షం మౌనంగా పూలు రాల్చేస్తుందని తెల్సు
దోసిలి ఒగ్గి అవన్నీఅపురూపంగా అందుకోవాలని అవనికీ తెలుసు!

తెలుగు పాటలకు పట్టు పరికిణీలు

మలి ప్రచురణలు : నమస్తే ఆంధ్రా జనవరి 2012 సంచికలోనూ, జంధ్యావందనంలోనూ..


కొబ్బరి నీళ్ళ జలకాలాడినంత హాయిగా
లిపి లేని కంటి భాషలేవో చదివి వివరించినట్టుగా.....
లేత చలిగాలులేవో చక్కిలిగింతలు పెడుతున్నట్టుగా
సరిగమపదని స్వరధారలో తడిసిపోతునట్టుగా.......

పై వాక్యాలు చదువుతుంటే, మనసులో ఏవో స్పష్టాస్పష్ట జ్ఞాపకాలు మెదులుతున్నాయా? స్వప్న రాదారుల్లోకి పగలల్లా అలసిన మనసు పయనం మొదలెట్టబోయే క్షణాల్లో మీ చెవి పక్క రేడియో రహస్యంగా వినిపించిన రాగాలేమైనా గుర్తొస్తున్నాయా? నిజమే! ఇవన్నీ ఆ మళ్ళీ రాని, మదినొదిలి పోని రోజుల మధుర జ్ఞాపకాలే! అంతే కాదు,  ఆ అనుభూతులన్నింటి వెనుక, ఒకటే పాటల తోటలో పుట్టిన జట్టు చేసిన అద్వితీయమయిన కృషి, అన్యులకు సాధ్యం కానిదనిపించేంత చాకచక్యం చెలిమి చేసి ఉన్నాయి.

ఈ సరికే మీలో కొందరు సినీ అభిమానులకు ఇవి ఏ దర్శకుడి వరదానాలో అర్థమైపోయి ఉంటుంది .  సినీ గేయ రచయితలంటే అపార గౌరవం ఉండి, మనం ఒక పాటను తల్చుకున్న ప్రతి సారీ, సదరు రచయితనూ స్మరించి తీరాల్సిందేనన్న సూత్రాన్ని బజ్‌లో మనందరికీ పంచిన సాహితీ మిత్రులు భాస్కర్ వంటి వారికి మాత్రం, వేటూరి కలం కనపడి ఉంటుంది. దశాబ్దాల పాటు తెలుగు సినీ సంగీతానికి వన్నెలద్దిన ఒక అపురూప, అమృత గళం .. - బాలూ గుర్తొస్తున్నాడంటే..ఆశ్చర్యమొకింతైనా లేదు నాకు!

అందరి సంగతి తెలీదు కానీ, నా వరకూ - ఒక్కో పాట, జీవితంలోని ఒక సందర్భంతోనో, ఒక మనిషితోనో, అనుభవంతోనో ముడిపడిపోయి, మమేకమైపోయి, ఎన్నేళ్ళ తర్వాత విన్నా, తిరిగి తీసుకు వెళ్ళి ఆ గతపు వాకిలి ముందే నిలబెడుతుంది. మస్తిష్కంలో మూలకు ఒదిగి మరుగునపడ్డాయనుకున్న ఆనాటి తీపి తలపులు, మర్చిపోయామనుకున్న జ్ఞాపకాలు ..చిమ్మ చీకటి ఆవరణలో వెలిగిన ప్రమిద చుట్టూ పరుచుకునే వెలుగులా, మళ్ళీ ఒక్కసారిగా  చుట్టుకుపోతాయి.

నా ఒరియా రూమ్మేట్, ఉత్కళిక, శనాదివారాల్లో పొద్దున్నే హాల్‌లో లాప్పీ బేబీని పెట్టుకుని గజల్స్ వినేది. ఫ్లాట్‌లో ఇద్దరమే ఉండేవాళ్ళం కాబట్టి, నేనూ నా రూం నుండి బయటకు వచ్చి, నచ్చకపోయినా సరే, సుప్రభాతం విన్నంత శ్రద్ధగా "గం కా ఖజానా తేరాభీ హైన్, మేరా భీ.." , "ఆజ్ జానే కీ జిద్ నా కరో.." అన్న పాటలు ఆమె పుణ్యమా అని కొన్ని నెలల పాటు విని ఉంటాను. ఇది జరిగి మూడేళ్ళు దాటిపోతున్నా, ఆ పాటలెక్కడైనా వినపడితే, వెనువెంటనే ఆ అమ్మాయి గుర్తొస్తుంది. అప్పుడే శనివారం వచ్చేసిందా అనిపిస్తుంది. లేదా ఆదివారపు ఉదయం ఆడవాళ్లలో సహజంగా కలిగే అందమైన బద్ధకం కమ్ముకుంటుంది. పాటైపోయాక నిరాశలూ, నిట్టూర్పులూ పరుగులూ మామూలే! 

చలం - అమీనా


చలం రచనలు ఇన్నాళ్ళూ నేనెందుకు చదవలేదో, ఇంతకు ముందొక సారి ఇక్కడ రాసి ఉన్నాను. అలాగే, ఒక పాఠకురాలిగా నా పరిథిని పెంచుకోవడానికి ఇప్పుడొక్కొక్కటీ తీసి చదువుతున్నానని, ఈ బ్లాగ్ అడపా దడపా చూసే వారికి అర్థమైపోయి ఉంటుంది. ఇటీవలే నేను చదివిన మరో చలం కవిత్వం - "అమీనా". అమీనా నిజానికి ఒక నవల. కాకపోతే, అడుగడుగునా, అక్షరమక్షరానా, చలం హృదయం నుండి కాగితాల్లోకి నేరుగా సిరాగా పాకిన కవిత్వాన్ని చూపించే నవల.

చలం రచనలెటువంటివైనా, వాటిలోని తీవ్రతను మాత్రం అందరూ ఒప్పుకునే తీరాలి. అతని భావాలను, బాధలను, గుండెల్లోని అలజడినీ, ఆ మర్యాదపు ముసుగుల్లో మనిషి పడే సంఘర్షణనీ, చలాన్ని చదివే వాళ్ళు తప్పించుకుందామనుకుంటే, సాధ్యపడదు.
లాగేస్తాడు..లోపల్లోపలికి...అతని అక్షరాల్లోకి.
ఆహ్వానిస్తాడు..చేతులు విశాలంగా చాచి అతని అంతరంగపు లోతుల్లోకి. 

ఒక తొంభైఆరు పేజీల నవల, తొంభై నిముషాల లోపే పూర్తి చేసెయ్యడానికి అనువుగా ఉండే నవల, మనకి మునుపెన్నడూ పరిచయం లేని ఒక ముసల్‌మాన్ బాలిక పట్ల ఎంత అనురాగాన్ని, జాలినీ,  ఆత్మీయ అనుబంధాన్ని పెంచగలదో తెలుసుకోవాలంటే "అమీనా" చదవాలి. అమీనా ప్రారంభమే ఒక అద్భుతం. "ముందుమాట" నుండే మనం చదవడం మొదలెట్టాలి. రచనను అనుభవించడాన్ని, ఇక్కడి నుండే అలవాటు చేసుకోవాలి. 

"ఏళ్ళల్లో ఒదిగి
వాకిట్లో నుంచుని, ఒచ్చానంటే,
చిన్నప్పటి నీ ఒంటి బురదని 
కావలించుకున్నా,
పెద్దైన నీ మనసు మీద                                                     
లోకం చిమ్మిన మాలిన్యాన్ని అంగీకరించలేని
చలం
అవమానానికీ
లోకపరత్వానికీ
పరిహారంగా
నీకు, అమీనా ఈ పుస్తకం."

అహోబిలం-యాత్రా విశేషాలు

"కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? "

అంటూ "ఎందెందు వెదకి చూసిన అందందె కలడు విష్ణువ"ని అచంచల విశ్వాసంతో పలికిన అచ్యుతపద శరణాగతుడైన ప్రహ్లాదుని వాక్కును సత్యం చేసేందుకు స్థంభం నుండి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నరహరిగా ఉద్భవించిన మహోత్కృష్ట ప్రదేశం "అహోబిలం".

విచ్చుకున్న తామరలతో శోభిల్లే కొలనులు, సూరీడు తొంగి చూసేందుకు కాస్తంతైనా అనుమతివ్వని అమలిన అడవి అందాలు, నున్నటి గులకరాళ్ళ మీద జారిపోయే అడుగులతో ప్రయాణాలు, దారంతా వినిపించే జలపాతాల గుసగుసలు, భవనాశిని జల్లుల్లో చలిగిలిగింతలు, మరెక్కడా కనపడని కొన్ని వింత పూవులు, లతలు, దూరంగా ఎక్కడి నుండో వినిపించే హరి నామ స్మరణలు, ఎటుపక్కకు చూసినా కనువిందు చేసే లేత ఆకుపచ్చ రంగులు, వాటి చుట్టూరా రెక్కలు విదుల్చుకుంటూ తిరిగే రంగురంగుల సీతాకోకచిలుకలు, శ్రావణ భాద్రపదాల్లో విరివిగా కురిసిన వర్షాలకు పూచిన కొండమల్లెలు పంచే పరిమళాలు, ఎత్తైన పర్వత శిఖర అంచుల మీద, కలవరపెట్టేంత లోతైన లోయను కళ్ళు విప్పార్చుకుంటూ చూస్తుంటే సొంతమయ్యే అనుభవాలు, అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగు జారితే స్వర్గమే నన్న అపరిచితుల మాటలకు అప్రయత్నంగానే నవ్వులతో బదులిస్తూ సాగే నడకలు, అన్నింటి కంటే ముఖ్యంగా, మనస్సు అనుక్షణం ఆశపడే అద్భుతమైన మౌన ప్రపంచం.........- - స్వర్గలోకాల దారులను వర్ణిస్తున్నా అనుకుంటున్నారా...ఊహూ..అహోబిలం ప్రకృతి సౌందర్యాన్ని నా కళ్ళతో మీకూ చూపిస్తున్నానంతే!


ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కవిత్వం - "అనుభూతి గీతాలు"


"కలలు పండే వేళ,
మౌనపుటలల మీదుగా
గతాన్నీ, భవిష్యత్తునూ
కలిపే స్వప్న సేతువు
ఏకాంతం -"             అంటూ అందమైన భావాలతో సాగిపోయే కవితా సంకలనం "అనుభూతి గీతాలు"గా కాక మరింకెలా మన ముందుకొస్తుంది ?

ఇది సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి రచన. కవి పండిత కుటుంబంలో, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి తనయులుగా జన్మించిన వీరు, దాదాపు అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించినట్టే కనపడతారు. అపురూపమైన భావావేశం వీరి సొంతం. ఆవేశాన్నైనా, ఆవేదననైనా అక్షరాల్లో లయబద్దంగా అమర్చగల్గడం, పాఠకుల మనసులతో పాటు, మెదళ్ళనీ రచనల ద్వారా కదిలించగలగడం వీరి ప్రత్యేకతలు.

నాకు మొదటి నుండి కవిత్వం పైన తగని మక్కువ. వచనమంటే లేదని కాదు. కానీ, కవిత్వంలో ఉన్నదేదో అందులో కనపడదు. పైకి సరళంగా, సంఘర్షణలేమీ లేని సరస్సులా కనిపించినా, సముద్రమంత లోతైన భావాన్ని కలిగి ఉండి, తేలిగ్గా అర్థం కాకుండా తరచి చూసిన కొద్దీ, కొద్ది కొద్దిగా అందాన్ని విప్పార్చి చూపే కవిత్వాన్ని నేను మొదటి నుండి ప్రత్యేకంగా చూసేదాన్ని. అక్షరాలలో అంతర్లీనంగా దాగి ఉండే అర్థాలను, పంక్తుల మధ్య నుండే ఖాళీలో ఒదిగీ దాగీ కవ్వించే అందాలను దొరకబుచ్చుకోవాలనుకునే నా తపనే, ఇలా కవితా సంకలనాల వెనుక పడేందుకు ప్రోత్సాహం ఇస్తుంది.

