రాగసాధిక

 ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్లలా నేనూ వస్తానని వెంటపడ్డాను. ఒకట్రెండు రోజులు రావాలంటే, ముందు పది రోజుల కోర్స్ పూర్తి చెయ్యాలన్నాడు.

వెబ్‌సైట్‌లో ఒక టిక్ మార్క్ కొట్టడమే కదా...అయిపోయిందని చెప్పి enroll చేసుకోనా అంటే తను చూసిన చూపు నాకిప్పటికీ గుర్తే.
"అబద్దాలు ఆడకూడదన్నది విపస్సన మొదటి నియమాల్లో ఒకటి. నువ్వు మొదలే కాని పని చేసి అక్కడకొస్తే, ఇంకేం నేర్చుకుంటావ్?" అన్నాడు. ఎప్పటిలాగే ఒక్కడూ వెళ్ళిపోయాడు.
తన నింపాదితనానికీ, మిన్ను విరిగి మీద పడుతోన్నా, ఏం కాదులెమ్మని నా వెన్ను నిమిరి తనిచ్చే భరోసాకి విపస్సన ఒక రహస్యమైన కారణం అనుకుంటాను కనుక, ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలి అని నాదో కుతూహలంతో కూడిన కోరిక. పది రోజులంటే అయ్యే పనేనా అని ఆగిపోతాను ఎప్పుడూ.
*
"మనుషులు కావాలి మనుషులు..." అని తపించినట్లుండే జాజిమల్లి గారు పది రోజులు అన్నీ విడిచి విపస్సన కి వెళ్ళారని చదవగానే నా ఆశ్చర్యానికి హద్దే లేదు. అనుకున్నపని చెయ్యడంలో ఆమె పట్టుదలను ఊహించగలను కానీ, అక్కడి నియమాలు తెలిసినదానిగా, ఎందుకు వెళ్ళాలనిపించిందో తెలుసుకోవాలనీ, పోనీ, వెళ్ళాక వారి అనుభవాలు, పాఠాలు ఎలాంటివై ఉంటాయో చూడాలనీ నాకు మరీ మరీ అనిపించింది. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న స్నేహితులు పడుకున్నాక, ఉండబట్టలేక పుస్తకం చదివేశాను.
**
ఎప్పుడూ చదవకూడదదు అనిపించే కరోనా కాలంలోని సందిగ్ధతలు, అప్పటి ప్రశ్నల దగ్గర, అప్పటి ఊపిరి పోరాటాల, ఒంటరితనాల ప్రశ్నలు కదలాడిన పేజీల్లో నుండి ముందుకు సాగిన రచన ఇది. కాబట్టి, ఈ పుస్తకం చాలా వ్యక్తిగతమైన ప్రయాణం. బరువైన ప్రయాణపు అనుభవం.
"ఇందుకోసమే బతుకుతున్నాను అని యావగా బతుకుతున్న విషయాలు కూడా బలమైన సంశయంలో పడేవి. ఉనికి సమస్తమూ విశ్వాస, అవిశ్వాసాల నడుమనేనా అన్న అనుమానం కలిగేది.
నా జీవాభినయం మీద నాకే నవ్వు కలగడం - బాధ, భయం, కోపం, ద్వేషం ఏమీ కాదు - జస్ట్ ఆశాభంగం, నిరుత్సాహం. ఇంతేనా, ఇంకా ఏమైనా తీవ్రత ఉందా.."
నేను అనే ఏకాకితనంలోని గాఢతను, దాని తాలూకా నలిబిలిని ఏ భేషజాలూ లేకుండా విప్పుకుపోయిన ఈ మొదటి పేజీల దగ్గరే నాలో చెప్పలేనంత అలజడి మొదలైంది. ఎదుర్కునే ఆసక్తి లేక తప్పించుకు తిరిగే ప్రశ్నలేవో, ఒక ఇరుకైన దారిలో మనకి ఎదురుపడుతున్నప్పుడు, తప్పించుకునే వీల్లేనప్పుడు, లోపల నుండి కమ్ముకొచ్చే ఇబ్బందీ, అసౌకర్యం నన్ను చుట్టుముట్టాయి. కోరుకునేవాటికీ, అవసరమైనవాటికీ మధ్య గీత గీయడం మనకి తెలియక కాదు, ఆ గీతను చెరిపేసుకుని అటూ ఇటూ దూకగల స్వేచ్ఛ, అందులోని స్వార్థం కొన్ని గీతలను బలంగా గీయనివ్వవు. ఉన్నా చూడనీయవు. ఏదో ఒక వేడి, పొగమంచులాంటి ఆ స్వార్థాన్ని కరిగించి గీతని బలపరిచి చూపించినప్పుడు, భయంతో కళ్ళు మూసుకోవాలనిపించే స్థితి వస్తుంది. ఈ పుస్తకం మొదలెట్టినప్పుడు నాకట్లాంటి ఇబ్బంది.
ఒక స్నేహితురాలు తోడు ఉందని ముందు సంతోషంగా ఒప్పుకోవడం, చివరికి ఎవ్వరూ రాక, నా అన్న మనిషి పక్కన ఊరికే కనపడుతూ ఉన్నా దొరికే భరోసా కూడా దూరమై -ఒక్కతే వెళ్ళాల్సి రావడం ఈ ప్రయాణపు, అనుభవపు టోన్‌ని స్థిరపరిచాయి అనిపించింది.
ఈ పుస్తకంలోని కొన్ని మాటలు ఎదుటి మనిషిని నిలువునా చీరేసే నిజాయితీ తో రాసినవి. మొదటిది ఇక్కడికి వచ్చిన కారణం అని పైన రాశాను కదా. రెండవది, రాత్రి ఏ ఝాముకో నిద్ర పోయిన కళ్ళతో బయటకొచ్చినప్పుడు, ఓ సీనియర్ సాధిక అధికారం చూపించడానికి ప్రయత్నించే సందర్భం. "వలచి వేసుకున్న సంకెళ్ళే" అయినా సరే, మనిషికి తనవైన కొన్ని ఇబ్బందులూ, బలహీనతలూ ఉంటాయి. ఎంత ఏరికోరి ఎవరితోనూ సంబంధం లేని జీవితం వైపు అడుగులేసినా, ఎదుటి మనిషి పట్ల అక్కర చూపించకుండా మాట్లాడే మనిషి పట్ల వెగటు ఓపలేనిదే అయిపోతుంది. అది క్షణికమే కావచ్చు, "ఆమెకు తెలిసింది అదీ" అనుకోగల నెమ్మదితనం మళ్ళీ రావచ్చు, కానీ ఆ క్షణాల భంగపాటు గురించి మాట్లాడటం నావైన ఎన్నో అనుభావలను గుర్తు చేసింది. తర్వాతి నా ఒప్పుకోలు, పశ్చాత్తాపాలు కూడా.