"ఊర్మిళను విడిచిన మర్నాడు " అని శర్మ గారు రాసిన కవిత ఒకటి చదివాను.
"నిన్ను విడిచి వచ్చాక గాని
నీ స్వప్నచ్ఛాయలింత బలమైనవని నాకు తెలియదు
నా మెడ చుట్టూ చేతులు వేసి
నిశ్చింతగా పడుకున్న నిన్నటి నీ స్పర్శ
ఇంతగా నా ఉనికిని నీలోకి లాగేసుకుందని
నాకు తెలియదు"

మురళీ ప్రణయగాథ

"ముర్లీ, ప్లీజ్! నన్ను అర్థం చేసుకో; ఐ రియల్లీ లవ్ యు."

చెవులు మూసేసుకున్నాడు మురళి.

"కనీసం నా మాట వినడం కూడా ఇష్టం లేదా నీకు?" రోషంతో అడిగింది రమ్య.

" నా పేరును చంపేస్తుంటే చెవులప్పగించుకుని వినడం నా వల్ల కాదు"

" హబ్బా!!!! నాకు కొన్ని పదాలు పలకవు, అది కూడా పెద్ద నేరమేనా, అసలు ఆ వంక పెట్టుకుని పెల్లే వద్దనడం ...ఇట్ ఈజ్ జస్ట్ నాట్ ఫెయిర్"

"రమ్యా, ప్లీజ్, నువ్వు "పెల్లి" "మురలి" అనడం మాకపోతే - మన పెళ్ళి సంగతి వదిలెయ్, నీతో మాట్లాడటం కూడా మానేద్దామనుకుంటున్నాను.

" అంటే నాలుగేళ్ళ పరిచయం, కలిసి తిరగడం, అన్నీ మర్చిపోదామా?"

" ఊ..."

"ఏమైంది నీకు, ఇంత మొండిగా తయారయ్యావు, నీకు తెల్సు కదా, నేను చదువు కోసం ఇక్కడికి వచ్చిన దాన్ని. వచ్చి దాదాపు సెవన్ యియర్స్ అవుతోంది. నేను మాట్లాడేది వాల్లకి అర్థం అవ్వాలి అంటే, మాట తీరు దానంతట అదే మారిపోతుంది. దానికి నేనేం చెయ్యను? "

"ప్రయత్నం."

" కమాన్!!"

" రమ్యా, నేను ఇక్కడికి వచ్చిన నాలుగేళ్ళలోనూ, కనీసం నా పేరైనా సరిగ్గా పిలవమని నిన్ను ఎన్నో సార్లు అడిగాను. నువ్వు వినలేదు. మాటకి ముందో సారి 'హనీ ' వెనకోసారి 'హనీ'. నువ్వు ప్రయత్నం చేసిందెప్పుడసలు? మొన్న సెమినార్‌కి స్టాంఫోర్డ్ వెళ్ళి, అక్కడి నుండి కృష్ణ శాస్త్రి విరహ గీతం తెలుగులో టైప్ చేసి పంపిస్తే, వెంటనే కాల్ చేసి, అర్థం ఏమిటో చెప్పమన్నావ్! "

"అఫ్కోర్స్! నాకు మరి అర్థం కాలేదు"

"కాస్తందుకో, దరఖాస్తందుకో...ప్రేమ దరఖాస్తందుకో; ముద్దులతోనే ముద్దరలేసే...- అని ఆ రోజు నేను కూని రాగాలు తీసినప్పుడు ఏం చేసావు?"

జీవన వసంతం

**********************

ఉత్సాహమో విజయ కాంక్షో
సగం దూరం నడక సాగాక
అలసటో అపజయమో
అడుగు పడక నిలిచిపోయాక...

కనురెప్పల కొసల కాచుకున్న
కోటి కలల కవ్వింపులకు
నడి రాతిరి నిదుర కాస్తా చెదిరిపోయిందా..
నిజమవ్వాల్సిన స్వప్నాలకై ఆపలేని ఆరాటమిక!


రేయంచుకు ఊగిసలాడుతున్న
రేపటిని ఆశగా ఆర్తిగా స్మరిస్తూ
మరోసారి అడుగు ముందుకు పడిందా
విజయలక్ష్మి కౌగిళ్ళలో ఊపిరాడని బంధమిక!


ఆ అడుగులేయించగల తోడూ
ఆ కలను పరిచయం చేసేవాడూ
నిన్ను నీవు జయించిన అమృత క్షణాన
తెరలన్నీ తప్పించుకు తారసపడినప్పుడు

పండుటాకులు రాలినా..తృణపత్రాలను తుంపినా
ఒక్క గొడ్డలి వేటుతో నిలువెల్లా నరికినా
వడగాలులు వీచినా ..ఉప్పెనలు ముంచినా
అభివృద్ది పేరిట అడవంతా కొట్టేసినా..

కూలిన చెట్లన్నీ..వడలిన ఆకులూ పూలన్నీ
ఆశలన్నీ కూర్చుకు చిగుర్లు తొడగడంలోనూ
రెమ్మ రెమ్మా కలసి కొమ్మల దాగడంలోనూ
మళ్ళీ వసంతాలను విరబూయడంలోనూ...

అంతర్లీనంగా దాగున్న రహస్యమేదో ద్యోతకమవుతుంది...
మందకొడిగా సాగే కొన్ని మానవ జీవితాలకదే చెట్టంత బలాన్నిస్తుంది!



************************
*తొలి ప్రచురణ హంసిని అంతర్జాల పత్రికలో.

క్రియేటివ్ ఆటలు-కొన్ని కులాసా కబుర్లు

ఇది నేను పూనె(హం, తుం, ఆప్, ఘర్, పానీ లాంటి పదాలు బట్టి కొట్టి పదో తరగతి హింది పరీక్ష గట్టెక్కిన నా లాంటి వాళ్ళకి కూడా, తమకు తెలీకుండానే పదాలన్నీ కలుపుకుంటూ వాక్యాలను నిర్మించగలిన శక్తిని, ఆ మహా నగరం మాత్రమే ప్రసాదించగలదు.)లో ఉండగా జరిగిన సంఘటన.  నేను ఆఫీసులో రిపోర్ట్ చేసిన మూడో రోజో, నాలుగో రోజో, మా బేచ్ అందరికీ హెచ్.ఆర్ మేనేజర్‌తో మీటింగ్ ఉంటుందని పిలుపొచ్చింది. యే గది, ఎన్నింటి నుండి ఎన్నింటి వరకూ తదితరాలతో కూడిన ఆ నాటి సమావేశం తాలూకు వివరాలన్నింటితో వెను వెంటనే మరో మెయిల్. 

నేను ఇలాంటప్పుడే నా తెలివితేటలను విచ్చలవిడిగా వాడేసుకుంటాను.  ఆ మీటింగ్ రూం దాకా వెళ్లాక, ముందు వరుసల్లో మొత్తం ఖాళీగా ఉన్న కుర్చీలను చూస్తూ నా స్నేహితులు అటు వైపు అడుగులు వేయబోతుంటే, వాళ్ళ చేతులు పట్టి ఆపి, అక్కడికి నేనేదో పది సంస్థల్లో ఇలాంటివి చూసేసినట్టు, "కాస్త వెనుక కూర్చుంటే నచ్చకపోతే నిద్రపోయే అవకాశమైనా ఉంటుంది. హెచ్.ఆర్ వాళ్ళ మాటలంటే కంపనీ గురించి డబ్బా తప్ప ఇంకేమీ ఉండదు" అని సెలవిచ్చాను. శ్రీ కృష్ణుడిని నమ్ముకున్న పార్థుడంత భక్తిగా, ఆరాధనగా వాళ్ళు నా వంక చూసి, వెనుకే వెనుక వరసలకు దారి కట్టారు. వాళ్ళల్లో ఒకరు చిట్ట చివరి వరుస, చిట్ట చివరి కుర్చీ ఏరుకుని కూర్చోబోతుంటే మందలించాను. "ఒక వరుస విధిగా వదిలెయ్యాలి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే! మరీ ఆఖరుకు చేరితే ప్రమాదం, ఏ ప్రశ్నలు అడగాలన్నా ముందు వాళ్ళే కనపడతారు. అదీ గాకా పూర్తి మొద్దులమేమో అని పొరబడే అవకాశమూ లేకపోలేదు." - ఇలా చెప్పడంలో నా ఇంజనీరింగ్ నాటి అనుభవాలు కొన్ని పనికొచ్చినట్టున్నాయ్.

మరో పది నిముషాల్లో మొత్తానికి ఆ గదంతా మనుషులతో నిండిపోయింది. రావలసిన మేనేజర్‌గారు రానే వచ్చారు. అభినందనలతో మొదలెడుతూ, ఆ ఆఖరు వరసల్లో వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుందని సలహా విసిరేసారు. మేం చెవిటి అవతారాలెత్తి, కదలకుండా కూర్చుండిపోయాం. మా వెనుక వరసకి మాత్రం తప్పలేదు. ఆవిడ కళ్ళార్పకుండా చూస్తూ ఉండటంతో, విధి లేని పరిస్థితుల్లో మొదటి వరసకు వెళ్ళి కూర్చున్నారు. నేను నా స్నేహితుల వైపు గర్వంగా చూశానొకసారి. ఆ క్షణంలో వాళ్ళు కూడా నా మేధస్సును, ముందుచూపును అభినందించినట్టుగానే కనపడ్డారు.

హెచ్.ఆర్ మేనేజర్ ఆఖరి అవకాశం అన్నట్టు మా వరుస వైపు చూస్తూ, "మీలో ఎవరైనా ముందుకు రాదల్చుకుంటే ఇప్పుడే రండి. మొదలెట్టాక, అటూ ఇటూ తిరగడం అంటే నేను ఇష్టపడను" అని పునరుద్ఘాటించారు. మేమొక మొహమటపు "పర్లేద"న్న దరహాసం బదులిసిరేశాం!

సరీగ్గా నేను ఊహించినట్టుగానే, ఆవిడ అసలు ఈ సంస్థ ఈ దశకు రావడం ఎంత పెద్ద విషయమో, మమ్మల్ని, అంటే, ఇంత సరైన మేధా సంపత్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఎన్ని ప్రణాళికలను వేసిందీ, ఆ అంచనాలను నిలబెట్టేందుకు మేవేమేం చేయాలీ..ఇటువంటివేవో చెప్పుకుంటూ పోతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు, లెక్కలు వగైరా పి.పి.టి లలో చూపించే ముందు కాసేపు మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం అంటూ ఆగారు.
వెనక్కి నక్కిన మేమంతా ఆవలింతల్లోకి దిగిపోయాం ఆపాటికే!