ఇక మూడవది, భోజనం. ఈ పుస్తకంలో తిండి ప్రస్తావన ఉన్న ప్రతిచోటా, ఒక నొప్పి కూడా ఉంది. దొరికిన దాని పట్ల తృప్తి కన్నా ముందు వినమ్రత కావాలి అనిపించే అనుభవాలు. కొందరిళ్లల్లో భోజనాల దగ్గర, వడ్డనల్లో అహంకారం తప్ప ఏమీ కనపడని గుణం ఉంటుంది. ఆపాటి ప్రదర్శన గురించిన ఆలోచన కూడా లేనంత లెక్కలేనితనం కూడా కొందరి దగ్గర ఉంటుంది. వంద రకాల వంటకాలతో భోజనాలు పెట్టందే నామోషీ అనుకునే జనాభా పెరిగిన ఈ కాలంలో, ఇలాంటి అనుభవం ఏదో ఒకరకంగా కంటపడని వాళ్ళు అరుదే.
అంత వేలంవెర్రితనం లో నుండి పక్కకొచ్చి, అగ్గి చారికలు రాచుకున్నట్టు, నిప్పులు కుమ్మరించినట్లు ఒళ్ళంతా మంటలు రేగుతుంటే, కప్పు పెరుగు కోసం చేయి చాచినప్పుడు, "పర్మిషన్ తెచ్చుకోండి" అన్న మాట వినడం ఎలా ఉంటుందో ఊహించగలం కదా!
"పది రోజుల కాలాన్ని తరచి చూసుకుంటే భిక్షా పాత్ర నిండుగా ఊపిరి గట్టిగా పీల్చి వదిలిన నిట్టూర్పులే కనపడతాయి" అని రాశారు.
ఆ వాక్యం దాటి పోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది.
**
జాజిమల్లి గారి వచనం దేన్నైనా గాఢంగా అనుభవించిన పలవరింతలా ఉంటుంది. కాబట్టే ఇంత బరువైన పుస్తకం కూడా కొన్ని కొన్ని అపురూపమైన వర్ణనలతో మెరిసి ఆ బరువును కాస్త కాస్తగా తగ్గించింది.
"దూరం నుంచి జాయిగా వచ్చే గాలి రివ్వ - అన్ని వందల కొబ్బరిచెట్ల ఆకులను గలగలలాడిస్తూ మా నెత్తి మీదుగా దాటి పోయేది. గాలీ చెట్లూ కలిసి చెట్టాపటాలాడితే అంత సంగీతం పుడుతుందని నాకేమి తెలుసు!
తెలిసి ఉన్నా కూడా మరెన్నో నిర్మిత శబ్దాల ముందు ఆ జ్ఞాపకాన్ని పారేసుకుని ఉంటాను."
లాంటి అక్కడి ప్రకృతికి సంబంధించిన గమనింపులతో పాటు, శరీరం లోని సూక్ష్మ సంవేదనలను విపస్సన ద్వారా గుర్తిస్తూ, ఆ అనుభవాల గురించి మాట్లాడినప్పుడు, "ముక్కు నుండి మెల్లగా వదుల్తున్న గాలి, పై పెదవి మీది పలుచని నూగూరు మీదుగా వీచినప్పుడు, వరి పైరుని అల్లల్లాడించే గాలి తరగ స్పురించేది" అనడం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఉప్మా, వేడి జావల ఒక ఉదయపు ఉపాహారాన్ని గురించి రాస్తూ,
"ఆస్వాదిస్తూ తినడం తెలిసి కూడా వేగం, వడి, అలసత్వాలలో పడి మనం పోగొట్టుకున్న ఒక జీవనకళని దాని నిజ అర్థం లో అనుభవించాను" అనడం కూడా పుస్తకంలో చదువుతున్నప్పుడు, ఆ నిండైన అనుభవానికి అలవోకగా దగ్గరకు తీసుకెళ్ళింది.
**
ఈ పుస్తకం నేను చదవాలి అనుకోవడానికి ముఖ్యమైన కారణం, అనిల్ దగ్గర విన్నది ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడం కోసం. విపస్సన మొదలెట్టగానే (తీసుకునే ఆహారంతో సంబంధం లేకుండా), సంవేదనలు బయటపడుతూ ఉండటం వల్ల ఒక రకమైన వేడి మొదలవుతుందని నేను విని ఉన్నాను. అలాంటివి, ఆలాంటి ఇంకొన్ని, కొన్ని వేరే రకాలైన వివరణలతో ఈ పుస్తకంలో చూడటం ఆసక్తిగా అనిపించింది.
కానీ, పుస్తకం చదివాక మళ్ళీ నాకు నేను గుర్తుగా చెప్పుకుంటున్న మాట మాత్రం, వినమ్రత. humbleness. అది ఎందుకు, ఎప్పుడు, ఎలా అంటే, ఈ పుస్తకం చదివితే కొంత అర్థమవుతుంది. నిద్రపట్టని రాత్రుల్లో, కిటికీ ఊచల్ని చూస్తూ స్వేచ్ఛను పణంగా పెట్టిన పోరాట యోధులను గుర్తు చేసుకున్న క్షణాలను చదివినప్పుడో, పది రోజులు భిక్షాపాత్రను చేతుల్లో ఉంచుకున్న అనుభవాన్ని గురించో ఈ పుస్తకంలో చదివినప్పుడు, అది ఎంతో కొంత స్థాయిలో అవగతమవుతుంది.
ఈ పుస్తకం చదివితే విపస్సన కి వెళ్తామనో, విపస్సన సూత్రాలు అర్థమవుతాయనో, అవలంబిస్తామనో చెప్పను. కానీ, ఈ మార్గంలో వెళ్ళిన ఓ మనిషి రాసిన అనుభవాలు లోపల కలుగజేసే అలజడీ, ప్రశ్నలు, చెల్లాచెదురు ఆలోచనలు ఏదో ఒక స్థాయిలో చదువరుల ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తాయని అనుకుంటున్నాను. ఆ ఆలోచనల మీదకి దృష్టి వెళితే, స్పష్టత కోసం ఎవరికి అవసరమైన మార్గం వాళ్ళకు ఎదురొస్తుంది. రాగద్వేషాలకు అతీతులమై ఉండటం, అదుపులో ఉంచుకోవడం, రెండూ కష్టమే. "but you can try.." అని గాంభీర్యం, మెత్తదనం జమిలిగా పెనవేసుకున్న గొంతుతో భరోసాగా పలికే పుస్తకం ఈ "రాగసాధిక".
No photo description available.
All reactions:
Somasekhararao Markonda, Vadrevu Ch Veerabhadrudu and 81 others