ఆవిడ పరిచయాల పద్ధతి ఎలా ఉండాలో వివరిస్తాను అని మొదలెట్టారు. "ప్రతి ఒక్కరూ, వాళ్ళ పేరు పక్కన, వాళ్ళకి నప్పే విశేషణమేదో ఒకటి చేర్చుకుని చెప్పాలి. ఆ విశేషణం, మీ పేరులోని మొదటి అక్షరంతో మొదలవ్వాలి. ఉదాహరణకు, మీ పేరు శ్రేయ అనుకోండి - మీరు "ఎస్"తో ఒక విశేషణం చెప్పాలి. సింపుల్ అనో, స్వీట్ అనో!
మరొక్క వాక్యం ఏదైనా వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. అది తప్పనిసరి మాత్రం కాదు". నాకీ ఆట వినగానే నచ్చేసింది. ఈ సారి మా కజిన్స్ పెళ్ళిలో పనికిరాని ఆటలు చెప్పమని పెద్దవాళ్ళు పోరినప్పుడు, ఇది నేనే కనిపెట్టినంత ధీమాగా చెప్పేసి, మార్కులు కొట్టేసి.....
నా ఆలోచనలకు అంతరాయం కల్గిస్తూ, ఆవిడ మళ్ళీ అందుకుంది..." ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే, ప్రతి వాళ్ళూ తమ పేరు చెప్పబోయే ముందు, అందాకా పూర్తైన పేర్ల పరిచయాలు చెప్పి కొనసాగించాలి"
నాకు గుండెకాయ ఆగిపోయింది. ఠపీమని ఒకసారి వెనక్కు తిరిగి చూసుకున్నాను. ఖాళీ వరుసలు నా తెలివితేటలను వెక్కిరిస్తూ కనపడ్డాయి. నా స్నేహితుల చూపులను, వాళ్ళు పెదవి విప్పకుండానే నాదాకా పంపిన పొగడ్తల పొగడ మాలల పరిమళాలను నేను మీకు ప్రత్యేకంగా వివరించనక్కర్లేదనుకుంటాను.

ముందుకు బలవతంగా తీసుకెళ్ళిన వాళ్ళ ముఖాల్లో సంబరం చూడాలసలు! హబ్బ! కోటి చిచ్చుబుడ్లు ఒక్క మాటున వెలిగాయన్నా పోలిక సరిపోదు. అసలైనా ఆ మేనేజర్ చూడ్డానికి చిన్నగానే ఉంది మరి, అంత చాదస్తం ఏమిటో!
ఈ ముందు వాళ్ళ పేర్లు చెప్పుకోవడమేమిటో విచిత్రంగా, ఇదేమన్నా శివ ధనుర్భంగ ఘట్టమా, మనమేమైనా స్వయంవరానికి వెళ్ళామా..." అవ్యక్త రూపం నుండి బ్రహ్మ ఉద్భవించినది మొదలు ,మరీచి, కాస్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకువు, కుక్షి, వికుక్షి, భానుడు, అరరణ్యుడు, పృథువు, త్రిశంకువు, దుందుమారుడు, ధాత, సుసంధి, ధ్రువసంధి-ప్రసేనజిత్, భరతుడు, అసితుడు, అల్లదిగో సగరుడు, అతనికి అసమంజసుడు, వారి పుత్రుడూ అంశుమంతుడు, ఆ తర్వతా దిలీపుడు, అప్పుడొచాడయ్యా అపర భగీరధుడు..కపుచ్హుడు, రఘువు, కల్మషపాదుడు, శంఖనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు , మరువు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, అజుడు, దశరథుడు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.. ......" అంటూ చరిత్ర మొత్తం తవ్వుకుంటూ వెళ్ళడానికి ?

అదీ గాక, నాకింకో గండం కూడా ఉంది. అకస్మాత్తు ప్రశ్నలకి నా మెదడెప్పుడూ జవాబివ్వలేదు! పాపం అది దాని బలహీనతగా ఒప్పుకోవాలి మనం! ఇది నాకు చిన్నప్పటి నుండీ ఉన్న సమస్య.

ఏదో నాకు లెక్కలు బాగా నేర్పిద్దామని మా నాన్నగారు, పదిహేడో ఎక్కం దాకా వచ్చాక, కింద నుండి పైకి చెప్పడం అలవాటు కావాలని, ఎక్కడ ఏది అడిగినా చెప్పేంత పట్టు రావాలని సవా లక్ష ఆంక్షలతో (ఆశలతో), నేను వేరే ఏదో పనిలో ఉన్నప్పుడు, " ఏదీ, పదిహేడు పదమూళ్ళెంత?" అన్నారనుకోండి, నేను షాక్ కొట్టిన దానిలా అయిపోయేదాన్ని. ఉన్నట్టుండి తెలుగు భాష నాకు అర్థం కానిదైపోయేది. అకస్మాత్తుగా అల్జీమర్స్ వ్యాధి బారిన పడిన అభాగ్యురాలిలా అల్లాడిపోయేదాన్ని.

"నాన్నగారూ, ఏమన్నారూ? పదిహేడో ఎక్కమా?"
"ఊ, ఇంత సేపెందుకూ దీనికి?"
" అంటే, ఏమడిగారూ, పదిహేడు పదమూళ్ళా?" - వెధవ లెక్కలు మనసులో కట్టుకుంటూ, లెక్కలు కనిపెట్టిన వాళ్ళను తిట్టుకుంటూ..
"అవునంటుంటే!!"
" అంటే..పదమూడు పదిహేళ్ళు"
" !! "
< నా నుండి జవాబు, ఎట్టకేలకు >.
<అది సరిపోతే నేను బతికిపోయినట్టు, సరిపోకపోతే ఏమయ్యేది అనా మీ ప్రశ్న - ప్రియమైన పాఠకులారా, మీ ఊహా శక్తికి పదును పెట్టి కథలల్లుకోండి ఏం జరిగి ఉంటుందో..>

అచ్చం ఇలాగే, పూనే లో కూడా నాకు మేనేజర్ మొదలెట్టిన క్రియేటివ్ ఆటలో, నా పేరుకి ముందు ఏ విశేషణం జోడించాలో తోచలేదు. ఆలోచించుకునే వ్యవధీ లేదు, ఎందుకంటే, ముందున్న ముప్పై ఎనిమిది మంది పేర్లు గుర్తుంచుకుని అప్పజెప్పాలి కదా, ఏమాటకామాటే, జ్ఞాపకశక్తి లేదు అనిపించుకోవడం అంటే అవమానం కిందే లెక్క.

నా కన్న ముందు 'ఎం' అన్న అక్షరంతో పేర్లున్న వాళ్లల్లో ఒకబ్బాయి కూడా నా బాపతేనేమో, దిక్కు తోచని దయనీయ స్థితిలో "మైండ్‌లెస్స్" అని చేర్చుకున్నాడు. నా బాధ పదింతలైంది. ఇహ నాకు తోస్తున్న విశేషణాలన్నీ, సామాన్యులు ఊహించదగినవి, ఉచ్ఛరించదగినవీ కావు. దాదాపు అందరూ బానే గుర్తు పెట్టేసుకుని తిరిగి చెప్తున్నారు పేర్లని. ఒకబ్బాయి పేరు శైలేష్. బాగా ఘనంగా ఉండాలని, "స్టుపెండస్ శైలేష్" అని చెప్పుకున్నాడు. సుమారు పది మంది దాకా ఆ విశేషణం పట్టుకోలేక, "స్టుపిడ్ శైలేష్" అంటే గది మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయింది. పది సార్లూనూ! పైపెచ్చు ప్రతి సారి ధ్వని రెట్టింపయ్యిందేమో కూడా! ఎర్రబడ్డ ఆ శైలేష్ మొహం నాకిప్పటికీ గుర్తే!

అలా సాగుతూ సాగుతూ నా వంతు రానే వచ్చింది. సరీగ్గా నా ముందు అమ్మాయి "లవ్లీ లిండా" అని చెప్పి కూర్చోగానే , నాకు నా పేరుకు తగ్గ విశేషణం తట్టింది. మొప్పై ఐదు మంది పేర్లు జాగ్రత్తగా అప్పజెప్పి, అర క్షణం ఆగి, నా మనసు మరేదీ వెదకలేకపోయాను క్షమించంటుంటే, వేరే దారి లేక, గొంతు సవరించుకుని, బలంగా నిశ్వసించి, "మైటీ మానస" అని చెప్పాను.

గదిలో వినపడీ వినపడని చిరునవ్వుల గుసగుసలు.  అప్పటికి నేనొక ఫిఫ్టీ కేజీ తాజ్ మహల్‌ని మరి. నాకు "మైటీ" అన్న పదం అస్సలు సూట్ అవ్వలేదని పుర జనుల నవ్వుల వెనుక ఉన్న ఆంతర్యమేమో! ఏదేమైనా, పెద్ద గండం గడిచినట్టు అనిపించింది. నేను ఆ పైన పది రోజుల్లో పూనె నుండి దొంగ కారణంతో హైదరాబాదు వచ్చిన మాట పక్కన పెడితే, ఉన్న కొన్నాళ్ళూ, కలిసిన కొద్ది మందినీ ఇలానే ఇంటి పేరు మార్చి పిలిచి సరదాగా నవ్వుకునే వాళ్ళం. అదో మధుర జ్ఞాపకం!
********************
నాకు ఎప్పటి నుండో, నేను చాలా మితభాషిననీ , అంతర్ముఖిననీ, అస్సలు కొత్తవాళ్ళతో కలవలేదు- నెమ్మది పిల్ల అనీ, అందరూ చెప్పుకుంటుంటే వినాలని వెర్రి ఆశ.

నా మొహం చూసిన వాళ్ళూ, నాతో ఒక్కసారి మాట్లాడిన వారు ఇలా అనే అవకాశం రాలేదు. అది నాకో పెద్ద బెంగ. చిన్ని జీవితంలో చెల్లుబాటవ్వని వేన వేల కోరికల్లో ఇదీ ఒకటి. అందుకనీ, నేననుకున్నానూ, నా రెండో ప్రాజెక్ట్‌లో నేను తెలిసిన వాళ్ళు ఎవ్వరూ అదృష్టవశాత్తూ లేరు కనుక, మొదటి నుండీ గంభీరంగా, ఇంకా కుదిరితే కాస్తంత కోపంగా ఉంటే, నా చిరకాల కోరిక కాస్త నెరవేరే అవకాశాలు ఉన్నాయని!

నేను పైన చెప్పిన పుణె సంఘటన జరిగాక దాదాపు మూడేళ్ళకి, నాకు రెండో ప్రాజెక్ట్ దక్కింది. మా మేనేజర్ నన్ను, నా కన్నా కాస్త ముందు చేరిన వ్యక్తిని పిలిచి, పరస్పర పరిచయాల ప్రహసనం పూర్తి చేసారు. నా మనసులో లీలా మాత్రంగా మిగిలిన స్మృతి పుణ్యమా అని, నేను కాస్త మొహమాటాన్ని పక్కన పెట్టి అతన్ని పరికించి చూశాను. ఆ అబ్బాయి నా కన్నా కాస్త మెఱుగు. మరీ నాలా పాత సినిమా సూత్రధారులను గుర్తు తేకుండా, మాటల్లేకుండా టేకులు మింగకుండా, వెంటనే గుర్తు పడుతూ అన్నాడు.
"Hey...! You are Mighty Manasa right.." -అతని కళ్లల్లో నేను స్పష్టంగా చూడగల, చదవగల ఆశ్చర్యం.
"and you are Rocking Rupmeet!!" -చెప్తూంటే నా తల నవ్వుల జోరుకు పక్కకు వాలిపోతోంది.
మా మేనేజర్ మా నుండి జరిగింది తెలుసుకుని, " I never knew you were Mighty, Manasa" అని ఒక చిన్న విసురు విసిరి, ( ఇక్కడ కూడా నేను ఫిఫ్టీ కేజీ తాజ్ మహల్‌నే, , జస్ట్ ఫర్ ద రికార్డ్..;) ) నవ్వులు కాస్త పంచుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేం ...
"Do you remember Kind Kanika ? and Lovely Linda?"
"Oh yea, she was my roomie for more than 2 years"
"remember how funny Sailesh was .." he laughs.
"poor soul, he never meant that"
"Well well..that's some game"
"indeed, if a game could make us remember the names of stragers for 4 years, then it's really something"

అయిపోయింది. నా మహా నటనా మేలి ముసుగు, జ్ఞాపకాల సుడిగాలికి ఎగిరిపోయింది. నేను నవ్వులతోనూ, ఆనాటి రోజులు తల్చుకోగానే పొంగి వచ్చిన ఆగని కబుర్లతోనూ తుళ్ళిపడుతున్న సెలయేరైపోయాను. మళ్ళీ! మళ్ళీ మళ్ళీ!
మనసును దాయడమెంత కష్టం!
**********
కాబట్టి మై డియర్ కామ్రేడ్స్, క్రియేటివ్ ఆలోచనలను, ఆటలను చిన్న చూపు చూడకండి.  ఒక ఆట మీ జీవితాన్నే మార్చేస్తుంది. ;)

గోరింటాకు గురుతులు - గుప్పెట్లో చందమామ


'గోరింటాకు ' అనగానే అమ్మ చేతి గోరుముద్ద గుర్తొస్తుంది. ' మంచాల మీదకి చేరకండి ' అని ఒకటికి పది సార్లు చెబుతూ, పిల్లలందరి కోసం విడిగా నేల మీద పక్కలు పరిచే అమ్మమ్మ జ్ఞాపకం మనసులో మెరుపులా మెరుస్తుంది. అరుణ వర్ణపు రెక్కలతో ఆకాశం భూమి మీదకి వాలబోయే వేళ, అరచేతుల్లో విచ్చుకునే చందమామల నవ్వులు చెరిగిపోకుండా ఉండేందుకు తల వెనక్కు చేతులు పెట్టుకుంటూ తిప్పలు పడ్డ రోజులు గుర్తొస్తే, హృదయాన్ని కదిలించిన సంతోషపు తరంగమేదో, పెదవుల మీద ఆనవాలు వదిలే తీరుతుంది.