ప్రేమ

అనిల్‌తో స్నేహం మొదలయ్యాక, సాయంత్రమవగానే స్కూల్ గంట విన్నంత గుర్తుగా ఆఫీసు నుండి పారిపోయి వచ్చేసేదాన్ని. దాదాపు ఆర్నెల్లు. దాదాపు ప్రతిరోజూ. గచ్చిబౌలి నుండి నేనూ, అమీర్‌పేట్ నుండి తనూ. ఎప్పుడైనా పొరబాటున నాకు ఆఫీసులో లేట్ అయ్యేట్టు ఉంటే, తను సరాసరి ఆఫీసుకే వచ్చేసేవాడు. "ఎక్కడున్నావూ..." అని సెక్యూరిటీని దాటుకుని బయటకొస్తూ నే ఫోన్ చేస్తే, తన పల్సర్ లైట్ల వెలుగు నేను నడిచే దారంతా పరుచుకునేది. ఎండల్లో వానల్లో ఆ గచ్చిబౌలి కొండరాళ్ళ రోడ్లల్లో, చీకట్లో వెన్నెట్లో, కాలం, లోకం పట్టనట్టే తిరిగాం. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు తల్చుకున్నా, ఆ రోడ్ల దుమ్మూ ధూళీ ట్రాఫిక్ అలసటా ఏమీ గుర్తు రావు. హెల్మెట్ లో నుండి తను చెప్పే మాటల కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ముందుకు వంగి విన్న క్షణాల మైమరపు తప్ప. నా అంతట నేనే ఇంటికొచ్చే రోజుల్లో, కొండాపూర్ షేర్ ఆటోల్లో నుండి కొత్తబంగారులోకం పాటలు వినలేని గొంతులతో వినపడుతూండేవి. ఎంత రభసలోనైనా "ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం..." అన్న మాటల మేజిక్‌ని మాత్రం తప్పించుకోలేకపోయేదాన్ని.

అనిల్ ఇంటి దగ్గరకొస్తే, బైక్ ఆ వీధి మొదట్లో పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎంత దూరమైనా. ఆ వీధి చివరి ఇంటి కాంపౌండ్ వాల్ నుండి మెట్ల మీదుగా ఎన్ని పూల తీగలుండేవో! రాత్రిళ్ళు ఆ పక్కకు వెళితే ఏవేవో పూల పరిమళాలు కలిసిపోయి మత్తుగాలి పీలుస్తున్నట్టు ఉండేది.
ఇంటి చుట్టూ బోలెడు గుడులూ, పార్క్‌లూ రెస్టారెంట్‌లూ ఉండేవి. అనవసరంగా ఆ డిన్నర్‌లలో బోలెడుబోలెడు డబ్బులు తగలేశామని ఆ తర్వాత్తర్వాత - అంటే పెళ్ళయ్యాక అనిపించేది :)) కానీ ఆ పేపర్ నాప్‌కిన్‌ల నిండా ఎన్ని ప్రేమ సంతకాలు! హోటెల్ స్టాఫ్ వచ్చి తలుపులేసుకోవాలి మీరిక కదులుతారా అన్నట్టు పక్కకొచ్చి నిలబడితే, ఆ మసక వెన్నెల రాత్రుల్లో అడుగూ అడుగూ కొలుచుకుంటునట్టు నింపాదిగా నడిచి ఎప్పటికో ఇల్లు చేరేవాళ్ళం. హైదరాబాద్ రద్దీ రోడ్లన్నీ ఖాళీ అయి, రాత్రి గాలి చల్లదనం అనుభవానికొచ్చే ఘడియల్లో, వీధి లైట్ల పసుపు వెలుతుర్లో నిలబడి, చూపుల నిండా పరుచుకున్న ఇష్టాన్ని చదువుకోవడం ఆ కాసిన్ని రోజుల్లో ఎవ్వరూ భగ్నం చెయ్యని వైభవం.
"రోజూ అంతలేసి సేపు ఏం చెప్పుకుంటున్నారు?" అని కుతూహలంగా స్నేహితులూ, కాస్త భయంభయంగా ఇంట్లో వాళ్ళూ ఆరాలు తీస్తూనే ఉండేవాళ్ళు. ఏమో ఏమని చెప్తాను, ముందూ వెనుకా లెక్కా వరుసా ఏమీ పట్టని మైకం.
"నాకు పది పన్నెండేళ్ళు ఉన్నప్పుడే నువు పరిచయమైతే ఎంత బాగుండేదీ?" అని ఎన్నో సార్లు అనేదాన్ని అనిల్‌తో.
పెళ్ళైన ఎన్నాళ్ళకో ఓ సారి ఒప్పుకున్నాడు. "కనీసం పదేళ్ళ కబుర్లు వినే పని తప్పేది నాకు" అంటూ.

చిన్న చిన్న సంగతులు - శ్రీనివాస్ గౌడ్

 "ఎంత సమ్మోహనంగా

అన్నావు ఆ మాట
...
మాట అంటున్నప్పుడు
నీ మొకం చూడాలని
మహ కోరికగా ఉండింది
ఇష్టం తొణికిసలాడే
ఆ కళ్ళవెన్నెల్లో తడవాలని
ప్రాణం కొట్టుకలాడింది"
కొన్ని కవితలు ఒక్క పదంతోనే పాఠకులను లోబరుచుకుంటాయి. ఇలాంటి కొన్ని కవితలు మాత్రం అవి అల్లుకునే తీరుతో పాఠకులను ఒక నూత్న ఆవరణలోనికి తీసుకునిపోతాయి. "కాంక్షాజలం" జల్లుజల్లుగా కురిసినట్టుగా ఉన్న ఈ కవిత, శ్రీనివాస్ గౌడ్ గారి చిన్న చిన్న సంగతులు కవితా సంపుటిలోనిది.
ఇంతకీ, ఆమె ఏమంది?
అది చెప్పడు కవి. అదే కాదు, ఇదొక ఫోన్ సంభాషణ నేపథ్యంలోని కవిత అని కూడా చెప్పడు. ఆమె ప్రియమైన మాటేదో ఇష్టాన్నంతా మూటగట్టి చెప్పింది. బహుశా అది ఎదురూగ్గా చెప్పేందుకు ధైర్యం చాలని మాట. లేదూ చెప్పబోయినా సిగ్గులు పరిచే మాట. అదేమైనా కానీ, ఈ కవిత పూర్తి పాఠం చదివితే ఆమె సొలపు చూపులేవో కళ్ళకు కడతాయి. హృదయంగమమైన మాట ఎన్నిసార్లు విన్నా తమితీరదనుకునే ఆతని ఆకాంక్షా అర్థమవుతుంది. నిజానికామె అన్న ఆ మాటేమిటో పాఠకులకు తెలియనివ్వకపోవడంలోనే అవధుల్లేని అందముంది. ఊహాసీమల హద్దులు చెరిపే రాసిక్యత ఉంది. అదే ఉదాహృతమైన ఈ కవితకు ప్రాణంగా నిలబడగల లక్షణమైంది.
*
"అడివంచున విశ్రాంతిగా పడుకుని ఉండే సాధు నిశ్శబ్దాన్ని" కవిత్వంలోకి తీసుకురాగల కవులు అరుదు. ఆ నిశ్శబ్ద సౌందర్య రహస్యాన్ని కొంత కొంతగా చాలా కవితల్లో చొప్పించారు శ్రీనివాస్. నూరు కవితలున్న ఈ సంపుటిని చదువుతున్నంతసేపూ ఒక స్పష్టాస్పష్ట భావమేదో నా లోపల సుళ్ళు తిరుగుతూనే ఉంది. చివరి కవితల్లో ఒక చోట,
A human made out of
Thousands of humanbeings అన్న మాటలు చదివాక, ఆ భావానికో రూపం దొరికింది. Ubuntu. ఇది, I am because we are అని గుర్తుంచుకోమనే ఒక ఆఫ్రికన్ నినాదం, ఆదర్శం, సందేశం. ఆ తత్వం అర్థమైన మనిషి, పోటీ తత్వాన్ని ఆవలికి నెట్టి, సాటి మనిషికొక ఆసరా అవుతాడు. తోటి మనిషి నుండి ఏ రకమైన ఆపదని ఊహించుకోనక్కర్లేని భరోసాతో వాళ్ళ విజయాలకు పొంగిపోతాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరు దుఃఖితులై ఉన్నా, తాను సంతోషంగా మనలేనన్న ఎఱుకతో ఉంటాడు. ఒడ్డున నిలబడి రాయి విసిరినప్పుడు కొలనంతా అలలు పరుచుకుంటున్నట్టు, మన ప్రతి పనీ ఎవరినో ఎక్కడో తాకనుందన్న స్పృహ నరాల్లో నిండుకున్న మనిషి ప్రవర్తించే తీరు ఊహించలేనిదేం కాదు కదా! అది ఒక సామూహిక సంస్కారమైనప్పుడు, శ్రీనివాస్ రాసినట్టు, మనిషిగా నేనూ కొన్ని వేల మంది మిశ్రమం అన్న స్పృహ కలుగుతుంది. జీవితం పట్ల కృతజ్ఞత మొదలవుతుంది. చేసే పనులు ఏవైనా వాటి తక్షణ ఫలితాల మీద వ్యామోహం వదిలిపోతుంది. తడి విత్తనం పాతేసి వెళ్ళిపోవాలనీ, ఆకుల నీడలో ఎవరు విశ్రమించనున్నారో అనవసరమనీ చదివినప్పుడు- పేరుదేముంది కానీ - ఈ కవి తత్వం ఇలాంటిదేనని బోధపడుతుంది. ఒక పదంలోనో పాదంలోనో కాదు, ఒక స్ఫూర్తిగా పుస్తకమంతా ఆవరించుకున్న భావమిది. మనుషుల్ని, ప్రకృతిని చూసిన పద్ధతిలోనూ, తలుచుకున్న పద్ధతిలోనూ, ఎందరో కవులని ఇష్టంగా acknowledge చేసిన పద్ధతిలోను ప్రేమ, గ్రాటిట్యూడ్‌లతో పాటుగా, మనిషంటే ఎందరెదరి ప్రభావాలనో ప్రోది చేసుకుని తనదైన వ్యక్తిత్వంతో పునరుజ్జీవమవడమేనన్న స్పృహ బలంగా కనపడటం వల్లేనేమో బహుశా, ఈ సంపుటి చదువుతుంటే నాకు UbunTu గుర్తొచ్చింది.
**
శ్రీనివాస్ గారూ, మిమ్మల్ని తల్చుకుంటే మీ కన్నా ముందు మీ కవిత్వం గుర్తు రావాలని ఆశపడ్డారు. నాకేమో "కవిత్వం రాయడం తేలిక కాదు, సరదా కాదు", అంటూ
"రాసిందాకా తుఫాను హోరులో వణుకుతున్న ఇసుక గూడు" లా ఉండే ఒక రూపం గుర్తొస్తుంది. అది మీరా, మీ కవిత్వమా!