ఆకుపచ్చని టోపీలు, ఉంగరం వేలిని వెక్కిరిస్తూ మిగిలిన వేళ్లన్నింటికీ కూడా ఉంగరాలు, నెలవంకలో పూర్ణ చంద్రులో, చుక్కలో బంతాకులో, ఏవైనా పర్లేదు, ఎలా ఉన్నా వాదం లేదు. ఆ రోజు లేలేత చేతుల రంగులు మార్చుకోవడానికి ఒక రూపు కావాలంతే! పసితనానికి ఎల్లల్లేని సంబరాన్ని కానుకిచ్చేందుకే కదూ, గోరింటాకు చెట్టు కొమ్మ కొమ్మకూ ఆకులు చిగురించేది!


'కదిలితే నే పెట్టనిక! ', 'ఇలా చెరిపేసుకుంటే అందమేమైనా ఉంటుందా తెల్లారాక?' , ' అయ్యయ్యో ! ఆ గోడల మీద మొండి మరకలయ్యేదాకా చేతులాడించడం ఆపేది లేదా..' ఇలా వేల అరుపుల మధ్య, మరీ చిన్నప్పుడైతే మొట్టికాయల మధ్య, గోరింటాకు ప్రహసనం పూర్తయ్యేది. అతి కష్టం మీద నిద్రలోకి జారుకునే ప్రయత్నాలు చేస్తుంటే, కలా మెలకువా కాని కలత నిదురలో, అకస్మాత్తుగా అరికాళ్ళల్లో చక్కిలిగిలి పుట్టినట్టనిపించేది. ఉలిక్కిపడుతూ కళ్ళు తెరవబోతే.." అసలు అరికాళ్లల్లో చిన్న చుక్క అయినా పెట్టుకుని తీరాలి; ముందే పెడితే అటూ ఇటూ తిరిగి ఇల్లంతా కృష్ణ పాదాలు వేస్తారని పెట్టలేదు.." అంటూ కాళ్ళ మీద జోజోలతో అమ్మ సంజాయిషీ మెల్లగా వినపడేది. మంత్రమేసినట్టుగా మళ్ళీ నిద్ర తన్నుకొచ్చేది.

అసలు కథలు మొదలయ్యేది తెల్లారాకే!

మేఘమాల లోగిలిలో కాంతి రేఖలు పాకించేందుకు నీలి కొండల కౌగిళ్ళ నుండి విడివడి, చిటారు కొమ్మల చాటుల నుండి వడివడిగా బయటికొచ్చే సూరీడికంటే ముందే, నేనూ లేచి కూర్చునేదాన్ని.

లేచాకా ఎర్రగా పండిన నా చేతులను పదే పదే ముద్దు పెట్టుకుని, కాస్త ఎండాక గోరింట నుండి వచ్చే వింతైన వాసనను బలంగా లోపలికి పీలుస్తూ, అక్క లేచే నిముషం కోసం కాచుక్కూర్చునే దాన్ని.

అక్క కూడా లేచాక, ఇద్దరం బాల్కనీలో ఒక మూలకు వెళ్ళి, ఎండిన గోరింటాకు మొత్తం ఓపిగ్గా విదుల్చుకుని, ఆ వెంటనే రెండు చుక్కల కొబ్బరి నూనె చేతులకు పట్టించుకునే వాళ్ళం. అలా చేస్తే గోరింటాకు ఎక్కువ కాలం నిలుస్తుందని చెప్పేవారు. అప్పుడు ఎదురెదురు కూర్చుని అరచేతులు పక్కన పెట్టుకుని చూసుకుంటూ నాదెక్కువ ఎర్రగా పండిందంటే నాదెక్కువ ఎర్రగా అని కాసేపు వాదించుకునేవాళ్ళం. కాసేపా వాదనలయ్యాక అక్క హఠాత్తుగా 'నీలాంటి అల్పులతో నేను వాదించను ' తరహా చూపొకటి విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోయేది. నేను యథా ప్రకారం బిక్కమొహంతో తయారు.

ఆ తర్వాత అమ్మ దగ్గరికి పరుగెత్తేవాళ్ళం.

అమ్మ కుడి చేతికి పెట్టుకునేది కాదు. మా అందరికీ తనే పెట్టడం వల్ల, ఆ చెయ్యి ఫలానా అన్న రూపమేం లేకుండా ఎర్రగా పండిపోయి ఉండేది. మాలాగా అంత జాగ్రత్తగా ఉన్నట్టూ ఎక్కువ సేపు ఉంచుకున్నట్టూ కూడా కనపడేది కాదు కాని, అమ్మ చెయ్యే మా చేతుల కంటే ఎర్రగా, అందంగా పండేది. చూడడానికి కూడా అదే చాలా అపురూపంగా ఉండేది.
ఆ రోజంతా అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ చేతులు చూపించడంలోనూ, దగ్గరి వాళ్లనిపిస్తే చేతులను విడువని గోరింట వాసనను చూపించడంలోనూ నేను తలమునకలైపోయి ఉండేదాన్ని. బాగా కళ్ళు పెద్దవి చేసి నా చేతులు చూస్తూ ఉండిపోయిన స్నేహితులెవరైనా ఉంటే, కాస్త మిగిలిన గోరింటాకు మర్నాడు తెచ్చిస్తాలెమ్మని హామీలు కూడా ఇచ్చేసేదాన్ని. అపార్ట్‌మెంట్‌లో పక్కింటి వాళ్ళు ఎవరైనా, 'ఏమైనా పెళ్ళికి కానీ వెళ్తున్నావా మానసా ' అని చనువు కొద్దీ పలకరించినప్పుడు, 'ఊహూ, ఊరికే పెట్టుకున్నా" అని చెప్పడంలో, కారణం తోచనివ్వని కించిత్ గర్వం కూడా ఉండేదనుకుంటా. నా చేతులను నిశితంగా పరిశీలిస్తూ బళ్ళో వాళ్ళు , "మా ఇంటి వెనుక చెట్టుకు కాసే గోరింటాకు ఇంకా బోలెడు ఎర్రగా పండుతుంది తెలుసా" అని దీర్ఘాలు తీస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా తమాషాగా భుజాలు ఎగరేసి పక్కకి వెళ్ళిపోయేదాన్ని.

అదే ఆ రోజుల గొప్పతనం! దేనికీ ఆలోచించక్కర్లేదు, అసలు ఆలోచించి మాట్లాడాలన్న స్పృహే ఉండక్కర్లేదు.

సంతోషమో, బాధో, గర్వమో గర్వభంగమో, కాస్తంత అసూయ, ఇంకాస్త దయ, కరుణ, కోరుకున్నంత సంతోషం, కోరికలే లేనట్టు ముంచెత్తే ప్రశాంతత, కావలసినది అడిగే ధైర్యం, ఎవ్వరూ అడగక్కర్లేకుండానే ఏమైనా ఇచ్చేయగల ప్రేమ, బోలెడంత విసుగు, వెన్నంటే ఒక్క ఊరడింపుతో వదిలిపోయే మొండితనం....

ఇన్ని తెలిసున్న వాళ్ళని పట్టుకుని, 'పాపం పసి వాళ్ళు, ఏమీ తెలీని వయసు ' అంటారు కదా, ఎందుకు ?
- అందునా అనేది ఎవరు ? వయసు పెరిగే కొద్దీ పై లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా వదిలించుకుని గొప్పవారైపోయిన వారు !
********************
చివరగా ఓ సరదా సంఘటన :

మొన్నీ మధ్య ఇంటికి వెళ్ళినప్పుడు, గోరింటాకు వారం వారం అమ్మేందుకు ఇంకా ఒకావిడ వస్తోందని విని ఆశ్చర్యపోయాను. సెలవుల్లో ఉన్నా కదా అని రెండు చేతుల్లోనూ చందమామలు పెట్టించుకున్నా, వేళ్ళకు టోపీలు కూడా ..!

"అసలు నువ్వు ఈ పాతకాలం డిజైన్ ఎందుకు పెట్టుకున్నట్టు, గోళ్ళన్నీ చూడు ఎంత పిచ్చిగా తయారయ్యాయో ? కనీసం ఇప్పుడైనా నెయిల్ పోలిష్ వేసుకోకపోతివి!!" - వారం తర్వాత ఆఫీసులో అడుగు పెట్టగానే ఒక స్నేహితురాలు వాదానికి దిగింది - " ఫలానా మాల్‌కి వెళ్తే, మొదట్లోనే ఒకడు కూర్చుని ఉంటాడు. ఐదంటే ఐదే నిముషాల్లో అరబిక్ డిజైన్ మోచేతుల దాకా పెట్టేస్తాడు. నువ్వక్కడికి వెళ్లనే లేదా ఇన్నాళ్ళూ ? "

మోచేతుల దాకా గోరింటాకా...ఛీ ఛీ!! మహా చిరాకు పడిపోతూ 'వెళ్ళలేద'న్నాను.

నే చేసిన ఘోర అపరాధానికి మూల కారణం అర్థమైనట్టుగా (కనిపెట్టినట్టుగా ) తల పంకించింది.
మరో రెండు సార్లు అరబిక్ గీతల్లో ఉన్న గొప్పతనాన్ని పెద్ద మనసు చేసుకుని నా కోసం వర్ణించి, తప్పకుండా వెళ్ళి తీరాలి సుమా, అని నన్ను హెచ్చరించి, ఆ అమ్మయి వెళ్ళిపోయింది.

నాలో నేను రహస్యంగా నవ్వుకుంటూ అనుకున్నా- ' నే మనసు పడి, ఏరి కోరి చందమామను నా గుప్పిట్లో పెట్టుకున్నాననుకుని సంబర పడుతుంటే, అర్థం లేని గీతలేవో ఐదు నిముషాల్లో కోన్‌తో బరికేసిన వ్యక్తి గురించి నా దగ్గర చెబుతుందేమిటి? నే వింటాననేనా? పిచ్చి పిల్ల!!"

ఈ సంతోషం నేను కోరి దక్కించుకున్నది, మళ్ళీ ఇంకొకసారి ప్రపంచం నిర్దాక్షిణ్యంగా వల పన్ని లాక్కెళ్ళేందుకు కాదు!

Better luck next time, baby! :)

**********************************

మళ్ళీ మళ్ళీ నిన్నే...


పగలంతా నువ్వు లేని క్షణాలని గడపి
మర్చిపోనివ్వని జ్ఞాపకాల్ని భరించి
కన్నీళ్ళను గుండెల్లో దాచి
నవ్వులు పులుముకు తిరిగాను..