అక్క

 ఇంట్లో రెండో వాళ్ళుగా పుడితే వాడేసిన పుస్తకాలు, వదిలేసిన బొమ్మలు బట్టలు వస్తాయని నా చిన్నప్పటి నుండీ వింటున్నాను. కానీ నాలా నాలుగున్నరేళ్ళ తేడాతో పుడితే సిలబస్ మారిపోయి క్లాసు పుస్తకాలు పనికి రావు! బొమ్మలేమో మా ఇద్దరికీ పడవు మొదటి నుండీ. దానికి పుస్తకాలు కావాలి. నాకు మనుషులు, ఆటలు కావాలి. ఇద్దరం ఎవరి ప్రపంచాల్లో వాళ్ళు ఉండేవాళ్ళం.

మా వాడు బడికి వెళ్ళడానికి మంకు పట్టినప్పుడల్లా, మా అమ్మకి దిగులుగా చెప్పుకుంటాను. అమ్మ మాత్రం నా గొడవ పక్కన పెట్టేసి "నువ్వసలు ఏడ్చే దానివి కాదే. అక్క వెనుక పడి సంబరం సంబరంగా వెళ్ళిపోయేదానివి" అని సంతోషంగా గుర్తు చేసుకుంటుంది.
ఒక్క బడేమిటి, అది ఎక్కడికి వెళితే అక్కడికి వెంటపడేదాన్ని. అదేమో రావద్దనేది. చెప్పుల్లేకుండా చింపిరి జుట్టుతో దాని వెనుక వెళ్తే, చిరాకుపడిపోయేది. వాళ్ళ స్నేహితులు "పోన్లే మధూ" అంటూ నన్ను బుజ్జగించబోతే మొహం గంటు పెట్టుకుని పక్కకు వెళ్ళిపోయేది.
కోతి పిల్లలా అదేం చేస్తే అది చేసేదాన్ని. ఏమంటే అది అనేదాన్ని. అది వింటోందనే పాటలు వినేదాన్ని. అది చెప్పాకనే ఇళయరాజాని కనుకున్నదాన్ని. రాత్రిళ్ళు రేడియో చెవి పక్కన పెట్టుకుని అది వినే పాటల కోసం, దాని దుప్పట్లో దూరేదాన్ని. అది తింటోందనే అరిటాకు కంచం నాకూ కావాలని పేచీలు పెట్టేదాన్ని.
అది ఏం చేస్తుందో చూద్దామనే లైబ్రరీకి వెళ్ళాను ఆరేడేళ్ళప్పుడు. ఎందుకు చదువుతోందో చూద్దామనే పుస్తకాలు పట్టుకున్నాను. శ్రీపాద సాహిత్యాన్ని కథలు కథలుగా నాకు చెప్పిందదే. అత్తగారి కథలు చూపించిందీ అదే. మీనా సెక్రటరీ అదే ఇచ్చింది. దానికి గుర్తుందో లేదో కానీ, అమృతం కురిసిన రాత్రిని నా దోసిళ్ళలో పెట్టిందదే. బుక్ ఫెస్టివల్ వస్తోందంటే రూపాయ్ రూపాయ్ దాచుకునే దాని శ్రద్ధ చూసే పుస్తకాలు విలువైనవని నమ్మాను. ప్రతి వ్యాసరచనలోనూ మొదటి బహుమతి తెచ్చుకునే దాన్ని చూసే రాయడంలోని ఉత్సాహాన్ని పట్టుకున్నాను.
కొట్టడం అదే నేర్పింది. actually, కొరకడం కూడా అదే నేర్పింది. 🙂 వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళినందుకు ఛెడీ అంటే ఫెడీ మని కొట్టారు. ఏం పిల్లలే బాబూ, పాడు పిల్లలు అని మా అమ్మను తిట్టేది మా పెద్దమ్మ. "అది నీకు చెల్లెలే, బక్కది; అక్క మాట వినాలని తెలీదూ; పొద్దస్తమానం వెధవ తగాదాలూ మీరూనూ" అంటూ ఇద్దరినీ కలిపి ఒకేసారి దులిప్పారేసేది మా అమ్మ.
పరీక్షలప్పుడు నేను నిద్రకు తూలిపోతే, చప్పుడు చెయ్యకుండా అమ్మనీ, నాన్నగారినీ పిలుచుకొచ్చి చూపించేది. నేను పారబోసిన పాల మరకలు ఎండిపోక మునుపే అమ్మని పిలిచి చూపించి నా వీపు పగిలేలా చేసేది. నేను దాచేసిన పరీక్ష పేపర్లు తెల్లారేసరికి మా అమ్మ ఒళ్ళో ఉండేవి. నా స్నేహాల మీద ఓ కన్ను. నా అల్లర్ల మీదో కన్ను.
అంత తగాదాల్లో నుండి, మా అంత చిన్న ఇంటినీ మాటల్లో చెప్పలేనంత భయపెట్టేంత పెద్దది చేస్తూ, అది మెడిసిన్ చదవడానికి వెళ్ళిపోయింది. నేనేమి చెయ్యాలీ?