మనసుకో ఓదార్పు మాట చెప్పి
వీడ్కోలు తప్పదని నచ్చజెప్పి
నీ తలపులనన్ని తిప్పికొట్టి
ఏకాంతంలో పొగిలి పొగిలి ఏడ్చాను..

మన గొడవలెంత బాధో రాసుకున్నాను
నీ మౌనానికెలా తల్లడిలానో తల్చుకున్నాను
మూసేసిన మనసు తలుపుల ముందు,
దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను

తీరా రాతిరయ్యే సరికి
కలల దుప్పటి కప్పుకుని,
కలిసిపోయామని భ్రమించాను!
మళ్ళీ మళ్ళీ నిన్నే ప్రేమించాను!


చలం-బ్రాహ్మణీకం-కొన్ని ఆలోచనలు

నాకెందుకో మొదటి నుండీ విషాదాంతాలయ్యే కథలంటే తెలియని వెగటు.

ఏ కారణం చేతనైనా ఒక పుస్తకంలోనో, సినిమాలోనో చివరకు చెడు గెలవటాన్ని చూపించినా, మంచితనమో - నిస్సహాయతో శాపాలుగా మారి కథలోని ఏ పాత్రనో కబళించడం జరిగినా దాన్ని తేలిగ్గా తీసుకోలేక విలవిల్లాడతాను.

చిన్నప్పుడు అమ్మ/అమ్మమ్మ దగ్గర 'ఆవు-పులీ' కథ విన్న నాటి నుండీ ఈ నాటి దాకా నా ఆలోచనల్లో పెద్ద మార్పేమీ లేదనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క కారణం చేతనే నేను చదవకుండా వదిలేసిన పుస్తకాలు, చూడకుండా తప్పించుకు తిరిగిన సినిమాలూ బోలెడున్నాయి. అయితే ఇటీవల రచనా వ్యాసంగం మీద నాకున్న ఆసక్తిని గమనించిన శ్రేయోభిలాషులు కొందరు మాత్రం, నా ఈ తత్వం కొన్ని మంచి కథలకు దూరం చెయ్యగలదని హెచ్చరించాక, అభిప్రాయాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. రచనను కేవలం రచనగానూ, పాత్రల్లో కలిగే సంచలనం పాఠకుల్లో కలిగించే భావోద్వేగం రచయిత నేర్పుగానూ చూడాలని నిర్ణయించుకున్నాను. అతిగానూ, అనవసరంగానూ స్పందించడం నన్ను ఆదర్శ పాఠకురాలిని కాకుండా చేసి, రచనలను అనుభూతి చెందటం నుండి రెక్క పట్టుకు దూరం లాగుతోందన్న సందేహం కలగడమూ, నాలోని మార్పుకు కొంత కారణం.

ఇలా మార్పు ఒళ్ళో కుదురుకుంటున్న కొద్ది రోజులకే "బ్రాహ్మణీకం" నా చేతుల్లో పడటం కేవలం యాదృఛ్ఛికం!

బ్రాహ్మణీకం, నన్నడిగితే, లెక్కలేనన్ని స్త్రీ హృదయాలని, ఒక్క పాత్రలో చూపించిన విషాదం!
మంచితనానికీ, జాలికీ, సహనానికీ హద్దులు తెలుసుకోలేని అమాయకత్వం జీవితాన్ని కొండచిలువలా మింగేస్తుంటే, ఉక్కిరిబిక్కిరి అవ్వడమే తప్ప ప్రతిఘటించలేని స్త్రీ జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించే కథ.

ఇల్లు తప్ప బయట ప్రపంచం ఎఱుగని ఒక ఆడపిల్లకు పెళ్ళి. మేడ పైని గదిలో, బయట ప్రపంచానికి ప్రవేశం లేకుండా తలుపులు మూసేసి, ఆమె సౌందర్యంతో పిచ్చి వాడైన భర్త పగలూ-రాత్రీ బేధం లేకుండా, రెండేళ్ళ పాటు సాగించిన సంసారం, చివరికి అతని ఆరోగ్యం చెడిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మేడ దిగుతుంది.

అనారోగ్యంలోనూ భార్యను విడలేని వెర్రి మోహమా భర్తది. తల్లిదండ్రులూ, అత్తమామలూ వారిద్దరినీ విడిగా ఉంచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, ఆఖరుకు, భర్తకు జాతకరీత్యా ఉన్న ఆయుస్షు అంతే కనుక, తదనుగుణంగా చివరి ఘడియల్లో భర్త మనసుకు ఉల్లాశం కల్పించడమే మెఱుగన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది.

చేసేదేమీ లేక వాళ్ళ ప్రాప్తానికి వాళ్ళని వదిలేస్తారందరూ.

భర్త చనిపోతాడు. అతనికి ఆస్థి ఉందని తెలిసినా, ఎలా రాబట్టుకోవాలో తెలీనితనం! భర్త చనిపోయాక ఎవరి పంచకు చేరాలో, ఎవరు ఆశ్రయం ఇవ్వగలరో, ఎవరిని అడగాలో తెలియని బిడియం!

ఈ లోపు తండ్రీ చనిపోతాడు. దిక్కు లేకుండా పోయిన తల్లీ కూతుళ్ళ సంగతీ తెలుసుకున్న మేనమామ, వారిద్దరికీ ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వస్తాడు. అలా వారింటికి ప్రయాణమవుతారు. దారిలో ప్రయాణం పొడుగునా వీళ్ళ వ్యవహార శైలిని చలం వర్ణించిన తీరు చదివి తీరాల్సిందే! ఇతర కులాల వారితోనూ, వర్గాల వారితోనూ సాగిన సంభాషణల్లో అగ్ర వర్ణాల వారి ఆలోచనల గురించి విసిరిన వ్యంగ్యోక్తులు మనకి తెలీకుండానే పెదవుల చివరల నవ్వులు పూసేలా చేస్తాయి.

ఇహ నా దృష్టిలో అసలు కథ మొదలయ్యేది సుందరమ్మ వీళ్లింటికి వెళ్ళాకనే! అక్కడ ఈమె పాలిటి శాపంలా ఒక సంగీతం మాష్టారు(చంద్రశేఖరం) తయారవుతాడు. అతనికి సుందరమ్మ అందం మీద వ్యామోహం! ఆమె కళ్ళల్లో కనపడే మెరుపు రహస్యాలు తెలుసుకోవాలనే ఉబలాటం!

ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన స్త్రీ అన్న గౌరవమూ, ఆమె వైధవ్యం పట్ల జాలీ ఉన్నా, వాటిని మించిన మోహమే, ఆమె సౌందర్యం పట్ల తెలియని వ్యామోహమే ఆమెపై అతని ఆసక్తికి తొలి బీజం వేస్తుంది. ఆమెను తన దారిలోకి తెచ్చుకునేందుకు అతడి ప్రయత్నాలు ఏహ్య భావాన్ని కలిగిస్తాయి. అలాగే, ఆత్మ విశ్వాసం, ధైర్యం లేని సగటు స్త్రీ మాటల్లో, పురుషుడు ఆహ్వానాన్ని ఎలా వెదుక్కుంటాడో, దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను ఎలా మభ్యపరుస్తాడో, చలం మాటల్లో చదవడం బాగుంటుంది.

ఆమె అమాయకత్వం మీద మొదట్లో మనకున్న సహృద్భావం కథ నడిచే కొద్దీ చిరాగ్గా మారుతుంది. మంచితనం, విషవలయంలోకి తీసుకుపోతోంటే మౌనంగా అనుసరిస్తున్న ఆమెను వెనక్కు లాగేందుకు, కథలో మనకీ ఒక పాత్రుంటే ఎంత బాగుండుననిపిస్తుంది.

ఒకానొక రాత్రి సదరు చంద్రశేఖరం అతనికి కావల్సినదేదో దక్కించనే దక్కించుకుంటాడు. సుందరమ్మ గర్భవతి అవుతుంది. వితంతు బ్రాహ్మణురాలైన ఆమెకు ఇది మహాపరాధంలా తోస్తుంది. ఆమె భర్త గుర్తొస్తాడు. ఆచారాలతో, సాంప్రదాయాలతో అగ్ని లాంటి స్వఛ్ఛతతో గడచిన తన గతం గుర్తొస్తుంది. అంత క్రితం అతను పలు పర్యాయాల్లో కాళ్ళ బేరానికి వచ్చినప్పుడు, చనిపోతానని అంటూ మొసలి కన్నీరు కార్చినప్పుడు, అతనికి సర్దిచెప్పే ప్రయత్నంలో వలలో పడిన సుందరమ్మకు, ఈ సంఘటన తర్వాత, ఆ కాస్త జాలీ కరిగిపోయి అసహ్యమే మిగులుతుంది.

మేనమామ చంద్రశేఖరాన్ని మెడలు వంచి పెళ్ళికి ఒప్పించడంతో, వివాహమవుతుంది. అయితే ఈ శేఖరానికి వితంతువుని పెళ్ళి చేసుకోవడం మింగుడు పడదు. అతనికి ఇలాంటి ఖర్మ పట్టినందుకు చింతిస్తూ ఉంటాడు. ఆమె మీద అందాకా ఉన్న మోజూ కనపడదు, గుదిబండన్న అభిప్రాయం తప్ప. మరో పక్క సుందరమ్మ వీటన్నింటి పట్లా నిర్వికారంగా ఉంటుంది.

బిడ్డ పుడతాడు. ఎవరి ఆసరా లేకుండా బిడ్డను పెంచడమెట్లానో సుందరమ్మకు తెలీదు. చెప్పేందుకు ఎవ్వరూ ఉండరు. ఇరుగు పొరుగూ ఈమె పట్ల మర్యాదగా వ్యవహరించరు. వీటన్నింటి వల్లా సుందరమ్మకు జీవితం పట్ల చెప్పలేని నైరాశ్యం కమ్ముకుంటుంది. పిల్లవాడికి జబ్బు చేస్తే తన పాప ఫలమని భ్రమిస్తూ ఉంటుంది. ఒక దేవతకు మొక్కు తీర్చుకుందుకు ప్రయత్నించబోగా, భర్త ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మరింత బెంగలో కూరుకుపోతుంది.

చివరకు, అనారోగ్యంతో ఆ బిడ్డ పరిస్థితి తీవ్రతరం అవ్వడమూ, విధిలేని పరిస్థితుల్లో మందుల షాపు వెదుక్కుంటూ వొంటరిగా వెళ్ళిన ఆమెకు, ధనం తక్కువవ్వడమూ జరుగుతాయి.

దగ్గర్లోని వ్యక్తిని అర్ధించగా, ఆ క్షణం దాకా మంచివాడుగా ఉన్నవాడు కాస్తా, ఆమె బ్రాహ్మణ వంశానికి చెందినదని తెలియడంతో, చిన్ననాటి వెర్రి పగ ఒకటి జ్ఞప్తికొస్తుంది అతగాడికి.

ఈ పిచ్చిపిల్ల మరో సారి మోసపోయి అది భరించే శక్తి లేక కన్ను మూయడంతో కథ ముగుస్తుంది.

*****************************

చలానికి స్త్రీ అర్థమైనట్టు మరే రచయితకైనా, ఆ మాటకొస్తే అసలు మరే స్త్రీ కైనా అర్థం అవుతుందా అన్నది, నాకిప్పటికీ సందేహమే! వాళ్ళకు మాత్రమే సొంతమైన కొన్ని భయాలు, ఆలోచనలు, అభద్రతా భావాలు, సంశయాలు, ఎక్కడా ఎప్పుడూ ఎవ్వరి ముందూ బయపెట్టని ఆశలు చలం అక్షరీకరించినట్లు వేరొకరు చేయలేరు. తమకు మాత్రమే తెలుసుననుకున్న కొన్ని రహస్యాలు చలం ఇలా బట్టబయలు చేస్తుంటే, చలాన్ని చదివే ఆడవారందరూ ఆశ్చర్యంతోనో, ఇన్ని తెలుసుకునేందుకు అతని దగ్గరున్న మంత్రమేమిటన్న అనుమానంతోనో అతడికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారనుకుంటా, నాలాగా!