పిచ్చిది, నా పేరు మీద ఉత్తరం రాసేది. ఇన్లాండ్ కవర్ అంచులు విడదీసి చదువుతూ చివర్న "ప్రేమతో, అక్క" అని చూడగానే కళ్ళ నుండి జలజలా నీళ్ళు కారిపోయేవి. ఉత్తరాలు రాయడం అలా అలవాటైన విద్యే. Archies గ్రీటింగ్ కార్డ్‌ సొగసు దాని వల్లే తెలిసింది. వచ్చిన డబ్బులతో పొదుపుగా ఉండడం కూడా మాటల్లో కాదు కానీ, అదే నేర్పింది. చదువుకు తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా అడిగేది కాదు ఇంట్లో.
నా స్నేహితులందరికీ హీరో. అక్క చదువుకునే పద్ధతి చూస్తే అర్జంటుగా పుస్తకాలు తీయాలనిపిస్తుంది అనేవాళ్ళు. అంత చదువుకుంటూ మనకీ ఏమైనా చేసి పెడుతుందే, అక్క ఎంత మంచిదీ, అనేవాళ్ళు. స్టైఫండ్‌లో నుండి నెల నెలా నాకు వంద రూపాయలు ఇచ్చేది. అంత డబ్బు ఏం చేసుకోవాలో నాకు మాత్రం ఏం తెలుసు, నాన్నగారికి నెలాఖరుకి అప్పిచ్చేదాన్ని. హవేలి రెస్టారెంట్‌కి మొదట తీసుకెళ్ళింది కూడా అక్కే.
పెళ్ళి సంబంధం అడిగితే "మాధవిని అడిగి చెప్తాను" అన్న మా నాన్నగారి మాట అప్పట్లో గొప్ప ఆశ్చర్యం. అక్కా బావల పెళ్ళి కుదిరాకా, " You two continue to be good friends and focus on your studies అన్న మా నాన్నగారి ఉత్తరం కాపీ తీసుకుని దాచుకున్నాను. "ప్రైవేట్ లెటర్స్ ఇలా కాపీలు తీయించుకుంటున్నావ్, బుద్ధి లేదూ" అని కేకలేస్తే, ఇంకో నాలుగేళ్ళకి నాకూ ఇదే మాట చెప్పాలి కదా అనేదాన్ని.
దాని చదువూ అంతే. పి.జి ఎంట్రెన్స్ అది కోరుకున్న రేడియోలజీ రాలేదని వచ్చిన సీట్లన్నీ వదిలేసింది. మళ్ళీ రాస్తే ఇవన్నీ అయినా వస్తాయో రావో అని అమ్మ కంగారు పడింది కానీ, నాన్నగారు మాత్రం " అదంత ఇష్టంగా, నమ్మకంగా చదువుతా అంటోంటే వెనక్కి లాగకూడదు; అయినా దాని చదువు, దాని ఇష్టం" అని సర్ది చెప్పారు. కోరుకున్నది సాధించుకుంది. పై చదువుల నిర్ణయం నా చేతుల్లోనే అని అంత ముందే తెలిసిపోవడం ఎంత రిలీఫ్!
రిపీటెడ్ లాసెస్ తో ప్రెగ్నెన్సీ లో చాలా భయపడిపోయాన్నేను. పిలిచి విజయనగరం లో తన ఇంట్లోనే ఉంచుకుంది నన్ను. అన్ని స్కాన్‌లూ అదే చేసేది.
"జెండర్ చెప్తావా?" స్కానింగ్ చేయించుకుంటూ బతిమాలాను.
"దేనికి?"
"జస్ట్ ఊరికే. అమ్మాయైతే లలిత చదువుకుంటాను. అబ్బాయైతే విష్ణుసహస్రం.."
" పొద్దునొకటి సాయంత్రమొకటీ చదువు, ఎవరో ఒకళ్ళు పుడతారు"
"చెబితే నీ సొమ్మేం పోతుంది? నాకు ఎవ్వరైనా అపురూపమే కదా"
"కదా"
"మరి చెప్పు"
"జైల్లో పెడతారు నిన్ను. ఇంటికి పో, డ్రైవర్ బైటే ఉన్నాడు" జెల్ తుడుచుకోమని టిష్యూలు చేతిలో పెట్టింది.
మొండి మొహం....గింజుకుంటూ, లేచాను.
*
మొన్న ఐదారు రోజులు తమిళ్నాడులో అమ్మా నాన్న, అక్కా బావలతో కలిసి ఉన్నా. రవ్వదోశ, పొంగల్ సగం సగం పంచుకుని తిని, 1/2 కాఫీ తాగడం దాకా; అమ్మ కొన్న ఒకే రంగు చీరలు కట్టుకుని, మిడ్ లైఫ్ క్రైసిస్ నిజమా కాదా అని ముచ్చట్లాడుకునేదాకా, ఉండాలబ్బా, ఉండాలి. జీవితానికో అక్క. ❤️
*