రచన ఆసాంతం చలం ఆమె మానసిక స్థితిని అద్భుతంగా ఆవిష్కరించాడు. రచనలో పెద్దగా వివరణలు గట్రా కనపడవు. ఆమె ఎందుకిట్లా చేస్తున్నదో తెర వెనుక నుండి ఎవ్వరూ చెప్పరు. రచయిత మధ్య మధ్యలో చొరబడి కథను నడిపించడమూ చూడము. కథ మొత్తం సుందరమ్మదే! చంద్రశేఖరంతో ఆమె చెప్పే నాలుగు ముక్కలే ఆమె తెలివికీ, ఆలోచనలకీ, ఆమె మంచితనానికీ, తేలిగ్గా మోసపోగల తత్వానికి ప్రతీకలని పాఠకులకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ చిన్న చిన్న వాక్యాలలోనే అనాదిగా కొందరు పురుషులు స్త్రీలోని యే కోణాన్ని, ఏ బలహీనతను ఆసరాగా తీసుకుని వాళ్ళ జీవితాలను నాశనం చేసే ధైర్యం చేస్తారో చెప్పేశాడు చలం!

జీవితాలను మార్చుకోవడానికి, తీర్చిదిద్దుకుని సగర్వంగా జీవించడానికి, మనోనిబ్బరంతో పాటు కాస్తంత లోకజ్ఞానం ఉంటే చాలేమో అని అనిపిస్తుంది బ్రాహ్మణీకం చదివితే ! ఆ కాలానికీ ఈ కాలానికీ మధ్య దశాబ్దాల దూరం ఉన్నా, ఇలాంటి వార్తలు అడపా దడపా ఈనాటికీ వింటూనే ఉన్నాం కనుక, ఆ బలహీనతల నుండి బయటపడే గుణం అందరికీ కలగాలనీ కోరుకోవాలి మనం!

చలం పురూరవ - నాకు నచ్చిన కొన్ని విషయాలు



పురూరవ ఒక సౌందర్యాన్వేషణ. సత్యాన్వేషణ. ఒకరి శాపం మరొకరికి అనుకోని వరమైన కథ.

సర్వ భూవలయ ఛత్రాధిపతినన్న అహంకారం నుండి మరలి, మానవ జాతికి చెందని ఒక దేవ వేశ్య ప్రేమ తననేం చేయబోతోందోనన్న బెంగ నుండి, అభద్రతా భావం నుండి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేసి, ఆమె చెప్పిన ప్రేమభావనను అర్థం చేసుకోలేక, ఆ దేవత ఆజ్ఞను మీరి, అపరాధిలా మారి, ఏళ్ళ తరబడి విరహంలో మగ్గిన పురూరవుడి ప్రణయ గాథ ఇది.

తన ఒళ్ళో ప్రేమతో పడుకోబెట్టుకుని, పురూరవుడికి ఊర్వశి చెప్పిన కబుర్లన్నీ, నిజానికి వినాల్సింది, ఆచరణలో పెట్ట ప్రయత్నించాల్సినదీ మనమే! ఏ కాలానికైనా అన్వయించుకోదగిన ఆణిముత్యాల్లాంటి మాటలవి!

సంభాషణల్లో అడుగడుగునా కనపడే తాత్విక చింతన చేతనైతే మన జీవితాల లోపలి పొరల వైపొకసారి తొంగి చూడమని తొందర పెడుతుంది. ప్రేమ కోసం కాదంటే, ఆ అసలు ' నిజాల ' కోసమైనా ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.

" నీ దిగులేదో కాఠిన్యం కన్నా మార్దవమూ, ఔన్నత్యమూ అనుకుంటున్నావు. తాము ఎక్కడ సహాయపడలేరో, అక్కడ దిగులుపడి, తమ కర్తవ్యం తీర్చుకున్నామని సంతుష్టిపడతారు మానవులు. జాలీ, దిగులు, చాలా కపటం, బలహీనం, ఉంది మీ లోకంలో. ప్రతి అడుగుకీ వ్యథ. జాలి. ఎవరికి ఉపకారం ? మీ లోకంలో ఏడుపు ఒక ధర్మమైపోయింది. అందరూ సరే! నువ్వు ఈ అవివేకాలకి వశ్యుడివి కావడానికి వీలు లేదు.

ధీరాత్ములు, స్థితప్రజ్ఞులు, లోకంలో అసాధారణ వ్యక్తులు -వాళ్ళ జీవితాలు వాళ్ళ సొంతం కాదు. వాళ్ళ అల్పత్వాలని, వెర్రి వాంఛలని మించిన మహా శక్తి వాళ్ళని ఉపయోగించుకుంటోంది. గనుకనే వాళ్ళు మానవులలో ప్రత్యేకమైన వారైనారు. వాళ్ళు ధర్మాలకీ, నీతులకీ అతీతులు. వారి పథం అగ్నిహోత్రం. వారికి రెండో మార్గం కనపడనీదు......

ఉన్నత గమనమంటేనే పూర్వ బంధ నాశనమని అర్థం. "

ప్రేమనీ, విరహాన్నీ, దిగులునీ - దాపరికాన్నీ, తప్పొప్పుల లెక్కల్లో సతమతమయ్యే మానవ జీవితాన్నీ అక్షరాల్లో అలవోకగా చిత్రించగలగడం చలానికి చేతనైనట్టు ఇంకెవరికన్నా చేతనౌనా అనిపించింది చాలా సార్లు.

ప్రకృతి వర్ణనలున్న ప్రతి చోటా మనసుని లాక్కెళ్ళి అక్కడ నిల్చోబెట్టగలిగిన భావాలు. ఊహలు. ఒక్కసారి పురూరవుడిగా మారి, ఊర్వశి ప్రేమను క్షణమైనా అనుభవించాలన్న ఆశ! వంటింటిలోనూ, ఇంటి కింద పార్క్‌లో సిమెంటు బెంచీ మీద కూర్చుని పేజీలు తిప్పిన సెకన్లలోనూ, ఆమె ప్రేమభావను అర్థం చేసుకోలేని పురూరవుడి మీద అంతు లేని జాలి కలిగింది నాకు. అలాంటి అవకాశాన్ని మూర్ఖుడిలా వృధా చేసుకుంటున్న అతగాడి మానసిక దౌర్బల్యం మీద కోపం కూడా వచ్చింది.

కానీ, నిజ జీవితంలో మనమంతా చేస్తున్నదీ అదే కదూ! ఊర్వశిని కాసేపు పక్కన పెడదాం! ఏది శాశ్వతం కాదో దాని కోసం వెంపర్లాడడం, కళ్ళ ముందున్న "క్షణం" అనే స్వర్గాన్ని విడనాడి, భవిష్యత్ కోసం కలలు కంటూ లేదా భయపడుతూ, ఆశలోనో నిరాశలోనో, జీవితాన్ని నాశనం చేసుకునే అభాగ్యులు మన చుట్టు పక్కలెంత మంది లేరు గనుక!

ఊర్వశి ప్రేమను మించినదేదీ లేదంటుంది. "నిన్ను నీకు పరిచయం చెయ్యనా" అని పురూరవుడితో అంటూ ఉంటుంది. ఎన్నో ఆజ్ఞలూ పెడతానంటుంది. అవన్నీ పురూరవుడు తనని తాను మరవడానికి. అతడు ఆమే వాడై, ఇంకేమీ కాకుండా పోవడానికి. అంత అధికారాన్ని, దానిని మించిన ప్రేమనూ, అన్నింటిని అనుభవిస్తూ కూడా.."నువ్వెవరు" అన్న ప్రశ్నను విడిచిపెట్టలేని పురూరవుడికి ఇలా బదులిస్తుంది.

"యుగాలు వెదికి వెదికి నిన్ను చేరాను. ఈనాటికి నిన్ను గొప్ప అశాంతితో -ఈ లోకపు అశాంతి కాదు, వెయ్యి కన్నులతో, ఎక్కడ ? ఎక్కడ? అని కాలంతో ప్రతీ క్షణం ఎదురు చూసే సూర్య చంద్రులతో, అనంత దూరాన ఉన్న నక్షత్రాల కాంతితో కళ్ళు కలిపి వెతికే మధురమైన అశాంతితో, మాయ పొరలు చేధించి అనేక రూపాలలో, లోకాలలో, ఎవరు? ఎవరు ? నా ఆత్మనాథుడెవరు, అని దిక్కులు నిశ్శబ్దంగా మారుమ్రోగే అన్వేషణ ఫలితంగా కలుసుకున్నాను నిన్ను.

నన్ను మర్చిపోకు. మళ్ళీ నా చేతులని తప్పించుకుని అంధకారంలోకి జారినా నుంచి దూరమైపోకు. నీ అనుభవానికి నువ్వే విరోధివై నీకు నువ్వే అబద్దీకుడవై మనిద్దరి మధ్యా విరహ సముద్రాలని కల్పించకు.  నువ్వు నిరాకరిస్తే నిస్సహాయనైపోతాను,


ఎంతకూ రాని కాంతికై మౌనంగా పూవు రెక్కల మీద కన్నీరు కార్చే రాత్రివలే నా విరహంలో నేనే అణగిపోతాను. "

చదివేందుకు గట్టిగా అరగంటైనా పట్టని ఈ పుస్తకం, మననం చేసుకుంటుంటే మాత్రం రోజులు దాటిపోయేలా చేయగల అద్భుతం!

పురూరవుణ్ణి చదవకండి! ఏకాంతంగా కూర్చుని మనసారా అనుభవించండి!

ఊర్వశిలోని దైవత్వం నిండిన ప్రేమనూ, పురూరవుడి అల్ప మానవ మనస్తత్వాన్ని, మనం ఊహించలేని, సాధించలేని అపూర్వ ప్రేమ భావనలో మునిగి తేలండి!

ఈ పుస్తకం తప్పక చదవాల్సిన పుస్తకమని సూచించిన స్వాతిగారికీ, దొరక్క ఇబ్బంది పడుతుంటే, అవినేని భాస్కర్ గారి పేరు సూచించడమే కాకుండా ఆఫీసుకి తెచ్చి ఇచ్చిన "ఏకాంతం" బ్లాగర్ దిలీప్‌కు కృతజ్ఞతలు.

చలంగారి పుస్తకాలు బోలెడిచ్చి, నా మిగిలిన పుస్తకాలు, పనులు పక్కన పడేసేలా చేసిన భాస్కర్‌కు డబుల్ థాంక్స్. :)

భీత హరిణి


ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా రాసిన కవిత ఇది. నేను చదువుకునే రోజుల్లో కూడా ర్యాగ్గింగ్ ఉండేది.అందులోనూ మా కాలేజీ (సిద్ధార్థ, విజయవాడ) ఇటువంటి వాటికి పెట్టింది పేరు. అయినా చదువయ్యే సరికి కేవలం స్నేహాలే తప్ప గొడవలు గుర్తుండకపోవడం నా జ్ఞాపకశక్తి నాకిచ్చిన వరం ;)


ఈ కవితను, హంసిని వెబ్ పత్రిక వారు ప్రచురించారు.
http://hamsini.andhraheadlines.com/Sections/Details.aspx?CatID=5&AuthId=22&ArtId=65

*****************************************

అమ్మా నాన్నల అల్లారు ముద్దు పెంపకంలో
ఆకాశమే హద్దుగా సాగిన విజయ ప్రస్థానం నాది
కన్న వాళ్ళ శత కోటి కలలను నిజం చేసేందుకు
తొలిసారిగా గూడు వీడిన ఓ లేత గుండె చప్పుడిది

నన్ను చూస్తూనే.. మర్యాద ధ్వనించని చప్పట్లు
దగ్గరకు రమ్మంటూ కరడు గట్టిన గళాల పిలుపులు
నా మానస వీణలో   మెదిలిందేదో     అపశృతి
ఆకలి గొన్న సింహపు ముంగిట లేడి పిల్ల స్మృతి!