చామంతి పూల తోటలో

 అలా నిన్న సాయంత్రం అనుకోకుండా ఆ చామంతి పూల తోటకి వెళ్ళాం. అసలైతే నాకు సెలవు కూడా లేదు. కానీ అనిల్ కీ, పిల్లాడికీ ఉన్నాక -నాకు ఆఫీసున్నా సుఖం ఉండదు. వాళ్ళ పోరు పడేకంటే సెలవు చీటీ రాసేస్తేనే నయం నాకు. ఏమాటకామాట. వారం మధ్యలో సెలవు వచ్చినా, పుచ్చుకున్నా భలే మజా. కె.ఆర్ పురం లో పని ఉందని అటు వెళ్ళిన వాళ్ళం, మధ్యలో నా కాలేజ్ స్నేహితురాలు దీప్తిని కలిశాం. నాకు చామంతి పూల తోట చూడాలని ఉందని చెప్పి అందరినీ బయలుదేరదీశాను. దారి మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళాలో చెప్పమంటారు. కానీ నాకు దొడ్డబళ్ళాపూర్ పేరు తప్ప ఇంకేమీ తెలియదు. అది కూడా రమ గారు అనడం వల్ల. అనిల్ కాబట్టి నువ్వు వెళ్దామంటే ఎక్కడికో కూడా తెలీకుండా వస్తున్నాడు, మా ఇంట్లో అయితే ముందు అడ్రెస్ కనుక్కు రమ్మని కూర్చోబెట్టేస్తాడు అని దీప్తి నస పెడుతూనే ఉంది కార్‌లో ఉన్నంతసేపూ. ఏం చెయ్యను. ఈ రెండు వారాలు గడిచిపోతే చామంతి పూలు దొరకవని నా బెంగ. సరే, కార్ ఎక్కగానే పడి నిద్దరోయే నేను, నిన్న మాత్రం అదే పనిగా అన్ని దిక్కులూ వెదుక్కుంటూ కూర్చున్నాను. ఊరు దాటి పల్లె గాలి తగిలిందో లేదో...రోడ్డు కి దూరంగా...పసుప్పచ్చ చారికలా కనపడింది. ఎంత సంబరమైందనీ...!!

అంగలుపంగలుగా సన్నటి మట్టిరోడ్డు లో నుండి ఆ తోటల వైపెళ్తే...ఓహ్! ఓహ్! తెలుపు, పసుపు చామంతి పూవులు...అట్లా చిన్న మచ్చైనా మరకైనా లేకుండా విరబూసి ఉన్నాయి. ఎంతందం ఈ పూలది అనిపించని క్షణం లేదు అక్కడ ఉన్నంతసేపూ. పిల్లలు యథేచ్ఛగా తిరిగారు ఆ తోటంతా. తొడిమలు తీసి రేకులు గాల్లోకి ఎగరేసి అడుకున్నారు. బెండ మళ్ళు ఉంటే అక్కడి లేత కాయలను ముట్టుకుని గరుకుగా గుచ్చుకుంటున్నాయేంటీ అని గంతులేశారు. గులాబీ తోటల్లో పూవులను వదిలేసి అక్కడి ముళ్ళ పొడవూ వెడల్పూ కొలుచుకున్నారు. పెద్ద పెద్ద చేపలు తిరుగాడుతున్న నీళ్ళ తొట్టె చుట్టూ చేప పిల్లల్లానే తుళ్ళిపడ్డారు. మా దీప్తి దసరాల్లో అయినా రాకపోతిమి, బోలెడు పూలు కొనుక్కు వెళ్ళేవాళ్ళం అని బెంగపడి, అక్కడ పూలు సంచీలకెత్తి వెళ్ళిపోతున్న వాళ్ళని అడిగింది. పూలు కొనుక్కుంటాం, ఇస్తారా అని. ఇక్కడ అమ్మం, కవర్ ఉంటే కోసుకుని తీసుకెళ్ళమన్నారు. కవర్ కోసం వెతుక్కుంటూ, దొరక్క దాని స్కార్ఫ్ తీసి ఇస్తే, దీపు తూలి వెనక్కు పడేటన్ని పూలు ఒడి నిండా పోసారు. ఎన్ని కిలోలో! చీకటి పడేదాకా ఆ పక్క తోట, ఆ పక్క తోట అంటూ నడుస్తూనే ఉన్నాం అందరం. చీకట్లు ముసురుకుంటూ ఉండగా, పక్కనున్న గులాబీ తోటమాలి వచ్చారు. పెద్దాయన. ఆ పూవుల్నీ, మూల ఉన్న పచ్చిమిర్చి ని కోసుకు తీసుకు వెళ్ళమన్నారు. ఇంటికి రమ్మని పిలిచారు కూడా. తోటకి ఎవ్వరు వచ్చినా ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడం ఆయన అలవాటట. భలే. ఒంటరి లో రైతు గుర్తొచ్చాడు చప్పున. వాళ్ళావిడ గోరుచిక్కుళ్ళు తెమ్మందిట. అన్నీ మూట గట్టుకు తీసుకెళ్తున్నాడాయన. త్వరగా వెళ్ళాలనీ, ఆమె వంటకు ఆలస్యమైపోతుందనీ మా దగ్గర సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. దూరంగా కొబ్బరి చెట్ల వెనుక అస్తమించే సూర్యుడు. ఆకాశమంతా లేత ఎరుపు రంగు. ఇహనో ఇప్పుడో కమ్ముకునే చీకట్లు అన్నట్టుంది. కళ్ళ ముందంతా పచ్చాపచ్చని చామంతులు. ఆ గాలంతా ఉందా లేదా అన్నంత పల్చని పూల పరిమళం. తెల్ల చామంతులైతే చూపు తిప్పుకోనివ్వలేదు. ఉన్న కాసిన్ని గులాబీలదీ భలే మత్తు పరిమళం. తోట బయటకు వచ్చి నాలుగు అడుగులు వేశామో లేదో వారమంతటికీ సరిపోయేంత ఆకుకూరలు కట్టలు కట్టి అమ్ముతున్నారు. తోటకూర పెసరపప్పు వేసి పొడికూరగానూ, పప్పో రోజూ పులుసో రోజూ అని అక్కడే ప్లాన్‌లు వేసి కొనేశాం, ఆ తాజా ఆకుల్ని చూసి వదిలిపెట్టబుద్ధి గాక. కార్ ఎక్కుతూ వెనక్కి చూస్తే అంతా చీకటైపోయింది. తోట వెనుక ఎక్కడో దూరాన చిన్న డాబా ఇంటి వరండాలో లైటు వెలుతురే ఆ కాస్త మేరా ఉంది.