నిస్సహాయంగా నిల్చున్నాక విచారణ పేరిట వేధింపులు
వంద మందీ ఒక్కటయ్యాక వెర్రి ప్రశ్నలతో సాధింపులు
ఆధిపత్యం నిలబెట్టుకోను అర్థం లేని అరుపులు
తప్పేంటో తెలీనివ్వక క్షోభ పెట్టే ఎగతాళి చూపులు..

నా స్వప్న సౌధపు పునాదులను
ఎవరో పెకిలిస్తున్న భావనలు నాలో
నేనూహించుకున్న పవిత్ర ప్రపంచపు
మౌనపు వెక్కిరింపులు లోలో....!!

ఒక్కసారిగా ఉప్పెనలా విరుచుకు పడే విమర్శనాస్త్రాలు
జీవితానికి సరిపడే బాధని మిగిల్చిన గాయాలు
క్యాంటీన్ లోకి వెళ్ళనీక ఆపిన భయాలు-బిడియాలు
ఆకలి మంటల నార్పలేక కన్నీరోడ్చిన జ్ఞాపకాలు ...

అర్థ రాత్రి దాటినా ఆగని వంకర ప్రశ్నలకు
అలసి పడిన చేదు చీకటి అనుభవాలు
ఎదురు తిరిగిన ప్రతి చోటా ప్రతి సారీ
ఎదను కోసేసిన అవమాన భారాలూ..

తన వాళ్ళనే తోడేళ్ళై కబళించే తత్వమింకా సమసి పోలేదనీ..
ఆటవిక యుగపు దాఖలాలు చుట్టూరా మిగిలే ఉన్నాయనీ
మనందరికీ తేల్చి చెప్తుంటే,సిగ్గుతో తల దించుకోమంటుంటే
ఏ వెలుగులను వెదుక్కుంటూ సాగిస్తున్నాం మనమీ ప్రస్థానం..?

మరో ప్రపంచాన్ని పరిచయం చేసెదెవరని మూర్ఖంగా అన్వేషించక
మార్పు తెచ్చేందుకు మహాత్ముడే రావాలని మౌనంగా నిరీక్షించక
ఎన్నటికీ అమలు కాని చట్టాల డొల్లతనాన్ని గేలి చేస్తూ
కుల మత వర్గ  విభేదాలను  కళాశాల కావలే  ఆపేస్తూ ..
                                        ఇప్పుడైనా చేతులు కలుపుదాం..!!

మానవత్వపు పరిమళాలు వాడనివ్వని వాడే
'మనీషి' అని మరో మారు చాటేందుకు..
విద్యాలయాల్లో విజ్ఞాన జ్యోతులే ప్రకాశిస్తూ
రాక్షస క్రీడలన్నీ అంతరించిపోయేటందుకు...!

రెల్లు పూల పానుపు పైన..

అనుభవాలన్నింటికి అక్షరాల తొడుగులు తొడగడం నా వరకూ నాకు అసాధ్యమైన పనే! అయినా ఎందుకీ తాపత్రయం అంటే, ఆ అనుభవాలకు సంబంధించిన అన్ని విశేషాలనూ కావలనుకున్నప్పుడల్లా తరచి చూసుకోవడానికి; మళ్ళీ మళ్ళీ జ్ఞాపకాల జారుడుబల్లనెక్కి, గతమనే ఇసుక తిన్నెల్లోకి తుళ్ళింతలతో జారిపడుతూ, జీవితం నన్నెంతలా సంతోషపెట్టిందో గుర్తు చేసుకుని, మరింతగా ఆమెను ప్రేమించడానికి!

మనం కాలంతో పాటు పరుగులు తీస్తూ తీరాలను దాటుకుంటూ ఎంత ముందుకు వచ్చేసినా, తొలి అడుగులు కొన్ని ఆ ఇసుక తిన్నెల్లో గాఢ ముద్రలు వేసే తీరతాయి. వర్షం వెలసిన మర్నాడు రెమ్మ రెమ్మకీ లాల పోసే చినుకులంత స్వచ్ఛంగా మనసులో నిలిచిపోతాయ్!

మొట్టమొదటి సారి కాలేజీకి వెళ్ళడం, ఉద్యోగంలో చేరిన మొదటి రోజు, మొదటి జీతం అందుకున్న రోజు, మొదటి సారి విదేశంలో అడుగిడిన రోజు, తొలి ప్రేమ, తొలి ముద్దు..నిజానికి సౌందర్యమంతా ఆ కొత్తదనానిదేనేమో కదూ!

" I like beginnings..because they are so full of promises...
I like beginnings because i know,there is always more to come....."

ఎప్పుడో ఎక్కడో చదివి నేను దాచిపెట్టుకున్న ఈ వాక్యాలతో ఏకీభవించని వారు బహుశా ఎవ్వరూ ఉండరేమో! నచ్చినా, నచ్చకపోయినా ఆ జ్ఞాపకాలు మర్చిపోవడం మాత్రం దుర్లభమని అందరూ ఒప్పుకునే తీరాలి. అలాంటి ఒక జ్ఞాపకం గురించి...రెల్లు పూల పానుపు అకస్మాత్తుగా ప్రత్యక్షమై వెన్నెల తరకలు దానిపై పరుచుకోవడాన్నితొలిసారిగా "విన్న" రోజుల గురించి......

ఇంజనీరింగ్ ఫైనల్ సెమిస్టర్ - లైవ్ ప్రోజక్ట్ కోసం ముచ్చట పడ్డామేమో, తిరిగీ తిరిగీ కాళ్ళు పడిపోయేవి. ఇంకో పక్క పరీక్షలు గట్రా మామూలే -

ఖాళీగా కొన్నాళ్ళు ఇంట్లో ఉందామనే ఆశ కూడా మనసులోకి రానీకుండా అమ్మ చిన్నప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల, పరీక్షలైపోతున్నాయన్న సంతోషం కన్నా, ఉద్యోగం రాకపోతే నా పని గోవిందా అన్న భయమే ఎక్కువగా ఉండేది.

ఆ భయమూ, నా బద్దకమూ 24 గంటలూ చేతిలో చెయ్యేసుకుని జంటగా ఉండడం వల్ల, ఎప్పుడూ దేవుడిని బెదిరించడంతోటే నా చదువు మొదలెట్టేదాన్ని. "దేవుడా, నిన్ను నమ్మాలంటే నువ్వు నాకు నెల రోజుల్లో మంచి ఉద్యోగం ఇప్పించేయాలంతే" - ఇలాగన్నమాట! అయితే ఇలాగే గతంలో ఇంటర్లో ఒకసారి బెదిరించినప్పుడు దేవుడికి బాగ ఖోపం రావడంతో అది కాస్తా బెడిసికొట్టింది. ఈ అలకలూ అవీ మనకి బొత్తిగా అచ్చి రావన్న తెలివితేటలు నాలో కలిగి, ఇంజనీరింగ్‌లో బుద్ధిగా మొక్కుల్లోకి దిగిపోయాను.

ఫ్రెషర్స్ వరల్డ్ ను పగలూ రాత్రీ మొహమాట పడకుండా బట్టీ కొట్టి, ఏదో అదృష్టం నన్ను కౌగిలించుకోబట్టి, కాంపస్ సెలెక్షన్స్లో గట్టెక్కాను. 'హమ్మయ్యా' అనుకుంటూ హైదరాబాదు వచ్చి పడ్డాను.

కొత్త ఆఫీసు! కొత్త మనుషులు. మా కాలేజీ నుండి నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా సెలక్ట్ అయ్యారు. అందులో ఒకమ్మాయి నా ప్రాణ స్నేహితురాలు, హరిత. చదువుకునేటప్పుడు ఒకరి ఇంట్లో ఒకరం రోజుల తరబడి ఉండగలిగినంత స్నేహం కావడంతో, కలిసి వేరే ఊరు రావడం, మళ్ళీ కలిసి ఉద్యోగం చేయడం...భలే సరదాగా ఉండేది.

ఇంటి మీద బెంగా, మొట్టమొదటి సారి ఇల్లు వదిలి వచ్చాక బలవంతంగా మనకి మనమే చేసుకోవాల్సిన పనులూ పక్కన పెడితే, ఆఫీసులో మాత్రం మహా తమాషాగా ఉండేది. "ఆఫీసంటే ఇలానా ఉంటుంది?" అని ఆశ్చర్యంగా కూడా ఉండేది. ఎందుకంటే,చేరీ చేరగానే ఏదో పని చేసెయ్యాలన్న తాపత్రయం మా అందరిదీ! ఆ ఆత్రాన్ని,ఆవేశాన్ని ఎవ్వరూ పెద్దగా అర్థం చేసుకున్నట్టే కనపడేవారు కాదు. సీనియర్లెవ్వరూ మమ్మల్ని పట్టించుకోకుండా సీరియస్‌గా పని చేసుకుపోతుండేవాళ్ళు. మేనేజర్ల సంగతి సరే సరి! మా మొహం చూసిన పాపాన కూడా పోలేదా మహానుభావుడు!


ఆ తర్వాత ఒకరోజు ఆయన చావు కబురు చల్లగా చెప్పారు. మాకొక ట్రైనింగ్ ఉండబోతోందనీ..అది పూర్తయ్యేదాకా మాకు పొరపాటున కూడా పని ఇవ్వరని, మేము కొన్నాళ్ళిలా బలవంతపు "బెంచ్" పిరియడ్ అనుభవించి తీరాలనీ! నాకైతే కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువ. చచ్చీ చెడీ అన్ని రౌండ్‌లు పరీక్షలు రాసి, కాలేజీ చదువు పూర్తయ్యాక గట్టిగా నెల రోజులు కూడా ఖాళీగా గడపకుండా వస్తే, మళ్ళీ పరీక్షలనడం ఎంత ఘోరం! ఇదేం అవమానం అని కాసేపు గింజుకున్నా, గత్యంతరం లేదు కాబట్టి దానికి అలవాటు పడాలన్న నిర్ణయానికి వచ్చాం అందరం.

మా కంప్యూటర్ వాళ్ళు( నేను, హరిత, రమ్య, తపస్వి, సౌజన్య , హర్ష, సత్య, సతీష్, వంశీ ) , ఇంకా ఎలెక్ట్రానిక్స్ వాళ్ళు ( రఘుమిత్ర, సంతోష్, ఆదిత్య,రాఘవేంద్ర, రాజశేఖర్, సుబ్బు (సుబ్రహ్మణ్యం), విద్య, రోహిణి ..) దాదాపు అందరం కలిసే ఉండేవాళ్ళం.

ఆ కంపనీలో, ఎవ్వరూ అడుగు పెట్టని ప్రాంతం ఒకటి ఉండేది- అది లైబ్రరీ. ఆ లైబ్రరీకి పాపం ఒక నోరు లేని లైబ్రేరియన్. ఈ పని లేని జనాలందరికీ రోజు గడిచే మార్గం చూపించింది ఈ లైబ్రరీయే అని మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా!


మేమంతా, రెండున్నర దాకా ..అంటే, కేటరర్స్ గిన్నెలు సర్దుకుని వెళ్ళిపోయే దాకా డైనింగ్ హాల్లో కూర్చుని, ఏదో ఒకరకంగా కాలక్షేపం చేసి మరో రెండు నిముషాల్లో మమ్మల్ని తరిమే వారెవరైనా వస్తారు అనిపించగానే, ఆ లైబ్రరీకి వెళ్ళిపోయే వాళ్ళం.