ఒక మామూలు వేసవి సాయంత్రం

 పిల్లాడి సెలవులు.

"అమ్మా...ఒక్క ఫైవ్ మినిట్స్ బయట ఆడుకుని వచ్చేయనా"
ఆఫీస్ కాల్స్ వెనుక, మళ్ళీ మొదలైన అల్లరి రాగం.
*
వేసవి సాయంకాలం.
వేళకి ఆఫీసు పని పూర్తైన ఉత్సాహం. వేళకి ఇంటి పనిలో పడితే వచ్చే సంతోషం.
బాల్కనీ తలుపులు తెరిస్తే, వెచ్చగా చెంపలను కొడుతోంది గాలి. కార్పొరేట్ లైఫ్ కాజేసిన సౌందర్యమంతా పోతపోస్తున్నట్టు, అద్దం మీద రంగు తెరలు. నీలం, పసుపు, ఎరుపు...గదంతా పరుచుకునీ చెరిగిపోతున్న మెరుపులు. దుప్పట్ల మీద తలగడల మీద సగానికి తెరుచుకున్న పుస్తకాల మీద గళ్ళుగళ్ళుగా వెలుతురు మరకలు. చిలకరించిన నీళ్ళ మెరుపులతో పొద్దున తళతళలాడిన కుండీలోని మొక్కల చుట్టూ వడిలి రాలిపోయిన ఆకులిప్పుడు. ఎండుటాకుల గలగలలను దోసిలి పట్టి పక్కకు నెట్టి, శుభ్రం చేయడానికి కుండీ జరిపితే, చిగురెరుపు పలకరింపులు. మునివేళ్ళతో తడిమి చూసుకుంటాను, పసి మొగ్గల మెత్తదనాన్ని, ఈ రోజుకి మెరిసిన మొదటి నక్షత్రపు నీడలో నిలబడి.
ఆరిపోయి మడతల కోసం చూస్తున్న బట్టలు. ఖాళీ చెయ్యాల్సిన గిన్నెలు. పిల్లాడికి పాలు. నాకొక అరకప్పు కాఫీ. అవినేని భాస్కర్ దగ్గర అప్పు తెచ్చుకున్న పుస్తకం.
నాన్నగారి కోసం వెదికి కొన్న వాలు కుర్చీలో జారబడితే, నగరపు రొదలో లయగా ఇమిడిపోగల నెమ్మదితనం. కాఫీ కప్పులోని మొదటి చుక్కకీ ఆఖరు చుక్కకీ వేడిలో తేడాలు పట్టుకునే తీరికతో ఆకాశాన్ని కొలుచుకునే మనసు.
పొటాటో ఫ్రై చెయ్యమ్మా...మెడ చుట్టూ చేతులు వేసి బతిమాలతాడు పిల్లాడు. మిరియాల చారు మస్ట్...పిల్లాడి నాన్నా వంటింట్లోకి చేరతాడు. ఐదు దుంపలు, మూడు టొమాటోలు. కిచెన్ గట్టు మీద మరకవుతుందా?
మూడు విజిల్స్ వచ్చాక, మూడు నిమిషాలు సిమ్‌లో ఉంచి కట్టెయ్. స్నానానికి వెళుతూ రోజూ చెప్పే లెక్కే గుర్తుగా చెప్తాను.
*
"నాన్నా...నావి వైట్స్..." ఆట మొదలవుతుంది లోపలెక్కడో.
పెరుగూ పాలూ చిన్న గిన్నెల్లోకి మార్చి మిగతావి సింక్‌లోకి. రేపటికి నానబెట్టాల్సినవి - టిక్. రేపటికి తోడుబెట్టాల్సినవి- టిక్. బిగ్ బాస్కెట్ ఆర్డర్స్ - టిక్, టిక్.
సాయంకాలపు సందడి మొత్తం రాత్రి దుప్పటి కింద ఒదిగి నిద్రపోతుంది. వేసవి రాత్రుల పల్చని చలి గాలి వంటింట్లోకి ఊపిరి తెస్తుంది. పిల్లాడి అల్లర్లలో నలిగిన ఇల్లంతా సర్దుకుని, మెలమెల్లగా చల్లబడుతుంది. తలుపులన్నీ గుర్తుగా మూసేస్తూ తొంగి చూస్తానా, చందమామ గుబురు చెట్ల పొదలను వెలిగించే వెన్నెలై నా ఇంటి కిందకి పాకుతూంటుంది.
*

ఇంకో వాన

 వాన పడేట్టు ఉంది.

ఆకాశపుతునకలోని నలుపంతా తాకి చూసి

మెల్లగా ఊపిరి తీసుకుంటుందో పద్యం

"ఎందుకో తెలీదు వానంటే ..."

*

ముసురుకునే చీకట్లు

ఇంకా, వాన ముందటి ఉడుకు గాలి

గదిలో ఇదిగో

నువు వెలిగించిన

పరిమళదీపం

కావలించుకుంటావు దగ్గరకొచ్చి

దాని కళ్ళల్లో వెలిగే కాంతిని.

*

గాజుకూజా అడుగు నీళ్ళల్లో

పెనవేసుకుంటూ

తాజాపూల పొడవాటి కాడలు

గదిలో నీడలు, నీడలను

నిమిరే నీ పొడవాటి వేళ్ళు

ముద్దాడుతావు నువ్వు

పెదిమలు దాచిన మాటల్ని

చలిగాలి వీస్తుంటే

ముడుచుకునే దేహాన్ని

*

వాన కురుస్తూనే ఉంది.

పూర్తి కాని పద్యమొకటి

నీ కౌగిట్లో సొమ్మసిల్లి

నిశ్చింతగా నిద్రపోతోంది.

*

"ఎందుకో తెలీదు వానంటే ..."

ఇష్టం నాకు.

చాలా.

*

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...