సరే, రొటీన్ ఆటలు బాగా బోరు కొట్టేస్తున్నాయని, ఒక రోజు పాటలు పాడాలని నిర్ణయించుకున్నాం.

కొందరు అహింసావాదులు తమ గాన కళా చాతుర్యంతో జనాలను చంపడం ఇష్టం లేక, 'మేము పాడలేము' అంటూ మర్యాదగా పక్కకి తప్పేసుకున్నారు. పాడాలనీ..పాడకూడదనీ సంశయంతో మగ్గిపోయే మా హరిత లాంటి వాళ్ళేమో, 'అసలైతే నేను పాడతాను..కాని..ఇప్పుడు...ఉహు..ఇంత మందిలో..నో నో..' అంటూ హడావుడి చేసారు :). యధావిధిగా హరిత సంగతి తెలీని మిగిలిన వాళ్ళు బతిమాలుకున్నాక, "జస్ట్ హమ్ చేస్తానంతే!" అని చెప్పి ఏదో పాడేసింది. ఆ పాట కనిపెట్టే ప్రయత్నాల్లో మిగిలిన వాళ్ళు ఉండగానే, "వెయిట్" చెయ్యడం అస్సలు ఇష్టం లేని , సుబ్రహ్మణ్యం తన పాట మొదలెట్టేసాడు...'మాయదారి మైసమ్మో ..మైసమ్మా...'అని (అది కూడా డప్పు కొట్టుకుంటూ..). మేము అందరూ ముందు ఉలిక్కిపడి, ఆ తర్వాత ఆ లైబ్రరియన్ ఎక్కడ పరుగెత్తుకు వస్తాడో అని చచ్చేట్టూ టెన్షన్ పడి, ఆ ఫ్లోని కంట్రోల్ చేసే వృధా ప్రయత్నాలేవో చేసాం. ఈ సుబ్రహ్మణ్యం ఆ తర్వాత జి. స.రి.గ.మ లాంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాడుతున్నాడు. రేడియో మిర్చి వాళ్ళు నిర్వహించిన మరో కార్యక్రమంలో కూడా హుషారు పాటలతో హోరెత్తించాడు.

నన్ను ఎవ్వరూ పాడమనకపోయినా, నేను ఏ మాత్రం నిరాశ చెందకుండా, హరిత, సుబ్బు పాడగా నాకేంటన్న ధైర్యంతో, ఎవ్వరికీ తెలీని, ఆడియో తప్ప సినిమా విడుదల కాని ఒక దేవా సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట పాడాను.

ఇక మిగిలింది మా రఘు మిత్ర. అందరినీ బాధ పెట్టకుండా ఏడిపించడం లో అతను ముందుండేవాడు. అతను పాడతాను అనగానే మేము కూడా పోటా పోటీగా ఏదో ఒకటి వెక్కిరించడానికి వంక దొరుకుతుందనే ఆశతో హుషారుగా ముందుకొచ్చాం. ఉన్నట్టుండి, పాట మొదలెట్టాడు..." రెల్లు పూల పానుపు పైన.." అంటూ.. నిజంగానే నేను ఆశ్చర్యపోయాను..ఆ రెల్లుపూల వానలో తడిసిపోయాను. పాటలంటే సినిమా పాటలే అని ఊహించుకునే అజ్ఞానం నాదప్పట్లో.


"ఏ సినిమాలోది ఈ పాట" ఆ అబ్బాయి పాట పాడడం అయిపోగానే చప్పట్లు కొడుతూ అడిగాను.
'లలిత గీతం మానసా.., సినిమా పాట కాదు" నవ్వుతూ చెప్పాడు ఆ అబ్బాయి.

ఆ తర్వత "టీ" టైం అవ్వడంతో, మేము అందరం ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేసాం.
ఆ పాట మాత్రం చాల కాలం నన్ను వెన్నాడింది..అంత హాయి గొలిపే పాటలను అంత సామాన్యంగా మర్చిపోలేం. అనుకోకుండా నేను ఇంకో మంచి ఆఫర్ రావడంతో, ఆ కంపెనీని వదిలేసి వచ్చేసాను.

మొన్నా మధ్య అక్క హైదరాబాదు వచ్చినప్పుడు, కోటి విశాలాంధ్రలో ఏవో పుస్తకాలు కొనాలని నన్ను కూడా తీసుకెళ్ళింది. అక్కడ పుస్తకాలు తిరగేస్తుంటే, కృష్ణ శాస్త్రి సాహిత్యం- 4 కనపడింది. రాత్రి అక్క పిల్లలు కరుణించి నిద్రపోయాక - పరాగ్గా ఈ పుస్తకం పట్టుకుని పేజీలు తిప్పుతుంటే, "రెల్లు పూల పానుపు.." కనపడింది. మళ్లీ అదే వాన... రెల్లు పూల పానుపు పైన వెన్నెల వాన. ఇది కృష్ణశాస్త్రి గారు కురిపించిన జల్లు అని తెలిసి పట్టరాని ఆనందం కలిగింది. ( మరి అప్పటి దాకా నాకు ఆ ముక్క తెలీదు కదా..)

పాట సాహిత్యం ఇదీ :

" రెల్లు పూల పానుపు పైనా
జల్లు జల్లులుగా - ఎవరో
చల్లినా రమ్మా! వెన్నెల చల్లినా రమ్మా!

కరిగే పాల కడవల పైన
నురుగు నురుగులుగా -
మరిగే రాధా మనసూ పైన
తరకా తరకలుగా - ఎవరో
పరచీనారమ్మ! వెన్నెల పరచీనా రమ్మా!

కడిమి తోపుల నడిమి బారుల
ఇసుక బైళుల మిసిమి దారుల
రాసీ రాసులుగా - ఎవరో
పోసీనా రమ్మా - వెన్నెల పోసీనా రమ్మ! "

పాట నెట్లో దొరుకుందేమో నాకు తెలీదు. ఒక వేళ ఉన్నా మొదటి సారి కలిగినంత ఆనందం కలుగుతుందో లేదో అసలే తెలీదు. నాకు ఆ జ్ఞాపకాలే మధురాతి మధురం! కేవలం అదొక్కటే కాదు,

జీవితంలో ప్రతి క్షణాన్నీ, దానిలోని కొత్తదన్నాన్నీ ఆస్వాదించే ప్రయత్నం చేస్తే, ప్రతి అనుభవాన్ని భద్రంగా దాచుకోవాలనిపించేంత గొప్పగా మలచుకోగలిగితే, సంతోషం తప్పకుండా మనని వెదుక్కుంటూ వస్తుంది. ఆపై చిరునవ్వులన్నీ విడిచి పోనని మారాం చేసే చంటి పాపలై మనని చుట్టుకుపోతాయి.

Really, the secret is as simple as this -
"Joy is what happens to us when we allow ourselves to recognize how good things really are!"

Historic Times : అన్నా హజారేకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు

జాతీయ స్థాయిలో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న అహింసావాద పోరాటానికి, నిరాహార దీక్షకు మద్దతుగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి, "యూత్ ఫర్ బెటర్ ఇండియా" సంస్థ అనేక మంది పౌరులను భాగస్వామ్యులను చేస్తూ, హైదరాబాద్ నగరంలో రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తోంది.


ఏప్రిల్ 8వ తారీఖున, దోమల్‌గూడలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది పౌరులతో పాటు, శేఖర్ కమ్ముల (సినీ దర్శకులు), చుక్కా రామయ్య ( విద్యావేత్త), బాబూ రావు వర్మ ( స్వాతంత్ర్య సమర యోధులు), రామ కృష్ణ రాజు (రాష్ట్ర కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ. కాంపైన్) తదితర ప్రముఖులు సైతం పాలు పంచుకోనుండటం ముదావహం.



స్వాతంత్ర్య పోరాటం తదనంతరం, ప్రజలందరి లబ్ధికై జరుగుతున్న అతి పెద్ద ప్రజా పోరాటంగా మారుతున్న ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి బాధ్యత కలిగిన పౌరులందరూ సంపూర్ణ మద్దతు నందించాలనీ, తమ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యులై ముందుకు నడిపించాలనీ 'యూత్ ఫర్ బెటర్ ఇండియా' సంస్థ పిలుపునిస్తోంది.

అవినీతిని నిరోధించేందుకు, అంతమొందించేందుకు మనకున్న అమూల్యమైన అవకాశాన్ని చేజార్చుకోరాదనీ, ఈ పోరాటం ప్రజలందరి సహకారంతో మాత్రమే ముందుకు సాగగలదనీ విన్నవిస్తూ, పాల్గొనదలచిన వారిని , "యూత్ ఫర్ బెటర్ ఇండియా" వారి ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని తెలియజేసారు.

శశాంక్ - 9949648018 ; ఎలక్షన్ రెడ్డి - 9676360111
 
Venue : Indira park, Hyderabad
Time : 8 AM

ఆలింగనం


హోరెత్తిస్తున్న హారన్లు...ఆగకుండా అనౌన్సుమెంట్లు..
మనకంటూ మిగిలింది కేవలం మరికొన్ని క్షణాలు

గుప్పెట్లోని ముళ్ళ గులాబీలో అందం శూన్యం
ఆ చివరి ఆకుపచ్చ రెపరెపలకే మనసంతా భారం


విచ్చుకోని పెదవుల మౌనంలో మనసు విరహ గీతాలు 
చెమ్మగిల్లిన చూపులకటూ ఇటూ వేల ఊసుల ఉత్తరాలు   

వీడమంటూ మొండికేస్తూ ఐక్యమవుతున్న అరచేతులు
వసంతాలన్నీ వెలి వేసే వేదనతో రగులుతున్న ఎదలు

ఓపలేని ఒంటరితనాన కమ్ముకునే దిగులు తలపులు
రోజుల ఎడబాటూ వల్లకాదంటూ రాలిపడే కన్నీటిబొట్లు

కాలమిలా విషం చిమ్ముకుంటూ వెళ్ళిపోయేదే
వీడ్కోలులోని విషాదం ఉప్పెనలా ముంచి వేసేదే..

నువ్వైనా నాలుగు నవ్వుల్ని దోసిట్లో పోసి సాగనంపకుంటే
ఆఖర్లో ఆత్మీయ ఆలింగనం ఆసరాగా ఇవ్వక ఆగిపోయుంటే !!

ఆమె నవ్వాలి మళ్ళీ !


ఏకాంతపు కలయికలలో, కబుర్లలో తొలి అడుగులేసిన స్నేహం
శారద రాత్రుల కవ్వింపుల్లో కోరి పొడిగించుకున్న ప్రణయం
స్మృతి తిన్నెల్లో శాశ్వత ముద్రలేసే జ్ఞాపకాలయ్యాయో
పాల మనసును ముక్కలు చేసిన విషపు చుక్కలయ్యాయో

ఆమె ఎప్పటిలా నవ్వడం లేదిక
అన్నాళ్ళూ తోడొచ్చిన అల్లర్లూ, సందళ్ళూ లేవిక !

ఇప్పుడు మిగిలిందల్లా ..
కలసి పంచుకున్న క్షణాల నిట్టూర్పుల సాంగత్యమే!
కరిగిన వెన్నెల కల లాంటి ప్రేమలో నుండి,
మెలకువలోకి మెల్లగా జారేందుకు, ఎడతెరిపి లేని పోరాటమే!

ఇక ఆమెకు కావలసిందల్లా..
మోహపు ముసుగులు జార్చుకున్నాక
బయటపడే నిజ రూపాలను భరించగల్గిన నిబ్బరం!
భయపు వాకిళ్ళ నుండీ, బాధల సంకెళ్ళ నుండీ
రేపటి ఉదయాన్ని విముక్తురాలిని చేసి
సరి కొత్తగా స్వాగతించాలన్న సంకల్పమూ, స్థిర చిత్తమూ..!!

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...